పార్ధసారధి పోట్లూరి …….. సింథాల్ సబ్బు గురించి తెలియని వారు ఉండరు ! సింథాల్ సబ్బు గురించి ఆసక్తికరమయిన కధ ఉంది ఈ సబ్బు వాడకంలోకి రావడం వెనుక ! ఇప్పుడంటే ఎవరయినా స్వంతంగా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల పదార్ధాలు ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సబ్బు తయారుచేయడం పెద్ద పనా అని అనవచ్చు. కానీ అదే 1930 లలో సబ్బు తయారుచేసే ఫార్ములా అతి రహస్యంగా ఉండేది. కేవలం బ్రిటన్, అమెరికా లాంటి దేశాలలో మాత్రమే స్నానం చేసే సబ్బులు అందుబాటులో ఉండేవి. వాటి ఫార్ములాలు రహస్యంగా ఉంచబడేవి.
Dr Burjor Godrej [Dr. బుర్జోర్ గోద్రెజ్] కి అప్పట్లో అంటే 1930 ప్రాంతాలలో భారత్ లో స్వంతంగా స్నానపు సబ్బు ఫాక్టరీ పెట్టాలనే కోరిక బలంగా ఉండేది. బుర్జోర్ గోద్రెజ్ గారు సబ్బు తయారుచేసే ఫార్ములాని కొత్తగా కనిపెట్టాలని భావించి పరిశోధన చేయడం కోసం జర్మనీ వెళ్లారు అక్కడ యూనివర్సిటీ లో సోప్ ఫార్ములా మీద రీసెర్చ్ చేయడానికి… తన పరిశోధన తాలూకు సిద్ధాంత పత్రాన్ని సమర్పించే లోపు హఠాత్తుగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది 1939 లో… దాంతో తన Ph.D పూర్తి చేయకుండానే తిరిగి భారత దేశం వచ్చారు బుర్జోర్ గోద్రెజ్.
అప్పట్లో మన దేశంతో పాటు ఇతర దేశాలలో దొరికే స్నానపు సబ్బులు అన్నీ బ్రిటన్, అమెరికాల నుండి దిగుమతి అయ్యేవి. బుర్జోర్ గోద్రెజ్ అమెరికా, బ్రిటన్ సబ్బులు వాటి తయారీ విధానాన్ని తెలుసుకున్నాక అర్ధం అయింది ఏమిటంటే వాటిలో కొవ్వు పదార్ధంగా పంది కొవ్వు లేదా సొర చేప [Whale ] కొవ్వుని వాడేవారు. కానీ ఈ విషయం తెలియని భారతీయులు బ్రిటన్, అమెరికా సబ్బులని వాడేవారు అప్పట్లో. మరీ ముఖ్యంగా పియర్స్ [Pears ] సబ్బులో పంది కొవ్వుని వాడేవారు.
Ads
బుర్జోర్ గోద్రెజ్ ఆలోచనలో పడ్డాడు. పంది కొవ్వు వాడి సబ్బు తయారుచేస్తే భారత్ లోని ముస్లిమ్స్ వాటిని కొనరు. అలాగే సొర చేప కొవ్వుని వాడి తయారుచేసే సబ్బులని హిందువులు కొనరు. అసలు హిందువులు ఎలాంటి జంతు సంబంధమయిన కొవ్వుని వాడి సబ్బుని తయారుచేసినా అసలు కొనరు. పంది కొవ్వు, సొర చేప కొవ్వుకి బదులుగా వేరే ప్రత్యామ్నాయం కోసం పరిశోధన మొదలుపెట్టారు బుర్జోర్ గోద్రెజ్.
మన దేశంలో విరివిగా దొరికే కొబ్బరి నూనెని వాడి సబ్బుని తయారుచేయాలని నిర్ణయించుకున్నారు బుర్జోర్ గోద్రెజ్. గోద్రెజ్ కి చెందిన లాబొరేటరీలో తన పరిశోధనని కొనసాగించాడు బుర్జోర్ గోద్రెజ్. అలా పరిశోధన చేస్తున్న సమయంలో ఫెనొల్ [Phenol – C6H6O] గురించి తెలుసుకున్నారు బుర్జోర్ గోద్రెజ్. నిజానికి బుర్జోర్ గోద్రెజ్ ఉద్దేశ్యం శరీరాన్ని శుభ్రపరిచే సబ్బుతో పాటు యాంటీ బాక్టీరియా గుణం కలిగి ఉండాలి, అదే సమయంలో మంచి సువాసన కలిగి ఉండాలి తాను తయారుచేయబోయే స్నానపు సబ్బు… ఖచ్చితంగా ఫెనొల్ లో ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయని కనుగొన్నాడు.
Phenol అనేది ఆర్గానిక్ కాంపౌండ్ రసాయనం… కొద్దిగా ఆమ్ల [Acetic ] గుణం కలిగి ఉంటుంది. అయితే అప్పట్లోనే సింథటిక్ ఫెనొల్ ని తయారు చేయగలిగాడు బుర్జోర్ గోద్రెజ్. మరి కొన్ని పదార్ధాలు కలిపి కొత్త సబ్బుని మొదటిసారిగా తయారుచేసి దానిని వాడి చూసిన తరువాత ఆ ఫార్ములాని పేటెంట్ చేశాడు బుర్జోర్ గోద్రెజ్.
1950 లో గోద్రెజ్ లో సబ్బుల తయారీ ప్రాజెక్ట్ కోసం కొత్త డివిజన్ ని ప్రారంభించాడు బుర్జోర్ గోద్రెజ్. సింథటిక్ ఫెనొల్ [Synthetic Phenol ] అడ్వాన్స్డ్ కంపోజిషన్లతో సువాసనతో పాటు యాంటీ బాక్టీరియల్ సబ్బుకి ఏ పేరు పెడితే బాగుంటుంది ? బుర్జోర్ గోద్రెజ్ కి సరికొత్త ఆలోచన వచ్చింది. SYNTHetic + phenOL => SYNTHOL… సింథటిక్ లో మొదటి రెండు అక్షరాలని తీసుకొని సింథ మరియు ఫెనొల్ లోని OL లని కలిపి S అక్షరానికి బదులు C అక్షరాన్ని వాడి సింథాల్ అనే పేరు పెట్టి మార్కెట్ లోకి విడుదల చేశారు బుర్జోర్ గోద్రెజ్.
1950 నుండి ఇప్పటివరకు సింథాల్ సబ్బు డిమాండ్ తగ్గలేదు. తరువాతి కాలంలో రకరకాల వేరియంట్స్ విడుదల చేసినా ఇప్పటికీ ఒరిజినల్ సింథాల్ సబ్బు అమ్మకాలు స్థిరంగానే ఉన్నాయి. రెడ్ కలర్ పేపర్ తో ఇప్పటికీ 50 ల నాటి ఒరిజినల్ సింథాల్ దొరుకుతున్నది! గోద్రెజ్ వారి నిబద్ధత ఎలాంటిదో తెలుసుకున్నాం కదా ! జంతు సంబంధిత కొవ్వుని వాడకుండా సబ్బుని తయారుచేయడం 1940 వ దశకంలో చాలా కష్టమయిన పని కానీ సాధించారు బుర్జోర్ గోద్రెజ్…. ఇదీ సింథాల్ సబ్బు పుట్టుక వెనుక, పేరు వెనుక కథ…
Share this Article