Vijayakumar Koduri ….. రాజా ! నీ మీద మీ అరవం వాళ్ళు సినిమా ఒకటి తీస్తున్నారట కదా !
ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటుందా ?
ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటే అన్యాయం కదా రాజా !
Ads
నా బోటి అనేక వేల, లక్షల, కోట్ల మంది కథ కూడా ఈ సినిమాలో భాగం కావాలి కదా రాజా !
నా బోటి అనేకమంది బాధలలో, సంతోషాలలో, గాయాలలో, నిదురపట్టని రాత్రులలో, భగ్నమైన ప్రేమలలో, పురివిప్పిన మధుర స్నేహాలలో నీ పాటలే కదా ఆత్మీయ మిత్రునిలా పక్కన నిలబడింది
2
అప్పుడెప్పుడో చిన్నతనంలో వివిధభారతి లో పాటలు వినడం మొదలు పెట్టిన రోజులలో అనేకానేక పాటల నడుమ నీ ‘చిన్ని చిన్ని కన్నయ్యా’ పాట తొలిసారి విన్నపుడు ఏదో తెలియని సంభ్రమాశ్చర్యానికి లోనయిన క్షణాలు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ తరువాత ఎప్పటికో గానీ తెలియలేదు – ఆ పాటకు స్వరకల్పన చేసింది నీవేనని.
అప్పటిదాకా హుషారు గీతాలంటే ‘అత్తమడుగు వాగులోనా’ అని ఎన్ టీ ఆర్ కోసం మా చక్రవర్తి వీర లెవెల్లో డప్పులు వాయించే పాటలే అని భ్రమించిన రోజులలో, మా వరంగల్ గణేష్ మండపాల ఆర్కెస్ట్రాలలో తొలిసారి విన్న నీ ‘మబ్బే మసకేసిందిలే’ పాట నింపిన ఆ సరికొత్త హుషారుని ఎట్లా మరచిపోను ?
అన్నట్టు హుషారు పాట అంటే గుర్తుకొచ్చింది – ‘అభిలాష’ లోని ‘నవ్విందీ మల్లెచెండూ’ పాటతో జనాలని పిచ్చెక్కించావు గదా రాజా !
అంతెందుకు …. ఆ ఛాలెంజ్ సినిమాలోని ‘ఇందువదన’ పాటతో ఎంతగా జనాల మతిపోగొట్టేవాడివి. సినిమా మొదట్లోనే వచ్చే ఆ పాట కోసమే పదే పదే థియేటర్ కు వచ్చి, బోల్డంత మంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయేవారు కదా!
ఆ ‘వయసు పిలిచింది’ సినిమాలోని ‘ఇలాగే ఇలాగే’ పాట, పాటలో పల్లవి చరణాల నడుమ వినిపించే బి జి ఎం లు ఏళ్లుగా నా చెవులలో తిష్ఠవేసుకుని వున్నాయంటే నమ్మగలవా రాజా?
ఆ తరువాత ఎనిమిదో తరగతిలో వున్నప్పుడు అనుకుంటా – పక్కింటి అన్నయ్య వాళ్ళు ‘వసంత కోకిల’ సినిమా చూసొచ్చి, ‘కథగా కల్పనగా దొరికింది’ పాటను పాడుకుంటూ శ్రీదేవితో ప్రేమలో పడిపోవడం ఇంకా గుర్తుంది. కాస్త కాలం గడిచాక నాకొచ్చిన సందేహం ఏమిటంటే, మంత్రించిన నీ పాటే వాళ్ళను శ్రీదేవితో ప్రేమలో పడేసి వుంటుందని.
వేణువు, వయోలిన్ లతో మాంత్రిక సంగీతం వినిపించి, మమ్మల్ని నేల మీద వుండకుండా మబ్బుల లోకంలోకి తీసుకెళ్ళినందుకు నీకు ఎన్ని శిక్షలు వేసినా తక్కువే రాజా !
ఒకానొక కాలంలో అట్లా రోడ్డు మీద వెళుతున్నప్పుడు నువ్వు స్వరపరిచిన ‘పరువమా చిలిపి పరుగు తీయకు’, ‘పూవై పుట్టి పూజా చేసి పోనీ రాలిపోనీ’, ‘ఆకాశం ఏనాటిదో’ ‘నెలరాజా పరుగిడకు’ వంటి అనేక పాటలు ఏ రేడియో లోనుంచో వినిపిస్తే విగ్రహంలా ఒకపక్కన నిలబడిపోయి ఆ పాట ఆసాంతం విన్నాక గానీ అక్కడ నుండి ముందుకు కదలని నా వెర్రి రోజులని మర్చిపోగలనా రాజా?
3
ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఎప్పుడైనా గుర్తుకు వస్తే ఒక్క క్షణం బాధగా అనిపించే ఒక సంఘటన చెప్పనా రాజా? వరంగల్ రైల్వే గేటు ఏరియాలో నా స్కూల్ రోజులలో మేము వున్న ఇంటి ఓనర్ మనవడు, నవయువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ముందు వారం రోజుల పాటు ‘సితార’ సినిమా చూస్తూ, అందులోని పాటలే వింటూ ఉండేవాడట!
ఆ అన్న జీవితంలో ఏం జరిగి ఉంటుంది రాజా?
4
రాజా !
ఇది అన్నింటికన్నా ముఖ్యమైన రహస్యం
హైదరాబాద్ గురించి వినడమే తప్ప ఎన్నడూ చూసి ఎరగని నన్ను మొదటిసారి వరంగల్ నుండి హైదరాబాద్ దాకా రప్పించింది నీ పాటే కదా! త్యాగరాజ గానసభలో జరిగిన ‘అభినందన’ సినిమా పాటల పోటీ కోసం నా జేబులో అరవై రూపాయలు పెట్టి పంపిన అప్పటి స్నేహాలను ఎట్లా మరచిపోను రాజా ?
