ఒక వ్యక్తి ఏదైనా ఓరంగంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ పోతే.. కింగ్ కావచ్చునేమో! కానీ, ఒకే వ్యక్తి తానేరంగాన్నెంచుకుంటే అందులో.. రింగ్ తిప్పొచ్చా..? అలా చక్రం తిప్పాడు కాబట్టే ఆయన గురించి ఈ ముచ్చట.
ఏకంగా 20 డిగ్రీలు… రెండుసార్లు యూపీఎస్సీలో ఉత్తీర్ణుడు.. ఐఏఎస్ సాధించినోడు.. అంతే సులభంగా దాన్ని జుజుబీ అన్నట్టుగా వదిలేసినోడు.. ఎవరతను..?
శ్రీకాంత్ జిచ్ కర్. చదువు పట్ల ఏ మాత్రం ఆసక్తి కనబర్చేవారికైనా… ఈయన స్టోరీ వింటే జస్ట్ గూస్ బంప్సే!
Ads
ఓ వ్యక్తి ఓ లాయరో, డాక్టరో, ఇంజనీరో, మ్యూజిక్ డైరెక్టరో, క్రికెటరో, రాజకీయ నాయకుడో, ఐఏఎస్సో, ఐపీఎస్సో కావాలనుకుని ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం సర్వసాధారణం. అలాంటి లక్ష్యాలున్నప్పుడే మనుషులు తామనుకున్న గమ్యాలను చేరుకునే కృషికి ఆస్కారముంటుంది. కానీ, బహుళ రంగాల్లో తనదైన ముద్ర వేశాడు కాబట్టే శ్రీకాంత్ జిచ్ కర్ అనే ఈ మరాఠీ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి.
శ్రీకాంత్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎండీ పూర్తి చేసిన వైద్యుడు. బ్యాచిలర్ ఆఫ్ లా చేసిన న్యాయవాది. ఇంటర్నేషనల్ లాలో మాస్టర్ ఆఫ్ లా చేసిన అడ్వకేట్. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్. డాక్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ చేసిన మార్కెటింగ్ నిపుణుడు. బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం చదివిన జర్నలిస్ట్. సంస్కృతంలో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ సాధించిన పండితుడు. అలాగే సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్స్, ఎకనామిక్స్, హిస్టరీ, సంస్కృతం, ఫిలాసఫీ, పొల్టికల్ సైన్స్, ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ సాధించిన చదువరి. యాన్షియన్ ఇండియన్ హిస్టరీ, ఆర్కియాలజీ, మరియు సైకాలజీల్లోనూ మాస్టర్స్ పట్టా పొందిన సరస్వతీ పుత్రుడు.
పైన చెప్పుకున్న శ్రీకాంత్ సాధించిన బ్యాచిలర్స్ కమ్ మాస్టర్స్ డిగ్రీస్ అన్నింటిలోనూ.. ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ గా గోల్డ్ మెడల్స్ సాధించినవంటే.. అకాడమిక్ పుస్తకాలతో మైక్ టైసన్ మించిన కుస్తీ కనబడట్లేదు..? 1973 నుంచి 1990 మధ్య కాలంలో ప్రతీ సమ్మర్ లోనూ.. ప్రతీ వింటర్ లోనూ ఏదో ఒక యూనివర్సిటీలో.. శ్రీకాంత్ ఏదో ఒక ఎగ్జామ్ రాస్తుండటం ఆయన సుమారు 17 ఏళ్ల కాలపు జీవితచర్యలా మారిపోయింది. అలా 42 యూనివర్సీటీస్ లో ఎన్నో అంశాల్లో రీసెర్చ్, మాస్టర్స్ ఇలా ఏదో ఒక చదువు కొనసాగుతూనే ఉండేది.
