Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీ రామబాణానికి ఎదురుగా ‘దుర్గాస్త్రం’… ఆమె ప్రయోగం ఫలించింది…

October 6, 2021 by M S R

దుర్గా పూజకు మహిళా కమిటీలు… దీదికి కొత్త శక్తి………. రాజకీయాలకు సాంస్కృతిక అంశాలు చాలా దగ్గర. సొంత వాళ్లను జమ చేసేందుకు, ప్రత్యర్థిని ప్రజలకు శతృవుగా చూపేందుకు రాజకీయాల్లో సాంస్కృతిక విషయాలు బాగా పనికి వస్తాయి. కులం, మతం, ప్రాంతీయం, జాతీయం… ఏదైనా సరే దానికి సాంస్కృతిక పంథాను జోడిస్తే రాజకీయాల్లో ఎక్కువసార్లు గెలుపే. దక్కిన విజయాలను కొనసాగించేందుకూ ఇదే ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. ఢిల్లీ గద్దె లక్ష్యంగా పని చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ… బీజేపీని దాని మార్గంలోకి వెళ్లే దెబ్బ కొట్టింది. మతంతోపాటు సంస్కృతినీ కలిపితే ఇంకా బలంగా ఉంటుందని చూపించింది. మహిళగా రాష్ట్రంలోని మహిళా శక్తిని తృణమూల్‌తో కలిపేందుకు వేసిన ప్రణాళిక సక్సెస్ అయ్యింది. దక్కిన విజయంలో అక్కరకు వచ్చిన ఆయుధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది.

durga

హిందువుల పెద్ద పండగ దసరా నవరాత్రి ఉత్సవాలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేసినా దేశవ్యాప్తంగా ఇదే పెద్ద పండగ. దసరా సందర్భంగా నిర్వహించే దుర్గా పూజ దేశవ్యాప్తంగా ఉన్నా పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యేకం. కలకత్తా కాళిమాత అని అందుకే నానుడి. పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ అతి పెద్ద సాంస్కృతిక ఉత్సవం. దుర్గా పూజ ఉత్సవాన్ని మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా కొత్తగా మార్చింది. దుర్గా పూజ (దేవత) అయినా ఈ ఉత్సవంలో మగవాళ్ల పెత్తనమే. ఏర్పాట్లు, నిర్వహణ, పూజలు అన్ని వాళ్లే చేయడం ఎప్పటి నుంచో ఇలా వస్తోంది. మహిళలు మండపాల వద్దకు ‘మొక్కుబడి’గా వచ్చిపోతుంటారు. అతి పెద్ద సాంస్కృతిక ఉత్సవంలో మహిళల పాత్ర పెంచేలా మమతా బెనర్జీ గత ఏడాది కొత్త ఆలోచన చేసింది. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో జరిగే దుర్గా పూజ కార్యక్రమాలకు ప్రభుత్వం తరుపున రూ.50 వేల చొప్పున ప్రోత్సాహం (ఇన్సెంటివ్‌) ఇచ్చేలా పథకాన్ని తెచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా బీజేపీని ఎదుర్కొనేందుకు గత ఏడాది దసరా నుంచి పశ్చిమ బెంగాల్‌లో ఈ పథకం అమలవుతోంది.

Ads

దీది ఈ పథకం పెట్టిన తర్వాత పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది. దుర్గా పూజ నిర్వహణ, ఏర్పాట్లు అన్ని మహిళలే చూసుకుంటున్నారు. దుర్గా పూజ నిర్వహణ కోసం ప్రత్యేకంగా మహిళా కమ్యూనిటీలు ఏర్పాటయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 36 వేల దుర్గా పూజ కమ్యూనిటీలు ఉన్నాయి. మమత బెనర్జీ ‘ప్రోత్సాహక పథకం’ ప్రకటించిన తర్వాత 1500 మహిళా దుర్గా పూజ కమ్యూనిటీలు అధికారికంగా నమోదయ్యాయి. ఇలా నమోదైన మహిళా దుర్గా పూజ కమ్యూనిటీలు అన్నింటికీ ప్రభుత్వం రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకం ఇచ్చింది. గతంలో మగవాళ్ల ఆధ్వర్యంలో దుర్గా పూజ జరిగే అనేక క్లబ్‌లు, సంఘాలు ఇప్పుడు మహిళకే బాధ్యతలు అప్పజెప్పుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకంతో దుర్గా పూజలు గతంలో కంటే ఘనంగా జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మహిళా పూజారులతోనే పూజలు నిర్వహిస్తున్నారు. మహిళా దుర్గా పూజ కమిటీలు పశ్చిమ బెంగాల్‌లో సాంస్కృతికంగానే కాకుండా సామాజికంగా అనేక మార్పులు తెస్తున్నాయి.

durga

తృణమూల్‌ కాంగ్రెస్ కాంగ్రెస్ పదేండ్ల పాలనలో పండగల నిర్వహణకు ప్రభుత్వ నిధులు ఇచ్చే పథకం ఏదీ లేదు. మహిళలకు వ్యక్తిగతంగా లబ్ధి కలిగించే పథకాలనే ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చింది. ‘కన్యస్త్రీ’ పేరుతో బడికి వెళ్లే ప్రతి బాలికకు నగదు బదిలీ పథకం అమలవుతోంది. 12వ తరగతి వరకు ప్రతి నెల రూ.750 చొప్పున… 12వ తరగతి పాసైతే రూ.25 వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ పథకం తృణమూల్‌ కాంగ్రెస్కు మంచి పేరు తెచ్చింది. ‘రూప స్త్రీ’ పథకం కింద ఆడపిల్ల పెండ్లి ఖర్చుల కోసం రూ.25 వేలు ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబాల్లోని మహిళకు ప్రతి నెల వెయ్యి రూపాయలు (మగవాళ్లకు రూ.500) చొప్పున ఇచ్చేలా ‘లక్ష్మీర్‌ భందర్‌’ పథకాన్ని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద రెండు కోట్ల మంది నమోదు కావడంతో ఆర్థికంగా పెద్ద భారమే అవుతోంది.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘స్వస్థ సతి’ పేరుతో మమతా బెనర్జీ రూ.5 లక్షల మెడికల్‌ ఇన్సూరెన్స్​‍ పథకాన్ని తెచ్చింది. కుటుంబంలోని మహిళ (యజమానురాలు) పేరుతోనే ఈ పథకం అమలవుతోంది. ప్రజా సంక్షేమం పథకాలతోపాటు సాంస్కృతిక పథకం రాజకీయంగా బాగా కలిసి వచ్చిందని తృణమూల్‌ కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. ఆ రాష్ట్రంలోని ప్రముఖ సెఫాలజిస్టు సంస్థలు నిర్ధారిస్తునాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 52 శాతం ఆడవాళ్లు, 44 శాతం మంది మగ ఓటర్లు తృణమూల్‌ కాంగ్రెస్కు మద్దతు తెలిపినట్లు ఈ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో గతంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వాలు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు దూరంగా ఉండేది. దుర్గా పూజ మండపాల దగ్గర మాత్రం కమ్యూనిస్టు పుస్తకాలను అమ్మాలని ఆ పార్టీ సాహిత్య విభాగానికి గట్టిగా చెప్పేది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ కోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ ఇప్పుడు మహిళా దుర్గా పూజ కమ్యూనిటీలు బాగా యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా దుర్గా పూజ నిర్వహణకు తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ పోటీ పడి పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే !
– అజ్ఞాతి( ది హిందూ సౌజన్యంతో)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions