మరణానంతరం కూడా సేవలందిస్తోంది నా శ్యాంసంగ్ కంపెనీ టీవీ .. బతికున్నంతకాలం మాకు ఎన్నో వార్తల్ని, సినిమాలను, పాటలని, సీరియల్స్ ని చూపించి ఒక దశాబ్దం పాటు మాకు సేవలందించిన మా శ్యాంసంగ్ టీవీ జీవిత కాలం ముగిసిపోయాక కూడా ..తన శరీరం మీద మొక్కల్ని పెంచి కూరగాయల్ని ఆకుకూరల్ని అందిస్తోంది .. ఏమిచ్చి నా శ్యాంసంగ్ టీవీ రుణం తీర్చుకోగలను .. చావు తర్వాత కూడా కూరగాయల్ని పండించి మాకు సేవ చేస్తున్న ఈ టీవీ వెనుక చాలా పెద్ద కథే ఉంది.. ఓపికుంటే చదవండి
ప్రధమాంకం
అది Y2K సమస్యతో కంప్యూటర్ ప్రపంచమంతా అల్లాడుతోన్న 1999 ముగిసి 2000 లోకి అడుగుపెడుతున్న ఏడాది.. మిలీనియంలోకి అడుగుబెడుతున్న సమయంలో .. కంప్యూటర్లు అప్పుడెప్పుడో 1960 లో పుట్టి పంథొమ్మిది సిరీస్ ని మాత్రమే లోడ్ చేసిన ఇంజినీర్లు రెండువేలు సంవత్సరంలో సున్నాల్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాయోనని తలబాదుకుంటున్న వేళ.. నేను అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన శ్యాంసంగ్ అన్నపూర్ణ మోడల్ పోర్టబుల్ కలర్ టీవీని ఎనిమిది వేలు పోసి ఇన్ స్టాల్మెంట్ బేసిస్ లో గుడివాడ ఏలూరు రోడ్డులో కొన్నాను..
Ads
అప్పటికి అది నాకు చాలా పెద్ద బడ్జెట్ .. ఎనిమిది రూపాయలో , ఎనభై రూపాయలో చూశా గానీ ఎనిమిదివేలు ఎప్పుడూ చూడని కనీసం వినని పేద బతుకులో అత్యంత ధనవంతుడి మాదిరి కలర్ టీవీలో దూరదర్శన్ లో శుక్రవారం రాత్రి ఏడున్నరకి చిత్రలహరి శనివారం సాయంత్రంవచ్చే సినిమా, ప్రాక్టర్ అండ్ గాంబుల్ యాడ్ చూడాలనే నా కల అప్పుడే నెరవేరింది ..
నీగ్రో కలర్ బాడీతో ఆంగ్లేయుడి రంగు స్క్రీన్ తో మిలమిలా మెరిసిపోయేది నా శ్యాంసంగ్ టీవీ.. నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికిన టవల్ తో రోజుకి నాలుగు సార్లు తుడిచేవోడిని.. మా నాన్న చేయించిన టేకు టేబుల్ మీద అమ్మ కాటన్ చీర పర్చి దానిపై ఆ టీవీని ఉంచి మురిసిపోయేవోడిని.. మా గుంటూరు శీనన్నయ్య.. నామీద విపరీతమైన ప్రేమాభిమానాలతో ఐదేళ్లపాటు తాను వాడేసిన తర్వాత తనకు బోరు కొట్టాక .. ఆ బోరు కొచ్చిన మూడు సీడీల…శ్యాంసంగ్ త్రీసీడీ ప్లేయర్ ని నాకు గిఫ్ట్ ఇస్తే అది తెచ్చి, నా అన్నపూర్ణా టీవీకి పెట్టి ఐదు రూపాయల అద్దెతో తెచ్చిన సీడీని అందులో పెట్టి సినిమా చూసి మురిసిపోయేవోడిని..
ఆ రోజుల్లో చినయెరుకపాడులో కలర్ టీవీ ఉన్న అతి కొద్దిమందిలో నేనొకడిని .. ఆనందం అమావాస్య దాటకముందే పౌర్ణమికి ముందు శుద్దపాడ్యమి రోజు మా ఇంటిమీద పడిన పిడుగు నా అన్నపూర్ణ ప్రాణం తీసింది .. ఇంకా టీవీ ఇన్ స్టాల్మెంట్ తీరలేదు.. పట్టుమని పాతిక సీడీలు కూడా చూడలేదు .. అప్పుడే నా టీవీ లోపలి బోర్డ్ అంతా కాలిపోయింది .. దానితో పాటే .. సీడీ ప్లేయర్ కి నూరేళ్లు నిండిపోయాయి .. అలా నా అన్నపూర్ణా టీవీ కథ ముగిసిపోయింది ..
ద్వితీయాంకం
అన్నపూర్ణ కథ ముగిశాక …
అప్పుడెప్పుడో పెళ్లికాకముందు ముఖం మీద మొటిమలు బాగా వస్తున్న టైంలో వైజాగ్ లో పదకొండు వేలు పోసి శాంసంగ్ కంపెనీదే మరో టీవీ కొన్నాను .. జీవితంలో రెండోసారి కొన్న అత్యంత ఖరీదైన వస్తువు అది.. దేవుడి శాపంతో పిడుగుపాటుతో నాకు దూరమైన అన్నపూర్ణ టీవీని తల్చుకుంటూ ఆ జ్ఞాపకార్ధం ఆ పేరే ఈ టీవీకి పెట్టుకుని .. సంతోషిస్తూ పాత టీవీని మెల్లగా మర్చిపోతున్నాను ..