1978లో మొదటిసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసిన శ్రీకాంత్.. ఐపీఎస్ కు సెలక్టయ్యాడు. కానీ, ఐపీఎస్ కు రిజైన్ చేసిన శ్రీకాంత్ జిచ్ కర్.. 1980లో ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. అయితే, ఐఏఎస్ కు సరిగ్గా నాల్గు నెలలు తిరక్కుండానే రాజీనామా చేసేశాడు. అసలు ఒక్క డిగ్రీ పొందడమే గగన గండమై ఫేక్ సర్టిఫికెట్స్ తో ఎందరో వివిధ రంగాల్లో రాజ్యమేలుతున్న కాలంలో… ఇన్నేసి డిగ్రీలు.. ఐపీఎస్, ఐఏఎస్ వంటివాటికి సెలక్షన్.. వాటిని తృణప్రాయంగా వదిలేయడమంటే.. కాస్త అతిశయోక్తిగానే అనిపిస్తుంది. కానీ, శ్రీకాంత్ జిచ్ కర్ అదే చేశాడు.
ఎందుకు ఐఏఎస్ కు జిచ్ కర్ రిజైన్ చేశాడు..?
1980లో ఐఏఎస్ కు రాజీనామా చేసిన శ్రీకాంత్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిల్చాడు. నిలవడమే కాదు. అప్పటివరకూ సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న ట్యాగ్ కాస్తా పక్కకు జరిపి.. ప్రజాక్షేత్రంలో నిల్చి గెల్చాడు. అలా 1980 ఎన్నికల్లో గెలిచి.. దేశం మొత్తంలోనే 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన యంగెస్ట్ శాసనసభ్యుడిగా రికార్డులకెక్కాడు. అంతటితో ఆగాడా ఆ మహానుభావుడు..? మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రయ్యాడు. ఏకంగా ఒక్కడే 14 ఫోర్ట్ పోలియోస్ పర్యవేక్షించాడు. ఆ తర్వాత 1986-92 మధ్య ఎమ్మెల్సీగా కూడా ఎంపికై.. అప్పుడూ మంత్రిగా తన సేవలందించాడు. ఆ తర్వాత 1992 నుంచి 1998 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
శ్రీకాంత్ జిచ్ కర్ ఫౌండేషన్ సాయంతో ఇవాళ నాగపూర్ లో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే సాందీపనీ స్కూల్ ను స్థాపించిన వ్యవస్థాపకుడు కూడా నడిచే శ్రీకాంత్ అనే గ్రంథాలయమే. 1998లో బండారా-గోండియా లోక్ సభ స్థానం నుంచి.. అలాగే, 2004లో రాంటెక్ లోక్ సభ స్థానం నుంచి పోటీగా చేసి మొట్టమొదటిసారి.. తక్కువ మార్జిన్ ఓట్లతో ఓటమి చవిచూశాడు శ్రీకాంత్. కానీ, ఈ సరస్వతీ పుత్రుడైన అపర మేధావి.. నాగపూర్ కు 64 కిలోమీటర్ల దూరంలోని కొందాలి అనే ఊరు వద్ద.. తన కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో 2004, జూన్ 2వ తేదీన తన 49 ఏళ్ల వయస్సులో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పటికీ సాందీపనీ స్కూల్ లో.. జీరో గ్రావిటీ ఫౌండేషన్ పేరుతో.. అక్కడి విద్యార్థులు శ్రీకాంత్ స్ఫూర్తితో చేస్తున్న ఎన్నో ప్రయోగాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇంతకన్నా సరస్వతీ పుత్రుడింకెవరైనా అరుదుగా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చునేమోగానీ.. మేలిమి భారత జాతిరత్నం శ్రీకాంత్ జిచ్ కర్. ఈ యుగంలో ఈ దేశం చూసిన.. రెండు పాదాలపైన నడిచిన ఓ ఎన్ సైక్లోపిడియా. నేటి చదువరులకే కాకుండా.. చదువుకుంటే ఒక మనిషి ఎలా ఎదగచ్చో చెప్పడానికి ఓ ప్రతీక.. శ్రీకాంత్ జిచ్ కర్… (Article By రమణ కొంటికర్ల)
Share this Article