మన మగపురుష్ ఎంత ముసలోళ్లయినా ఇంకా చిత్రమైన స్టెప్పులు వేస్తూ, ఆడవాళ్లతో చిలిపి వేషాలు వేస్తూ, ద్వంద్వార్థ సంభాషణలు పలుకుతూ నీరసమే ఆవహించని రసపురుష్ అనిపించుకుంటారు… అదే ఆడలేడీస్ అయితే మాత్రం ‘కొత్త సరుకు’ (పాపం శమించుగాక, ఇది సినిమా భాషే, ఇంగ్లిషులో హీరోయిన్ మెటీరియల్ అని పిలుస్తారు…) కోసం వివిధ భాషల్లో, విభిన్న దేశాల్లో అన్వేషిస్తుంటారు… నాలుగు రోజులు చాన్సులు ఇచ్చి, (సినిమా భాషలో వాడుకుని…) తరువాత పక్కన పడేస్తారు… కరివేపాకులా…
కొందరు మాత్రమే నాలుగురోజులు నిలబడతారు… చాలామంది కొద్దిరోజులకే ఫేడవుట్ అయిపోబడతారు… మన టీవీ సీరియళ్లు అయితే కన్నడ తారలు, మన సినిమాలయితే మలయాళీలు ఎక్కువగా క్లిక్కవుతున్నారు… అఫ్‌కోర్స్ మెరిట్, అందం ఉంటుంది… ఇప్పుడు సామజవరగమన సినిమాలో హీరోయిన్‌గా చేసిన రెబ్బ మోనిక జాన్ బాగుంది… నటనలో ఈజ్ ఉంది… ఎవరా అని గూగులమ్మను అడిగితే బెంగుళూరులో ఓ మలయాళీ కుటుంబంలో పుట్టిందట… 29 ఏళ్లు… ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్ అనూ ఇమాన్యుయేల్ కు ఈమె కజిన్… గత ఏడాదే జోమాన్ జోసెఫ్‌ను పెళ్లి చేసుకుంది…
పెళ్లయితేనేం… వోకే, పర్లేదు… ఫహోద్ ఫాసిల్ భార్య నజిరియా ఆమధ్య ఏదో తెలుగు సినిమా చేసింది… ఇంకా ఒకరిద్దరు ఉన్నట్టున్నారు… కెరీర్‌కు పెళ్లికీ సంబంధం ఉందా అంటే మన ఇండస్ట్రీలో ఎక్కువే… ఒకసారి పెళ్లిచేసుకుంటే చాలు, ఆంటీ అయిపోతుంది… ఎటొచ్చీ మన తెలుగు అమ్మాయిలే మన ఇండస్ట్రీకి పనికిరారు… ఘర్ కా ముర్గీ, పెరట్లో కూరగాయ… అఫ్‌కోర్స్, తెలుగు అమ్మాయిల్ని పొరపాటున తీసుకున్నా సరే, నాలుగొద్దుల్లో కెరీర్ సరి… (ఒకరిద్దరు శ్రీలీలలు పర్లేదు, ఊపిరాడని చాన్సులు…) రెబ్బ 2016 నుంచి సినిమాల్లో మంచి వేషాల కోసం తన్లాడుతోంది…
Ads
మొదట తమిళం, తరువాత మలయాళం, కన్నడం… తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆరేడేళ్లు పట్టింది… ప్లజెంటుగా ఉంది… ఒకవైపు తన పర్‌ఫామెన్స్‌తో ఈమధ్య రెచ్చిపోతున్న సీనియర్ నరేష్, మరోవైపు శ్రీవిష్ణు… ఈమె కూడా దీటుగా చేసింది… కాస్త మంచి పాటలు పడి ఉంటే ఈమెకు మరింత స్కోప్ లభించేదేమో… కానీ సినిమా కామెడీ బేస్ కదా… దర్శకుడు సో కాల్డ్ కమర్షియల్ వాసనల జోలికి పోలేదు… సో, రెబ్బ మోనిక జాన్ కూడా పద్ధతిగా కనిపించింది… మొన్నొకసారి ఆహాలో ప్రదీప్ నిర్వహించే సర్కార్ షోలో కూడా కనిపించింది… ఆ షో కూడా సినిమా ప్రమోషన్ల షోగా మారిపోతోంది…!! ఐనా ఇప్పుడు నిర్మాతల క్యూ హీరోయిన్ శ్రీలీల ఇంటి ముందు బారుగా కనిపిస్తోంది…
Share this Article