‘ప్రేమ లేదనీ ప్రేమించ రాదనీ’ పాటను బాగా ప్రాక్టీస్ చేసి వేదిక మీద పాడితే, ‘కంఠం ఇంకా లేతగా వుంది’ అని కన్సోలేషన్ బహుమతి ఇచ్చిన ఆ న్యాయ నిర్ణేతలది భలే దయాగుణం!
‘అదే నీవు- అదే నేను’ పాట పాడిన కర్నూలు రమణను విన్న తరువాత మాత్రం అతనికే బంగారు పతకం రావాలనుకున్న.
నిజంగానే అతడికే వచ్చింది రాజా !
వేదిక మీద పాట పాడి వచ్చిన రమణ నా పక్కనే కూర్చుని జేబులో వున్న నీ ఫోటో తీసి చూపించి ‘నా దేవుడు బ్రదర్’ అని ఆవేశంగా చెప్పిన మాట ఇప్పటికీ జ్ఞాపకం వుంది రాజా !
కొంతకాలం ఆ రమణ ఉత్తరాలలో పలకరించేవాడు – సినిమా సంగీత దర్శకుల దగ్గర ట్రాక్ సింగర్ గా పాటలు పాడుతూ మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నానని.
ఇప్పుడు ఆ కర్నూలు పాటగాడు ఎక్కడ వున్నాడో రాజా ?
రమణ సరే రాజా …. ఒకప్పుడు నాలో జీవించిన ఆ పాటగాడు ఏమైపోయాడని కూడా వెతుక్కుంటూ వుంటాను రాజా !
5
గమ్మత్తైన సంగతి ఏమిటంటే రాజా !
నా 18 ఏళ్ల వయసులో మా వీధిలోంచి వెళ్లే ఒక అమ్మాయి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళేది. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా, హృదయం సినిమాలో ‘ఊసులాడే ఒక జాబిలట’ పాట నన్ను కబళించేక, ఆ పిల్ల నాకోసమే అట్లా వెనక్కి తిరిగి చూస్తున్నదేమో అన్న భ్రమలో పడిపోయేను.
ఆ తరువాత కూడా అందమైన పిల్ల ఎవరైనా నాతొ ప్రేమలో పడకపోతారా అని నలుగురు కూడిన చోట ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ పాట ఎన్నెన్ని సార్లు పాడి వుంటాను రాజా !
ఆహా -ఓహో అన్నవాళ్ళే తప్ప అయ్యో అని కరుణించిన వాళ్ళు దొరకలేదు కదా
ఆ తరువాత కాలంలో నీ ‘వొళ్ళంత తుళ్లింత కావాలిలే’ పాటతో మొత్తం తెలుగు అమ్మాయిలందరినీ నువ్వే బుట్టలో వేసుకున్నావు కదా రాజా !
6
తవ్వుకుంటూ వెనక్కి వెళితే కాలం తెలియడం లేదు రాజా !
ముఖ్యంగా అనేక ఆటుపోటుల నడుమ సాగిన నా యవ్వన దినాలలో తోడుగా నిలబడిన స్నేహాలలో నీ పాటలు కూడా వున్నాయి రాజా !
ఏవో కొన్ని పాటలను ఈ రోజు ఇట్లా గుర్తు చేసుకున్నా గానీ కాస్త సావకాశంగా కూర్చుంటే నీ పాటల ప్రవాహం అట్లా సాగుతూనే ఉంటుంది కదా !
నీ మీద రాబోయే సినిమాలో నీ కథ మాత్రమే కాకుండా, నీ పాటల ఊతంతో గడ్డు రోజులలో కొన్ని జీవిత అగడ్తలను దాటిన మా బోటి వాళ్ళ కథలను కూడా కాస్త ప్రస్తావించమని నువ్వు చెప్పాలి రాజా!
చిన్ని చిన్ని కన్నయ్యా -పాట లింక్
https://youtu.be/h9orT_4wNvI?si=xA8nH_-ID2R4iPZo
కథగా కల్పనగా పాట లింక్
https://youtu.be/PccTGESPppE?si=BXnqHgK1YC0deZie
ఇలాగే ఇలాగే పాట లింక్
https://youtu.be/_tNLfn9IboM?si=LArYoePomgh0v4qU
నవ్వింది మల్లెచెండు – పాట లింక్
https://youtu.be/82hUDmPYazk?si=biszFRKbfiCyotLY
జిలిబిలి పలుకుల – పాట లింక్
https://youtu.be/yJNSkGafGJw?si=vbJ7UWae6osWt4hh
పూవై పుట్టి పూజే చేసి – పాట లింక్
https://youtu.be/U4Fi3CT0C1M?si=8BzU1hSA3HO3mnlB
ప్రేమ లేదని ప్రేమించా రాదని – పాట లింక్
https://youtu.be/Tbs6tnzdorE?si=u6WjQu9a-UvTsmkQ
ఊసులాడే ఒక జాబిలట – పాట లింక్
https://youtu.be/sDmEuPOwECo?si=Pq720hKfod8KBKjz
జాబిల్లి కోసం ఆకాశమల్లే – పాట లింక్
https://youtu.be/KqT5V5wSP8c?si=KB2j2PfI1eg2QZnl
ఆకాశం ఏనాటిదో – పాట లింక్
https://youtu.be/Z9-me8v46d0?si=INoHQzKFAjsZCNrV
నెల రాజా పరుగిడకు – పాట లింక్
Share this Article