ఏవేవో పాత ఫోల్డర్లన్నీ తిరగేస్తుంటే… పాత పోస్టుల స్మృతుల్ని పలకరిస్తుంటే… ఓ ఫోటో దగ్గర ఆగిపోయింది కన్ను, మనసు, ఆలోచన… ఎంత గొప్ప ఫోటో… ఒక ప్రఖ్యాత నర్తకి మృతదేహం వద్ద ఆమె కూతురు నర్తిస్తూ నివాళి అర్పించడం, ప్రదర్శించడం, దుఖాన్ని వ్యక్తీకరించడం… చాలామందికి అర్థం కాకపోవచ్చు ఈ సీన్‌లోని ఉద్వేగం… కానీ ఓ బలమైన భావోద్వేగ ప్రదర్శన అది… మరణించిన ఆ తల్లి పేరు మృణాళిని సారాభాయ్… ఆ బిడ్డ పేరు మల్లికా సారాభాయ్… బహుశా నాలుగేళ్ల క్రితం కావచ్చు, 97 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది మృణాళిని, గొప్ప డాన్సర్… ఆమె బిడ్డ కూడా పేరుమోసిన డాన్సరే, ఏదో భావావేశం ఉప్పెనలా ముంచెత్తి, తల్లి దేహం వద్ద డాన్స్ చేసిన సీన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది… ఆ ఫోటో ఇదుగో, ఇదీ…
అప్పట్లో సోషల్ మీడియోలో, మీడియాలో విస్తృతంగా చదవబడిన, చూడబడిన ఫోటో, వార్త అది… ఒకసారి 38 ఏళ్ల వెనక్కి వెళ్దాం… సాగరసంగమం అనే విశ్వనాథుడి సినిమా… అందులో ఒక సీన్ ఉంటుంది… కమల్‌హాసన్‌కు డాన్స్ అంటే పిచ్చి… పలు నాట్యరీతులతో ఓ కొత్త భారతీయ నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే అభిలాష… తల్లి ముందు ఓ జాతీయ వేదిక మీద నాట్యం చేసి, ఆమెకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు… కానీ ఆమె అకస్మాత్తుగా కన్నుమూస్తుంది… అక్కడ తల్లిని చూసి, కడుపు లోలోపల నుంచి తన్నుకొచ్చు దుఖాన్ని ఆపుకుంటూ… అమ్మా, నీ కొడుకు డాన్స్ ఒక్కసారి చూడమ్మా అన్నట్టుగా డాన్స్ చేస్తాడు… గొప్పగా పండింది ఆ సీన్… ఇన్నేళ్లలో మళ్లీ మన దర్శకుల్లో ఒక్కరికీ అంత బలమైన ఉద్వేగభరితమైన సీన్ చూపించడం చేతకాలేదు… అంతెందుకు, ఆ విశ్వనాథుడికే చేతకాలేదు… ఇదీ ఆ గొప్ప సీన్…
Ads
నిజానికి మల్లిక సారాభాయ్‌కి 67 ఏళ్లు… ఇప్పటికీ యాక్టివ్… తను కొరియోగ్రాఫర్, శాస్త్రీయ నర్తకి, రచయిత, టీవీ ప్రజెంటర్, నిర్మాత, సినిమా నటి, డ్రామా ఆర్టిస్టు, కాలమిస్టు… అన్నింటికీ మించి సోషల్ యాక్టివిస్టు… బహుముఖ ప్రతిభకు నిలువెత్తు సూచిక ఆమె… ఒకసారి ఆమె గురించి చెప్పుకోవాలి సంక్షిప్తంగానైనా సరే… ఆమె తల్లి ఫేమస్ డాన్సర్, అనేక నాటక, నాట్య ప్రదర్శనలు ఇచ్చింది… పద్మభూషణ్ పురస్కార గ్రహీత… దర్పణ అనే ఓ కళాసంస్థ స్థాపించింది… దాన్ని ఇప్పుడు బిడ్డ మల్లికే నడిపిస్తుంది… మల్లిక తండ్రి ఎవరో తెలుసా..? భారతీయ అంతరిక్ష ప్రగతికి పితామహుడిగా చెప్పబడే విక్రమ్ సారాభాయ్… తల్లిది కేరళ నేపథ్యం… తండ్రిది గుజరాతీ నేపథ్యం… ఎంత గొప్ప వారసత్వం… మల్లిక కొడుకు కూడా డాన్సర్, యాక్టర్… మల్లిక బిడ్డ కూడా కొరియోగ్రాఫర్, క్లాసికల్ డాన్సర్…
ఇంకా వెనక్కి వెళ్తే… మృణాళిని తల్లి అమ్ము స్వామినాథన్ ఓ మాజీ ఎంపీ… ఆమె తండ్రి స్వామినాథన్ మద్రాస్ హైకోర్టులో ఫేమస్ లాయర్… ఆమె సోదరి లక్ష్మి సెహగల్… నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్‌కు కమాండర్… ఆమె సోదరుడు గోవింద స్వామినాథన్ తమిళనాడు అటార్నీజనరల్… వావ్… ఎంతటి వారసత్వం… నిజానికి మల్లిక గురించి చదువుతుంటే మోడీ గుర్తొస్తాడు… తన తప్పును అంగీకరిస్తున్నట్టుగా ఓ సందర్భంలో మోడీ మౌనంగా ఉండిపోయిన తీరు గుర్తొస్తుంది… మల్లిక ఓ దశలో అద్వానీపై పోటీచేసింది… తరువాత గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీపై విరుచుకుపడింది… కేసు వేసింది… సహజంగానే మోడీకి ఆమె అంటే కోపం… కానీ ఆమె తల్లి మరణించినప్పుడు మోడీ కనీస సంతాపాన్ని కూడా వ్యక్తీకరించలేదు… మల్లిక దాన్ని తప్పుపట్టింది… ఐనా మోడీ సైలెంట్… మోడీ నిర్వికారం తప్పు… అది తప్పేనని తనకూ తెలుసు… అందుకే అర్ధాంగీకారం అన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు… అది గుర్తొచ్చింది… అంతే…
Share this Article