Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనాథ ప్రేతాలకు ఆత్మబంధువులు… నిరుపమానం ఈ నలుగురి సేవ…

December 11, 2024 by M S R

.
మధుస్మిత ప్రస్తీ, స్మితా మొహంతి, స్వాగతికా రావు, స్నేహాంజలి సేథీ.. ఈ నలుగురూ విభిన్న రంగాలకు చెందినవారు.. కానీ, అనాధల శవాలకు అంతిమ సంస్కారాలందించే విషయంలో ఆదర్శం కూడా అసూయపడేలా జట్టు కట్టిన మహిళలు.

ఒడిశాకు చెందిన ఆ శైవపుత్రికలు చేస్తున్న పని.. మహిళల సేవా ప్రస్థానంలో ఓ విభిన్న పాత్ర!.. కాటికాపరులై వారు లిఖిస్తున్న చరిత్ర.. నవశక నారీమణుల ఓ కొత్త అధ్యాయం!.

సాధారణంగా హైందవ సంప్రదాయంలో మహిళలు శవాలను భుజానికెత్తుకుని వైకుంఠధామాలకు తీసుకెళ్లడంగానీ.. కనీసం ఆ శవం వెంట శ్మశానం వరకూ వెళ్లడంకానీ చాలాచోట్ల నిషిద్ధం. ఎందుకంటే మహిళలు సున్నిత మనస్కులుగా.. వారిని ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతాయని..

Ads

కాస్త మొరటు మనస్తత్వమున్న మగవారైతేనే ఆ పనులకు సరేనన్న ఒక అభిప్రాయం బలంగా వేళ్లూనుకున్న సమాజమిది. ఈ క్రమంలో మహిళలే కాటికాపరులుగా మారి అనాథ శవాలకు అన్నీ తామవుతూ నిరంతరం సేవ చేయడం.. సంప్రదాయాల పేరిట వినిపించే స్టీరియో టైపిక్ మూఢనమ్మకాల గోడలు బద్ధలు కొట్టడమే!

భువనేశ్వర్‌కు చెందిన మధుస్మిత ప్రస్తీ, స్మితా మొహంతి, స్వాగతికా రావు, స్నేహాంజలి సేథీ ఏమంటారంటే…? ఇవి మా బంధువులవి, మా కుటుంబీకులవని.. ఎవరూ ముందుకురాక.. గుర్తుతెలియని అనాథ విగతజీవులకు మేం నలుగురం కలిసి అంత్యక్రియలు చేయడాన్ని ముందు చాలా మంది వ్యతిరేకించారు. ఆడపిల్లలై ఉండి.. ఇవేం పనులు… అవసరమా..? ప్రశాంతంగా బతక్కుండా ఎందుకు ఈ రిస్క్ అంటూ నానామాటలూ చుట్టుపక్కల సమాజం నుంచి ఎదురయ్యాయి. అయినా సరే, మేము చేస్తున్న పని పట్ల తమకున్న నిశ్చితాభిప్రాయమే తమను ముందుకు నడిపిస్తూనే ఉందంటారు ఆ నల్గురు. అలా చేయడం వల్ల తమ జీవితాలకు ఓ అలౌకిక ఆనందం కలుగుతోందంటున్నారు.

40 ఏళ్ల మధుస్మిత కోల్‌కత్తాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో పెడియాట్రీషన్ డిపార్ట్మెంట్ లో నర్సుగా పని చేస్తుండేది. కరోనా మహమ్మారి కాలంలో.. తన భర్త ప్రదీప్ ప్రస్తీ.. తన స్వచ్ఛంద సేవా సంస్థ.. ప్రదీప్ సేవా ట్రస్ట్ ద్వారా ఇటువంటి సేవలందిస్తుండేవారు. 2019లో ఓ యాక్సిడెంట్ లో ప్రదీప్ తన కాలు పోగొట్టుకున్నాక.. అప్పుడు మధుస్మితా ప్రస్తీ తన భర్త ప్రదీప్ అప్పటివరకూ నడుపుతున్న సేవా సంస్థ బాధ్యతలు చేపట్టారు. కోల్ కత్తా నుంచి తన సొంత రాష్ట్రం ఒడిశాలో.. భర్త సేవలను మరిపించేలా అనాథశవాలకు దహన సంస్కారాలు ప్రారంభించింది మధుస్మిత.

