కీరవాణికి నిజం తెలుసు… నిజం చెప్పడానికి కూడా సందేహించడు… అంతటి ఆస్కార్ వేదిక మీద తనకు ఈ అవార్డు దక్కడానికి కారణమైన వ్యక్తి పేరు ప్రస్తావించాడు… ఇంకెవరి పేరునూ ప్రస్తావించలేదు… ఆ వ్యక్తి ఎవరంటే..? కార్తికేయ..!
ఎవరు ఈ కార్తికేయ..? ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా జూనియర్ ఎన్టీయార్ తన పేరు ప్రస్తావిస్తూ కార్యశూరుడు, వెంటపడతాడు అని అభినందించాడు ఒకరకంగా…! ఈ కార్తికేయ రాజమౌళి దత్త కొడుకు… రాజమౌళి భార్య రమ మొదటి సంబంధం ద్వారా కలిగిన కొడుకు… ఆమె రాజమౌళిని పెళ్లి చేసుకున్నాక కార్తికేయను దత్తత తీసుకున్నాడు… కార్తికేయ కూడా రాజమౌళిని అప్పా అని పిలుస్తాడు… (రమ, రాజమౌళి దంపతులు మయూఖ అనే అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు… కార్తికేయ పెళ్లి చేసుకున్నామె పేరు పూజా ప్రసాద్… జగపతిబాబు మేనకోడలు, నిర్మాత గుణ్నం గంగరాజు ఆమెకు కజిన్…)
ఇదీ కార్తికేయ నేపథ్యం… ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కథ రచన మొదలుకొని, ఆస్కార్ అవార్డు గెలుపు దాకా… ప్రతి దశలోనూ కార్తికేయ తెలివితేటలే పనిచేశాయి… ఆర్ఆర్ఆర్ మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు సహా ఇప్పుడు ఆస్కార్ అవార్డు పొందడానికి తగిన కార్యాచరణ మొత్తం ఆర్గనైజ్ చేసింది కార్తికేయ… తను మార్కెటింగ్ జీనియస్… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు వెన్నెముక…
Ads
ఇండస్ట్రీలో వినిపించే చిన్నాచితకా విమర్శలు, గాసిప్స్ జోలికి పోడు, తెరపైకి రాడు… చేయాల్సిన పనిని నిశ్శబ్దంగా తెర వెనుక ఉండి చక్కబెడతాడు… తెర మీద కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, రాంచరణ్, జూనియర్ తదితరులు కనిపిస్తుంటారు… ప్రత్యేకించి ఈ క్రెడిట్ బాగా ఉపయోగపడింది చంద్రబోస్‌కు, కీరవాణికి…
ఆస్కార్ అవార్డుకు కారణభూతుడు కార్తికేయే, తను లేకపోతే అవార్డు లేదు, ఆ ముంగిట్లోకి అడుగుపెట్టేవాళ్లే కాదు… దటీజ్ కార్తికేయ… తనకూ కొడుకు వరసే అయినా కీరవాణి కార్తికేయ కృషిని గుర్తించి, ఆ వేదిక మీద ప్రస్తావించింది అందుకే… నాటునాటును మించిన మోటు పాటలు, నీటు పాటలు ప్రపంచవ్యాప్తంగా రాక కాదు, లేక కాదు… సరిగ్గా మార్కెటింగ్ చేసుకోగలగాలి… అలాంటి విషయాల్లో దిట్ట కార్తికేయ… సో, నిజంగా ఈ ఆస్కార్ అవార్డు పట్ల అభినందించాల్సింది తననే…
అందరూ ఇదే ఇలాంటి అవార్డు పొందిన తొలి భారతీయ సినిమా అన్నట్టుగా దునియా ప్రచారం చేస్తున్నారు… కానీ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను జయహో పాట రాసిన గుల్జార్, సంగీతానికి- బెస్ట్ స్కోర్‌కు గాను రెహమాన్‌కు, సౌండ్ మిక్సింగుకు రెసూల్ పుకుట్టిలకు కూడా ఆస్కార్ వచ్చింది…
కార్తికేయకు ఓ విజన్ ఉంది… ప్రపంచ సినిమారంగం ఆనుపానులను ఔపోసన పట్టినవాడు… ఇక్కడ ఎంత డబ్బు ఖర్చయిందనేది ముఖ్యం కాదు… ఆ లెక్కన కేజీఎఫ్ వాళ్లు పెట్టలేరా..? కానీ అవార్డు కొట్టే దిశలో సరిగ్గా పట్టువదలక సరైన మార్గాల్లో ప్రయత్నించేవాడు అవసరం… ఆ పని చేసిపెట్టింది కార్తికేయ… సో, అధికంగా గర్వించాల్సింది రాజమౌళి భార్య రమ…!!
Share this Article