హమ్మయ్య… అశోకగజపతిరాజుపై జగన్ కక్షకు కారణమేమిటో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మొత్తానికి చెప్పేశాడు… ఎందుకు ఆయన అన్న కూతురు సంచయితను తెర మీదకు తీసుకొచ్చి, ఆమెను ముందుపెట్టి కథ నడిపిస్తున్నారో కూడా స్పష్టం చేశాడు… ఏమిటయ్యా అంటే..? అప్పట్లో ఎర్రన్నాయుడు, గజపతిరాజు చేసిన ఫిర్యాదు మేరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందట… దర్యాప్తు చేసిన సీబీఐ జగన్ను, సాయిరెడ్డిని జైలులో పారేసిందట… అది మనసులో పెట్టుకుని… ‘రాజూ, నిన్నూ జైలుకు పంపిస్తాం’ చూడు అన్నట్టుగా కక్ష ప్రదర్శిస్తున్నారట… త్వరలో గజపతిరాజు జైలుకు వెళ్లకతప్పదని సాయిరెడ్డి మాట్లాడటానికి కారణం అదేనట… ఓహో… అదా కారణం..? అమ్మ.. జగనూ… మనసులో ఇంత పెట్టుకున్నావా..? మేం ఇన్నాళ్లూ జగన్ మీద అనవసరంగా ఎవరో శంకర్రావు ఫిర్యాదు చేశాడనీ, చెప్పినట్టు వినడం లేదని సోనియాకు కోపముంది కాబట్టి అప్పటి సీబీఐ బోలెడన్ని కేసులు పెట్టేసి, జగన్ను జైలులో పారేసిందని చదువుతూ వచ్చాం… అాదే నమ్ముతూ వచ్చాం… గజపతిరాజు కారణమా..? రాసేవాడికి చదివేవాడు లోకువ అన్నట్టు రాధాకృష్ణ రాస్తూనే ఉంటాడు… మనం చదువుతూనే ఉంటాం…
కానీ ఏమాటకామాట… తను ఏదేదో రాస్తూ అనాలోచితంగా జగన్కు, సాయిరెడ్డికి లేని ఆలోచనల్ని క్రియేట్ చేస్తుంటాడు… ఇన్నాళ్లూ ఎవరికీ తెలియదు… గజపతిరాజుల వంశపారంపర్య నగానట్రా బోలెడంత ఉంది… వేల కోట్ల విలువ… అదీ వివాదంలోనే ఉంది… ‘‘జగనూ, ఆ వేల కోట్ల భూములు, భవనాలు, ఆస్తులే కాదు… ఇదుగో ఈ బంగారం, నగలు గట్రా ఉంది… సంచయిత కాకపోతే మరొకరు, ఏదో మార్గంలో వాటి పని పట్టొచ్చు కదా’’ అని కొత్త ఆలోచనను విసిరాడు రాధాకృష్ణ… అవన్నీ కుటుంబ ట్రస్టు సంబంధిత యవ్వారాలు కాబట్టి, సంచయితను ముందుపెట్టి ఆడించాల్సి వస్తోంది… నిజానికి ఆమె బీజేపీ… ఇప్పుడు హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్నది… అశోకుడి అన్న ఆనందగజపతిరాజు బిడ్డ ఊర్మిళను వైసీపీలో చేర్చుకుని, వాళ్లనూ తెర మీదకు తీసుకొస్తే ఎలా ఉంటుంది..?
Ads
ఇక్కడ మరోమాట… రాధాకృష్ణ అశోకగజపతిరాజు రాసింది కరెక్టు… వర్తమాన రాజకీయ ధోరణికి నిజంగానే ఆయన సూట్ కారేమో… అందుకే ఓడించారేమో… చాలా మంది నాయకులతో పోలిస్తే ఆయన చాలా ఎత్తులో ఉంటాడు… మరీ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ తన లైఫ్ స్టయిల్, తను పాటించే కొన్ని విలువలు సోకాల్డ్ నడమంత్రుపు అధికారం దక్కిన నేతలకు అర్థం కావాలని కూడా లేదు… దీన్ని ఆ జిల్లాలోని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు… మంత్రి శ్రీనివాస్ వంటి నాయకులు అశోకుడికి గుడిమర్యాదలు చేయొద్దని ఆదేశించినంతమాత్రాన గజపతిరాజు గౌరవం తులం కూడా తగ్గదు… అశోకుడిని మాయచేసి, కుటుంబరావు వంటి వ్యక్తుల్ని ట్రస్టుల్లోకి చేర్చి, చంద్రబాబు ఏదో మాయోపాయాలు చేయాలని ప్రయత్నించాడు అంటే జనం నమ్ముతారు… కానీ తన ఆస్తుల్ని తనే కొట్టేయాలని గజపతిరాజు ప్రయత్నించాడు అనే ఆరోపణను జనం నమ్మరు, నమ్మాల్సిన అవసరమూ లేదు… సాయిరెడ్డిది ఏముంది..? ఏదేదో అంటుంటాడు… ఉత్తరాంధ్రకు అనధికార ముఖ్యమంత్రి కదా…
జగన్ ప్రకటించిన 6 లక్షల ఉద్యోగాలు హంబగ్ అని నిన్న, ఈరోజు ఆంధ్రజ్యోతి సుదీర్ఘకథనాలు రాసి బట్టలిప్పే ప్రయత్నం చేసింది… జ్యోతి అంటే అందుకే జగన్ క్యాంపుకి కన్నెర్ర… ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేస్తే, అవీ కొత్త ఉద్యోగాల కల్పన అని ఘనంగా చెప్పుకునే నేతలు బహుశా మళ్లీ దొరకరేమో… ఇన్నాళ్లూ ఇలాంటి మాయప్రచారాల్లో చంద్రబాబును మించినోడు లేడు అనుకునేవాళ్లు అందరూ… చంద్రబాబు తాత జగన్ వచ్చాడు అన్నట్టుగా…!! వలంటీర్లూ ఉద్యోగులే అంటాడు… ప్రత్యేక హోదాను అటక మీద పారేశాడు… మద్యం, ఇసుక డబ్బులతో అందరూ తెగబలిసిపోతున్నారు… ఎట్సెట్రా ఆరోపణల్ని తెలుగుదేశం చేస్తుంది, దాని మౌత్ పీస్ ఆంధ్రజ్యోతి కూడా చేస్తుంది… వాటి మాటెలా ఉన్నా… మాన్సస్ ట్రస్టు వ్యవహారంలో అశోకుడిని టార్గెట్ చేయడం వేస్ట్… ఒకవేళ తనను జైలుకు పంపించాడని జగన్కు కోపం ఉన్నా సరే, కక్ష తీర్చుకోవాలని కుతకుతలాడుతున్నా సరే… అశోకుడి ఫిర్యాదుతోనే తను జైలుకు వెళ్లడం నిజమే అనుకున్నా… దానికి సూత్రధారి చంద్రబాబు అవుతాడు… అశోకుడు కేవలం పాత్రధారి మాత్రమే… ఆ సూత్రధారిని ఏం చేయగలిగారు..?! కత్తి మీద కాదు కక్ష చూపాల్సింది… కత్తి పట్టుకున్న ప్రత్యర్థి పని కదా పట్టాల్సింది..!!
Share this Article