తాను ఆసుపత్రిలో పని చేస్తున్న కాలంలో పేదలెవరైనా ప్రాణాలు కోల్పోయినప్పుడు.. వారి అంతిమ గడియలకు కావల్సిన కనీసం డబ్బు లేని దైన్యాన్ని.. హాస్పిటల్ మేనేజ్ మెంట్స్ డబ్బు చెల్లిస్తేనేగాని చనిపోయిన వారి మృతదేహాలను కూడా అప్పగించని దౌర్భాగ్యాన్నీ చూసిన కళ్లవి. అందుకే తాను ఈ సేవనెంచుకుంది.

ఇప్పటివరకు 15 వందలకు మందికి పైగా మృతదేహాలను దహనం చేసింది. అనాథశవాల అంత్యక్రియల నిధుల విషయానికొస్తే.. ప్రతి నెలా తమ సంపాదనలో కొంత భాగాన్ని ఈ ప్రయోజనం కోసం అందజేస్తున్తనారు ఆ నల్గురు. మానవ జీవన చివరి అంకం.. శ్మశానయాత్రకు స్పాన్సర్సై, ఎవరూలేని అనాథలకు అయినవారైతున్నారు.

10 సంవత్సరాల క్రితం నుంచి భర్త ప్రదీప్ నడుపుతున్న ట్రస్ట్‌ సేవలను గుర్తించి.. దాతల నుంచి విరాళాలు కూడా అందుతుండటంతో తమ సేవలను కొనసాగిస్తూనే ఉంది మధుస్మిత. ఒక మంచి కార్యక్రమం.. మరింతమందికి స్ఫూర్తి కల్గిస్తుందనేందుకు ఓ ఉదాహరణలా.. మధుస్మిత సేవ నచ్చిన మరో ముగ్గురు ఆమె స్నేహితులు స్మిత, స్వాగతిక, స్నేహాంజలి కూడా ఆమెతో జత కలిశారు.

స్మిత భువనేశ్వర్ లో ఓ చిన్న దుకాణాన్ని కలిగి ఉండగా.. స్వాగతిక ఎస్‌బీఐ ఉద్యోగి.. ఇక, స్నేహాంజలి జర్నలిస్ట్ కమ్ వాయిస్‌ ఓవర్ ప్రొఫెషనల్. ఈ నలుగురు సభ్యుల బృందం ఓ ఆంబులెన్స్‌ను కొనుగోలు చేసింది. రైల్వే ట్రాక్స్ పై పడి ఉన్న గుర్తుతెలియని శవాలతో పాటు.. సమాచారం అందుకున్న క్షణమే ఏ ప్రదేశం నుంచైనా.. మృతదేహాలను తరలించడం.. విగతజీవులుగా పడి ఉన్న వారికోసం దహన సంస్కారాలు కూడా పూర్తి చేయడం ఈ నలుగురి బృందం ఉద్యోగంగా మారిందిప్పుడు.

ఆమధ్య దేశంలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం.. సుమారు 300 మంది మృత్యువాత పడ్డ బాలాసోర్ రైలు ప్రమాదం.. వారి అసైన్‌మెంట్ లో అత్యంత విషాదకరం. ఎటుచూసినా రక్తపు మరకలు.. కాళ్లూ, చేతులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు.. క్షతగాత్రుల హాహాకారాలు, ఆర్తనాదాలు.. మొత్తంగా ఒక దిగ్భ్రాంతికర భీతావహ దృశ్యం తమను కలిచివేసిందంటారు.

తమల్ని రక్షించండంటూ క్షతగాత్రులు చేసే అరుపులకు ఎక్కడ ప్రారంభించాలో కూడా తెలియని స్థితిలోనే.. గాయపడిన అనేకమందికి ప్రథమ చికిత్స అందించింది ఈ నలుగురి బృందం. వారి అంబులెన్స్‌లో నాలుగు మృతదేహాలను బహనాగా పాఠశాలకు తరలించడంతో పాటు… ప్రమాదంలో గాయపడిన వారిని కటక్‌లోని SCB హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి.. వారి కుటుంబీకులు వచ్చేవరకు వారిని చూసుకుంది ఈ బృందం.

“ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే బహనాగా చేరుకున్న వీరు.. స్థానికులతో కలిసి.. కోచ్‌ల ఇనుప శిధిలాల నుండి నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. ఒకరి తల పూర్తిగా పగిలిపోయింది. మరొకరి కన్ను గుడ్డు బయటకు వచ్చింది. మరో ఇద్దరు తమ అవయవాలను కోల్పోయారు. ఇలాంటి భీతావహ, బీభత్స దృశ్యాలు ఇంకా తమని వెంటాడుతూనే ఉన్నాయంటోంది నలుగురి బృందంలోని ఒకరైన 43 ఏళ్ల స్మిత.

వీళ్ళు చేస్తున్న ఈ అసాధారణ పనిని మొదట్లో చాలామంది స్వాగతించలేదని.. వద్దన్నా చేస్తున్నందుకు.. కొంతమంది పొరుగువారు తన కుటుంబాన్నీ విమర్శించేవారంటోంది స్మిత. ఇంకొందరైతే తన ఇంటికి భోజనానికి రావడం గానీ.. తమను వాళ్ల ఇళ్లల్లో కార్యక్రమాలకు పిలవడం గానీ పూర్తిగా మానేశారనీ చెబుతారామె.

అయితే, ఈ ప్రతికూలత సమాజంలో 30 శాతం మంది నుంచి మాత్రమే వచ్చేదని… మిగిలిన 70 శాతం మంది తన పనిని కొనసాగించమని ప్రోత్సహించేవారని.. అదే తన సేవకు బూస్టపైందన్నది స్మిత మాట. బెంగళూరులో ఓసారి రైలు ప్రమాదంలో తన సోదరుడిని కోల్పోయిన తర్వాత.. మృతదేహాన్ని చివరి కర్మల కోసం ఒడిశాకు తీసుకురాలేకపోయిన నిస్సహాయత స్థితే.. తనను ఈ పని చేయడానికి పురిగొల్పిందంటుందామె. స్మిత ఇప్పటివరకు 43 మృతదేహాలను ఎత్తి.. వైకుంఠధామాలకు చేర్చింది. 24 మందికి దహన సంస్కారాలు చేసింది.

నల్గురి బృందంలో ఒకరైన స్నేహాంజలి కథ కూడా కూడా స్మితలాంటిదే. 2020లో కోవిడ్ సమయంలో.. అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను కోల్పోయింది స్నేహాంజలి. మందులతో పాటు, ఒక యూనిట్ రక్తాన్ని కొనడానికి 10 వేల రూపాయలు కూడా లేని దైన్యస్థితిలో తన అమ్మమ్మ చనిపోయిన ఘటనే స్నేహాంజలిని.. ఈ బృందంతో స్నేహానికి పురిగొల్పింది. గుర్తుతెలియని మృతదేహాలను దహనం చేయడం ద్వారా చనిపోయిన వారికి గౌరవం ఇవ్వొచ్చని.. తద్వారా తాననుభవించిన మానసిక వేదనకు ఇంత ఊరట అని చెబుతారు స్నేహాంజలి.

ఎవరి మద్దతు లేకుండా.. తాము సంపాదిస్తున్న దాంట్లోంచి జమచేసిన సుమారు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో.. ఇన్ స్టాల్ మెంట్ పేమెంట్ తో ఓ ఆంబులెన్స్ కొనుగోలు చేసి.. ఇప్పటి వరకు సుమారు 4 వేల 500 అనాథశవాలకు అంత్యక్రియలు నిర్వహించిన కాటికాపరులు.. ఈ నలుగురు శివపుత్రికలు… ( రచన :: రమణ కొంటికర్ల.  99126 99960 )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీకు సుగర్ ఉందా..? వేడివేడిగా లాగించకండి…! బాగా చల్లారనివ్వండి..!!
  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…
  • అదే జగన్ ప్లేసులో తనుంటే… ఆ సీఎస్‌ను చంద్రబాబు ఏం చేసేవాడు..?
  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions