‘‘కోర్టుకు పోతావా, పో… అక్కడే, ఆ కోర్టు మెట్ల మీదే నా తీర్పు ఏమిటో, నీ భవిష్యత్ ఏమిటో వెల్లడిస్తాను’’ అని హెచ్చరిస్తాడు కోపంగా పంజుర్లి దేవ ‘కాంతార’ సినిమా కథలో… ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా సదరు భూస్వామి కోర్టుకు వెళ్తాడు… ఏం జరుగుతుంది..? అక్కడే మరణిస్తాడు… సినిమాలో ఇదీ కీలకమైన సీనే… అది సినిమాలో… కానీ నిజజీవితంలో ఉడుపి దగ్గర తాజాగా అదే జరిగింది…
ఉడుపి దగ్గర పడుహిట్లు అని ఓ ఊరుంది… సేమ్, సినిమాలో చూపించినట్టే జరిగేసరికి ఆ ఊరు విభ్రాంతిలో మునిగిపోయింది… దైవకోలను ధిక్కరించి, కోర్టుకు వెళ్లడానికి నిర్ణయించుకున్న పెద్ద మనిషి నిజంగానే గుడిలో, భక్తులందరి ఎదుట హఠాత్తుగా కుప్పకూలిపోయాడు… క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు…
ఆ ఊరిలోని జరందయ గుడిలో ప్రతి ఏడాది నేమోత్సవం నిర్వహిస్తారు… అందులో గ్రామంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతారు… మన బొడ్రాయి పండుగలాగే ప్రతి గ్రామస్థుడూ తమ ఇంటి పండుగగా భావిస్తారు… జరందయ గుడి సేవాసమితి ఆ గుడి వ్యవహారాలు, ఈ ఉత్సవం ఏర్పాట్లు చూస్తుంటుంది… గతంలో ప్రకాష్ శెట్టి ఈ కమిటీకి అధ్యక్షుడు… తరువాత కొత్త కమిటీ వచ్చింది… పాత కమిటీ అధికారాలు, పెత్తనాలు ఊడిపోయాయి…
Ads
ఆ అసహనం అలాగే ప్రకాష్‌లో రగులుతోంది… కొత్త కమిటీ మీద కోపం, పగ పెంచుకున్న ఆయన ప్రస్తుత కమిటీకి సమాంతరంగా వేరే కమిటీని వేశాడు ఏకపక్షంగా… తమదే అసలైన కమిటీ అని ప్రకటించాడు… దానికి జయపూజారి అనే మరో వ్యక్తిని అధ్యక్షుడిగా చేశాడు… 9 మందితో ఏర్పడిన ఈ కమిటీ ఈ గుడి మాదే, ఈ దేవుడు మావాడే అని ప్రకటించింది…
వివాదం ఎక్కడ తలెత్తిందంటే… ఈ గుడి కొత్త కమిటీ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భూత కోల నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది… అది ఎప్పట్నుంచో వస్తున్న ఆచారం… జనవరి 7న ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది… కానీ ప్రకాష్ శెట్టి కమిటీ దీన్ని వ్యతిరేకించింది… మాదే అసలైన కమిటీ, మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా ఎవరైనా ఆ ఉత్సవంలో పాల్గొన్నా, సహకరించినా కోర్టుకు ఈడుస్తామని గుడిలో ప్రకటించింది…
కోర్టుకు నిజంగానే కొందరు అధికారుల పేర్లతో వెళ్లాడు ప్రకాష్ కమిటీ అధ్యక్షుడు జయపూజారి… స్టే ఉత్తర్వులు తీసుకొచ్చాడు… డిసెంబరు 24న అందరికీ చూపించాడు గుడిలో… చూపిస్తూ, ఒక్కొక్కరినీ బెదిరిస్తూనే అక్కడికక్కడే అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయి కూలిపోయాడు… భక్తులు, ఇతర పూజార్లు, ప్రజలు చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు..!!
Share this Article