.
లైఫ్ అంటే ఒక ఇమేజ్ చట్రంలో చిక్కుకోవడం కాదు.. తమ చుట్టూ ఉన్న కొన్ని లేయర్స్ పరిధిలోనే ఉండటం కాదు.. బౌండరీలు దాటే మనస్సుంటే వయస్సైపోయినా కొత్త కొత్తగా ఇంకేదైనా చేయొచ్చు.. ఇదిగో ఇలాంటి ఆలోచనల్లో కొందరు కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తే తమిళ్ సూపర్ స్టార్.. థాలా అజిత్ కుమార్. రీల్ హీరో కాదు, రియల్ హీరో… సోకాల్డ్ తోపు హీరోలకూ మింగుడుపడని హీరో అజిత్…
ఈ మాటంటోంది ఎవరో కాదు.. సఖి, చెలి అంటూ తమిళ, తెలుగు అమ్మాయిలెందరి హృదయాలో కొల్లగొట్టిన హీరో మాధవన్. అందుకే తాను థాలాకు సెల్యూట్ చేస్తున్నానంటున్నాడు మాధవన్.
Ads
ఎందుకంటే, మాధవన్ ఇప్పుడు మళ్లీ పతాక శీర్షికలకెక్కాడు. నటుడిగానో, తన కొత్త సినిమా ఎవరో సుప్రసిద్ధ దర్శకుడితో ప్రకటించో కాదు.. తనకిష్టమైన రేసింగ్ లోకి మరోసారి దూసుకొచ్చి.
నటుడిగానే కొనసాగి ఉండి ఉంటే అజిత్ తమిళ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలు చేసే విక్రమ్, సూర్య తరహాలోనో.. మాస్ ఇమేజ్ తో తమిళ సూపర్ స్టార్ గా ఎదిగి, ఇప్పుడు రాజకీయాల్లోకి దూసుకొచ్చిన విజయ్ లాగానో.. ఇంక తనకెదురే లేకుండా ఉండేవాడేమోగానీ.. అజిత్ టేస్ట్ వేరు. తనో నటుడిగా, హీరోగా క్యారెక్టర్స్ చేస్తున్నా… తన దృష్టి మాత్రం ఎప్పుడూ రేసింగ్ ట్రాకులపైనే! ప్లస్ తుపాకులు, డ్రోన్లు…
ఇప్పుడు మళ్లీ అజిత్ కుమార్ స్పెయిన్ లోని సర్క్యూట్ డి బార్సిలోనా- కాటల్యునాలో నెక్స్ట్ రైడింగ్ కోసం రెడీ అవుతున్నాడు. దీంతో మోటార్ స్పోర్ట్స్ పై అజిత్ అభిమానం మరోసారి వార్తై కూర్చుంది. ఇప్పుడు తోటి నటులు కూడా అభినందనలు కురిపిస్తున్నారు.
మోటార్ రేసింగ్ అజిత్ కు ఓ పిచ్చి.. ఆ కలల వెంట తను పరుగెడుతూనే ఉంటాడు. దానికి తన సినిమా కెరీర్ తో సంబంధం లేదు.. వయస్సుతో అంతకన్నా సంబంధం లేదు.. తనకు మోటార్ స్పోర్ట్స్ పట్ల ఉన్న క్రేజ్.. తనకిష్టమైన క్రీడలో ఏదో సాధించాలన్న తపన, సంకల్పం ఆకట్టుకునేవంటాడు మాధవన్.
ఎప్పుడెప్పుడు అజిత్ ట్రాక్ పైకెక్కుతాడా.. అతడి అభిమానిగా, సహనటుడిగా ఆ దృశ్యాన్నెప్పుడెప్పుడు చూస్తానా అన్న క్యూరియాసిటీ తనను వేధిస్తోందంటూ తన ఆసక్తిని కనబరుస్తున్నాడు మాధవన్.
