.
శాం మాణెక్ షా & ఇందిరా గాంధీ… Sam Hormusji Framji Jamshedji Manekshaw (Sam Manekshaw)…
1971లో, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ— ‘ఐరన్ లేడీ’— శాం మాణెక్ షాను మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగినప్పుడు, ఆయన ఇలా బదులిచ్చారు… “నేను ఎప్పుడూ సిద్ధమే, స్వీటీ…”
Ads
1971 భారత- పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఫీల్డ్ మార్షల్ శాం మాణెక్ షా భారత సైనిక దళాధిపతి (Chief of the Army Staff)గా ఉన్నారు. నలభై ఏళ్ల సుదీర్ఘ సైనిక ప్రస్థానంలో ఆయన ఐదు యుద్ధాల్లో పోరాడారు. ఆయన 27 జూన్ 2008న మరణించారు.
ఒకసారి ఇందిరా గాంధీ, ఆయనను నేరుగా తన ప్రభుత్వంపై తిరుగుబాటు (coup) చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగారు. దానికి ఆయన ఇలా సమాధానమిచ్చారు: “నాకు రాజకీయ ఆకాంక్షలు లేవని మీకు తెలుసు. నా పని సైన్యాన్ని చూసుకోవడం; దేశాన్ని చూసుకోవడం మీ పని…”
మాణెక్ షా గూర్ఖా సైనికుల ధైర్యసాహసాలను ఎంతో మెచ్చుకునేవారు. ఒకసారి వీరత్వానికి పురస్కారాలు అందజేస్తున్నప్పుడు ఆయన ఇలా అన్నారు: “ఎవరైనా తనకు చావు భయం లేదని చెబితే, అతను అబద్ధం చెబుతున్నాడని లేదా అతను ఒక గూర్ఖా అని అర్థం…”
1942లో, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా జపనీయులపై తన సైన్యాన్ని నడిపించారు. బర్మాలో ఆయన కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలలో ఏడు బుల్లెట్లు తగిలాయి. నిజానికి ఆయన అప్పుడే మరణించి ఉండాలి, కానీ ఆయన పోరాటాన్ని కొనసాగించారు. ఒక డాక్టర్ చికిత్స సమయంలో “బ్రేవ్ బాయ్, నీకు ఏమైంది?” అని అడిగినప్పుడు, ఆయన “ఏమీ లేదు, ఒక గాడిద తన్నింది” అని బదులిచ్చారు. అంత తేలికగా తీసుకునేవారు జీవితాన్ని.
1948లో, మహారాజా హరిసింగ్ నుండి శ్రీనగర్ విలీన పత్రాన్ని పొందేందుకు వి.పి. మేనన్ వెళ్లినప్పుడు ఆయనతో పాటు మాణెక్ షా కూడా వెళ్లారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమి తర్వాత, బి.ఎమ్. కౌల్ స్థానంలో మాణెక్ షాకు IV కోర్ కమాండ్ బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తన సైనికులతో ఇలా అన్నారు: “ఇకపై, ఎవరూ వెనక్కి తగ్గకూడదు. ఒకవేళ మీరు వెనక్కి తగ్గాలంటే రాతపూర్వక ఉత్తర్వు ఉండాలి— కానీ మీకు అటువంటి ఉత్తర్వు ఎప్పటికీ అందదు…”
ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి వై.బి. చవాన్ సరిహద్దును సందర్శించినప్పుడు, నెహ్రూ కుమార్తె ఇందిర కూడా వారితో ఉన్నారు. బ్రిగేడియర్ బెహ్రామ్ పంతకి తన పుస్తకం *’శాం మాణెక్షా – ది మ్యాన్ అండ్ హిస్ టైమ్స్’*లో పేర్కొన్నట్లుగా…, శాం ఇందిరతో ఇలా అన్నారు. “మీరు ఆపరేషన్ రూమ్‌లోకి ప్రవేశించకూడదు; మీరు రహస్య ప్రమాణం (oath of secrecy) చేయలేదు…” అంత ఫరమ్‌గా ఉండేవాడు.
ప్రజా జీవితంలో తన చమత్కారానికి పేరుగాంచిన ఆయన, ఇంట్లో కూడా అంతే సరదాగా ఉండేవారు. ఆయన కుమార్తె మాయా దారువాలా బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు: “శాం అంటే పెద్ద మీసాలున్న గొప్ప జనరల్ అని, ఇంట్లో అందరినీ అదుపులో పెట్టేవారని ప్రజలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన చాలా సరదాగా, చిన్నపిల్లాడిలా ఉండేవారు— మమ్మల్ని ఏడిపించేవారు, ఆటపట్టించేవారు. మేము తరచుగా ‘డాడ్, ఆపండి’ అని అనేవాళ్లం. ఆయన గదిలోకి వస్తే, ఇప్పుడు ఇంకేం అల్లరి చేస్తారో అని మేము ఎదురుచూసేవాళ్లం…”

1971 మార్చిలో పాకిస్థాన్‌పై దాడి చేయాలని ఇందిరా గాంధీ కోరినప్పుడు, ఆయన నిరాకరించారు —ఎందుకంటే అప్పటికి సైన్యం సిద్ధంగా లేదు. ఆయన ఇలా అడిగారు: “మీరు యుద్ధంలో గెలవాలనుకుంటున్నారా?” ఆమె ‘అవును’ అని చెప్పారు. అప్పుడు ఆయన, “నాకు ఆరు నెలల సమయం ఇవ్వండి; మీ విజయాన్ని నేను గ్యారంటీ ఇస్తాను” అని సమాధానమిచ్చారు.
ఆమె విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు, ఆయన పాలం ఎయిర్‌పోర్టులో ఆమెను కలిసి, “మీ హెయిర్‌స్టైల్ అద్భుతంగా ఉంది” అని అన్నారు. ఆమె నవ్వుతూ, “మిగతా ఎవరూ దీన్ని గమనించలేదు” అన్నారు. ప్రధాని మీద కూడా జోక్స్ కట్ చేయగలడు… తన కళ్ల ముందే పెరిగిన ఓ చిన్నపిల్లగానే ట్రీట్ చేసేవాడు… అదే చనువు… జనరల్ షాకు సెల్యూట్…
Share this Article