Sridhar Bollepalli……… మా బళ్లో పిల్లోడొకడు మొన్నొకరోజు బడికి రాలేదు. తెల్లారి క్లాసులో అడిగా “ఏరా నిన్న రాలేదేం” అని. వాడు సమాధానం చెప్పలేదు. అందరికన్నా పొట్టిగా, సన్నగా వుంటాడు, కానీ మహా కోతి. దురదృష్టవశాత్తూ ఇలాంటి కోతులే పరీక్షల్లో ఫస్టొస్తూ వుంటారు. వీడు కూడా ఈ ఫినామినాని జస్టిఫై చేయగల క్యాటగిరీకి చెందినవాడే అయివుండడం చేత, మా పంతుళ్లందరి చేతా కాస్త పేంపర్ చేయబడుతూ వుంటాడు. మళ్లీ అడిగాను వాడిని “నిన్నేరా అడిగేది, వై డిడింట్ యు కమ్ ఎస్టర్‌డే?” ఊహూ.. నో ఆన్సర్. అసలంటూ రెట్టించకుండా వదిలేస్తే ఏ గొడవా లేదు. కానీ రెండోసారి అడిగాక కూడా వాడు రెస్పాండ్ అవ్వకపోతే ఎలా..! ధిక్కారమున్ సైతునా అంటూ మళ్లీ అడిగాను. వాడు నోరిప్పలేదు.
ఇది కోపంతో తెగే మేటర్ కాదని బోధపడి, రూటుమార్చి, “ఏరా సీఎం కబురంపితే చర్చలకి వెళ్లావా” అన్నాను. వాడు మాట్లాడలా.. “రజనీకాంత్ నెక్ట్స్ సినిమాకి స్టోరీ డిస్కషన్‌కి వెళ్లావా” అన్నాను. వాడు పెదవి విప్పలా. నేను ఓటమిని అంగీకరించక తప్పింది కాదు.” పో.. పోయి కూర్చో” అన్నాను కోపంగా. వాడు వెనక్కితిరిగి రెండడుగులు వేసి, ఏమనుకున్నాడో ఏమో మళ్లీ నా దగ్గరికొచ్చాడు. వచ్చి “నిన్న మా అమ్మానాన్నా పోట్లాడుకున్నారండీ . మా నాన్న మా అమ్మని బాగా కొట్టాడు. రక్తం కారతంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లాం” అన్నాడు. వాడు నా మొహాన ఊసినా అంత సిగ్గు వేయకపోను. “పనీపాటా లేకుండా వుత్తగా ఆడుకోడానికి ఇంటిదగ్గర వుండిపోయావేమో, ఆ మాట చెప్పడానికి భయపడుతున్నావనుకొని అలా గట్టిగా అడిగాన్రా. నాదే తప్పు. ఇంకోసారి ఇలా గద్దించను.. సరేనా” అంటూ సంజాయిషీ ఇచ్చాను. వాడు సరే అన్నట్లు నవ్వేశాడు. నా సిగ్గు యింకా ఎక్కువయ్యిందో, తగ్గుముఖం పట్టిందో నాకే అర్థం కాలేదు. వాడికొచ్చిన కష్టం తెలిశాక కాస్త దిగులు ఆవరించినా, వాడికి సారీ చెప్పడం వల్ల మనసు తేలికపడడం మాత్రం తెలుస్తోంది.
యండమూరిగారు ఒక సందర్భంలో రాస్తారు.. ఒక తండ్రీకొడుకూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ వుంటారు. “దేవుడా, నేను ఈ తప్పు చేసి మా నాన్న మనసు కష్టపెట్టాను. ఇంకోసారి నేనిలా చేయకుండా చూడు” అని కొడుకు పైకే ప్రార్థన చేస్తుంటాడు. తండ్రిమాత్రం మనసులో “దేవుడా, చేసిన తప్పు ఒప్పుకోడానికి నా కుమారుడికి వున్నంత ధైర్యం నాకూ ప్రసాదించు” అని వేడుకుంటాడు.
Ads
ఇదే ఫీచర్ మనం మన పిల్లల్లో కూడా గమనించి వుంటాం. ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పేసుకునే నిజాయితీ, ధైర్యం పిల్లలకి వుంటాయి. పెరిగేకొద్దీ ఆ లక్షణాలు క్రమంగా మాయమవుతూవుంటాయి. ఇలా మాయం అవ్వడం అవసరం అనీ, లేకపోతే ఈ పాడు ప్రపంచంలో బతకలేమనీ మనమే మన ప్రవర్తన ద్వారా పిల్లలకి నేర్పుతూ వుంటాం. ఇది పాడు ప్రపంచమే. అన్నిసార్లూ నిజమే చెప్పాలనుకోవడం చాదస్తమే. కానీ, “నాది తప్పు” అనగలగడం ఒక మాదిరి మొనగాడితనం (లేదా మొనగత్తెతనం). ఒక నాలుగైదు వేర్వేరు సందర్భాల్లో ఈ ఆయుధాన్ని ప్రయోగించి చూస్తే మనకే తెల్సిపోతుంది, అహాన్ని వదిలి మనం అలా అడగడం, అవతలివారు మన తప్పుని మర్చిపోయేలా చేస్తుందని. నేను మా అబ్బాయి దగ్గరా, స్కూల్లో పిల్లల దగ్గరా ఎక్కువగా, మా ఆవిడ దగ్గర అప్పుడప్పుడూ ఈ “నాదే తప్పు” అనేమాట వాడుతూ వుంటాను. బిలీవ్ మి… ఇట్స్ ఆల్వేస్ ఎ విన్‌విన్ సిట్యుయేషన్.
Share this Article