త్వరలోనే ఫార్మూలా వన్ రేసులో పాల్గొనబోతున్న అజిత్ 24H రేస్ కోసం సంసిద్ధమవుతున్న తన ఫోటోస్ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండింగ్ గా మారాయి. మాధవన్ తో పాటు, సహ నటులెందరి నుంచో అభినందనలు వెల్లువెతుతున్నాయి. మరోవైపు ఇక ఆయన అభిమానులైతే ఆకాశానికెత్తేస్తున్నారు.
అయితే, ఈసారి పోటీల్లో అజిత్ వ్యక్తిగతంగా ఫార్మూలా రేసింగ్ లో పాల్గొనడమే కాకుండా… ఓ జట్టుకు నాయకుడిగా కూడా లీడ్ చేయడం విశేషం. ప్రపంచస్థాయి రేసింగ్ పోటీల్లోనూ తనను తాను నిరూపించుకోవాలన్న కసి, తపన మాత్రం ఎప్పటికప్పుడు అజిత్ లో కనిపిస్తూనే ఉంటాయి.
అజిత్ ఈ రేసింగ్ పోటీల్లో పాల్గొనడం ఇప్పుడ అజిత్ వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిందో, కేవలం తమిళ పరిశ్రమకో, సినీ పరిశ్రమకు సంబంధించిందో మాత్రమే కాదు… ఇది యావత్ దేశానికే ప్రతిష్ఠాత్మకమైన వేడుక. అజిత్ ఇటీవలే ఫెరారీ 488 EVO ఛాలెంజ్ ని దుబాయ్ ఆటోడ్రోమ్ లో నడిపి పరీక్షలో పాసయ్యాడు. దీంతో రేసింగ్ లో అజిత్ ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
యూరోపియన్ 24H సీరీస్ లో తీవ్రమైన పోటీ నెలకొన్న పోర్షే 992 GT3 కప్ తో పాటు.. ఇతర అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో కూడా ఇప్పుడు అజిత్ బృందం పోటీ పడుతోంది. కేవలం రేసులను గెలవడమే కాకుండా… ఈ రేసింగ్ పోటీల్లో భారత్ ప్రాతినిథ్యాన్ని చాటిచెప్పేలా జెండా పాతాలనీ చూస్తోంది.
ఇందుకోసం యువ డ్రైవర్స్ తో పాటు… తమ బృందాన్ని లీడ్ చేసే రోల్ లో ప్రముఖ రేసర్ ఫాబియన్ డఫీక్స్ ను నియమించుకోగా.. డఫీక్స్ కూడా అజిత్ తో కలిసి పనిచేయడాన్ని ఎంతో క్రేజ్ గా ఫీల్ అవుతున్నట్టు ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. మొత్తంగా అఫీషియల్ డ్రైవర్ గా ఫాబియన్ డఫీక్స్ ముందరి సీట్లో రేసింగ్ లో ఉంటే… లీడర్ గా బ్యాక్ సీటులో ఇప్పుడు అజిత్ ఉండబోతున్నాడు.
అజిత్ రేసింగ్ కెరీర్ లో ఇదే కొత్తేం కాదు. గతంలో 2004 ఫార్ములా ఆసియా BMW F3 ఛాంపియన్ షిప్ తో పాటు… 2010లో ఫార్ములా 2 రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ అజిత్ పాల్గొన్నాడు. అయితే, అజిత్, అదే విధంగా తాను నియమించుకున్న ఫాబియన్ డఫీక్స్ ప్రధాన లక్ష్యాలు వారికున్న క్రేజ్, పోటీ పడాలనే తపన పక్కనబెడితే… మరింత మంది యువతను ఇటువైపుగా తీసుకొచ్చే ఓ కొత్త ప్రయత్నం జరుగుతోందంటూ అజిత్, డఫీక్స్ ఇద్దరూ తమ సోషల్ మీడియా బ్లాగ్స్ లో పోస్ట్ చేస్తుండటంతో… వీరి రేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో.. మరి మనమూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా..? (రచన :: రమణ కొంటికర్ల)
Share this Article