.
ప్రస్తుతం ఏ ప్రాంత సమాజంలోనైనా విడాకులు అత్యంత సహజమైపోయాయి… రకరకాల కారణాలతో పెళ్లయిన కొన్నాళ్లకే కాదు, 20, 30, 40 ఏళ్ల సంసారం చేసిన భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు…
రెండో పెళ్లి, మూడో పెళ్లి… లేదా ఒంటరి జీవనం… కామన్ అయిపోయాయి… రోజూ తగాదాలతో అసంతృప్తితో బతకడంకన్నా విడిపోయి ఎవరి బతుకు వాళ్లు బతకడమే బెటర్ అనే భావన ప్రబలంగా వ్యాపిస్తోంది… ఇండియాలో కూడా విడాకుల రేటు బాగా పెరిగిపోయింది…
Ads
మరి పిల్లలు..? అదే అసలు సమస్య… ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతుంటే వాళ్ల పిల్లలు బిక్కచచ్చిపోతున్నారు… భయపడిపోతున్నారు… వాళ్లలో ఓరకమైన అశాంతి గూడుకట్టుకుంటోంది… వయస్సు పెరిగేకొద్దీ అదీ పెరుగుతుంది…
విడాకులు తీసుకున్నాక పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి..? పోషణభారం ఎవరిదనే పంచాయితీలు కూడా పిల్లల్లో ఓరకమైన అభద్రతను పెంచుతున్నాయి… ఇవన్నీ పిల్లల్లో మానసిక, భావోద్వేగ సమస్యల్ని క్రియేట్ చేయడమే కాదు… వాళ్ల ఆరోగ్యాలనూ ప్రభావితం చేస్తున్నాయి…
PLOS one found అనే జర్నల్‌లో పబ్లిషైన ఓ అధ్యయనం అదే చెబుతోంది… స్థిరమైన కుటుంబాల్లో పెరిగే పిల్లలతో పోలిస్తే… విడాకుల జంటల పిల్లలు పెద్దయ్యాక స్ట్రోక్ రేట్ 60 శాతం ఎక్కువ… అంటే మానసిక, భావోద్వేగ సమస్య అనారోగ్యానికీ కారణమవుతోందన్నమాట… అవేకాదు, మనదేశంలో విడాకుల జంటలకు చెందిన పిల్లలకు సామాజిక వెటకారాలు, వివక్ష వారిలో మరింత ఒత్తిడికి కారణమవుతోంది…
టోరంటో యూనివర్శిటీ 65 ఏళ్లు పైబడిన 13 వేల మంది పెద్దల్ని ఈ అధ్యయనానికి ఎంచుకుంది… ఏ పిల్లలైతే తమ 18 ఏళ్ల వయస్సు ముందే తల్లిదండ్రులు విడిపోయారో… వాళ్లు పెద్దయ్యాక 60 శాతం అధికంగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని తేల్చింది ఆ అధ్యయనం…
చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, దైహికంగా సమస్యలున్న పిల్లలకన్నా ఈ విడాకుల బాధిత పిల్లలు పెద్దయ్యాకే స్ట్రోక్ పాజిబులిటీ చాలా ఎక్కువట… ఈ బాధిత పిల్లలు పెద్దయ్యేకొద్దీ రక్తపోటు, నిద్రలేమి సమస్యలకు గురవుతున్నారు… (సోర్స్ హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన ఓ స్టోరీ)…
భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచంలోకెల్లా స్థిరమైంది… ప్రపంచంలోని ఏ దేశంలోని విడాకుల రేటుతో పోల్చినా ఇండియాలో విడాకుల శాతం చాలా చాలా తక్కువ… కానీ కొన్నాళ్లుగా పెరుగుతున్నాయి… సరైన స్టడీ, సంఖ్యలు లేకపోయినా సరే… ఐదారేళ్లుగా విడాకుల సంఖ్య బాగా పెరిగినట్టు ఫ్యామిలీ కౌన్సిలర్లు, లాయర్లు చెబుతున్నారు…
చట్టబద్ధంగా విడాకులకు కొన్ని సమస్యలు ఉన్నందున చాలామంది సుదీర్థకాలం వెయిట్ చేయాల్సి వస్తోంది… విడాకుల అప్లయ్ చేయడానికి చాన్నాళ్ల ముందు నుంచే విడిపోయి బతుకుతున్నారు… కొందరు చట్టబద్ధమైన విడాకులకు ప్రయత్నం చేయకుండానే విడిపోయి ఉంటున్నారు… పెళ్లిళ్లంటే భయంతో చాలామంది ఒంటరి బతుకులకే అలవాటు పడుతున్నారు… ఎక్కువ శాతం పిల్లల పోషణ బాధ్యతల్ని తల్లులే స్వీకరిస్తున్నారు…
Share this Article