నా అన్నపూర్ణ నాకు దూరమైనప్పటికీ కొత్తగా వచ్చిన టీవీ మా ఇంట ఎన్నో ఏళ్లపాటు మాతోపాటు కలిసిపోయి బతికేసి మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది .. లోపల దూరితే పదేళ్ల బుడ్డోడు మునగదీసుకుని కూసునేంత చోటుతో .. తిరునాళ్లకి పెట్టే మైకుల మాదిరి వచ్చే శబ్దధ్వనితో మార్మోగేది.. సరే మా బుడ్డోడు పుట్టాక .. వాడు డైపర్లు వాడు సమయమున … ఎవరెస్ట్ శిఖరం మాదిరి కనిపించుచున్న ఆ ద్రుశ్య శ్రవణ ప్రసార యంత్రాన్ని ఎలాగైనా అధిరోహించాలని అనేక మార్లు ప్రయత్నించాడు..
శతధ్రువంశస్తుడి మాదిరి అనేకమార్లు ప్రయత్నించాక చివరికి ఆ టీవీ పైకెక్కి కూర్చునే వికటాట్టహాసం చేయు సందర్భమున ఒనాఫ్ ది ఫైన్ డే ..ఆ టీవీ డమేల్ మని పైనుంచి కిందపడింది .. ముక్కలైంది .. దానితోపాటే నా ఆశలు అన్నీ చితికిపోయాయి .. బోర్లాపడి నవ్వుతున్న మా బుడ్డోడిని , తిరగపడిన టీవీని రెండూ ఒకేసారి పైకి లేపాను .. మా బుడ్డోడు ఏడ్వలేదు కానీ లోలోపల ఏడ్చిన నా ఏడుపు ఎవరికీ కనిపించలేదు ..
టీవీకి ఒక పక్క పెద్ద పందికొక్కు దూరేంత ముక్క విరిగిపోయింది .. బాధతో వచ్చిన ఆవేదనతోనే ఆత్రుతగా టీవీ ప్లగ్ ని సాకెట్లో పెట్టి ఆన్ చేస్తే నా బంగారు తల్లి ఆ టీవీ మాత యధావిదిగా పని చేసింది .. ఏడ్వకు బిడ్డా నీకు నేనున్నానని ఓదారుస్తున్నట్టుగా అనిపించింది .. అంత పెద్ద బొక్క పెట్టుకుని కూడా ఆ టీవీ అలాగే చక్కగా పనిచేసింది ..
అప్పుడప్పుడూ ఆ బొక్కలోంచి ఎలుకలు గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుతున్నట్టు , ఊరి చివర ఫార్మ్ హౌజ్ కి వెళ్లినట్టుగా ఎంజాయ్ చేస్తుండేవి .. ఆ టీవీ లోపల సంసారం చేసి మా ఇంట్లో ఎలుకల సంఖ్యని పెంచాయి .. ఒకటిరెండుసార్లు వైర్లు కొరికాయి .. ఒకరోజు ఆ బొక్కలో ధర్మాకోల్ ముక్క అడ్డం పేట్టి దానిమీద నల్ల ఇంకుతోరుద్దా .. ఇంకేముంది .. అచ్చం టీవీ రంగులో కలిసిపోయి .. రోడ్డు యాక్సిడెంట్ లో కాలు విరగ్గొట్టుకున్నోడు లోపల ఐరన్ రాడ్డేసుకుని తిరుగుతున్నట్టుగా అందంగా ఉండేది నా టీవీ ..
నేనింత బల ప్రదర్శన చేసినా సరే ఇంకా చెక్కు చెదరకుండా నా ముందు తొడకొడుతోందీ టీవీ.. దీన్నేమి చేయాలి అన్నట్టుగా మా బుడ్డోడు రోజూ చూస్తూ ఉండేవోడు .. అలా అలా కాలగర్భంలో దానికి వ్రుధ్ధాప్యం వచ్చేసింది .. ప్లాస్మాలు , ఫ్లాట్రాన్లు , ఎల్సీడీలు , ఎల్ ఈడీలు , 4K లు మార్కెట్లో వీర విహారం చేస్తున్న వేళ ఇక ఆ టీవీకి రిటైర్మెంట్ ఇచ్చేద్దామని డిసైడైన వేళ మా చెల్లి వాళ్లు ఆ టీవీని వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు ..
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి పెళ్లి చేసి అల్లుడుకు అప్పగించేవేళ కన్నీళ్లు పెట్టే తండ్రి మాదిరి తెగ ఫీల్ అయిపోయాను ఆ టీవీ అలా బయటకు వెళ్తోంటే .. ఇన్నాళ్లు నన్ను వాడుకుని ఇపుడు ఇలా బయటకు తోసేయడం నీకేమైనా న్యాయంగా ఉందా అని ఆ టీవీ నను ప్రశ్నించినట్టుగా అనిపించింది ఆ వీడ్కోలు సమయం లో …
అలా మా చెల్లి వాళ్ల ఇంటికి చేరిన ఆ టీవీ జీవిత చరమాంకంలోనూ వాళ్లకి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి తర్వాత తనువు చాలించింది.. అలా చచ్చిపోయిన ఆ టీవీని బాక్సులో పేగులు లాంటి వైర్లు, బోర్డుల్ని తీసేసి మట్టిపోసి ఇలా కూరగాయల్ని పెంచుతున్నారు.. చాలా కాలం తర్వాత మా ఊరు వెళ్లిన నేను ఆనాటి మా కలల టీవీ శరీరం మొక్కలు కింద చూసి ఆ జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాను … అశోక్ వేములపల్లి
Share this Article