2013… నార్వేలో ఓ టీవీ 30 గంటల ఇంటర్వ్యూ ప్రసారం చేసింది… ఇప్పటివరకూ ఇదే ప్రపంచరికార్డు… అంతకుముందు 2012లో న్యూజిలాండ్‌లో 26 గంటల టీవీ ఇంటర్వ్యూ ఒకటి సాగింది… దానికిముందు కూడా కొన్ని రికార్డులున్నయ్… అయితే అవి స్ట్రెయిట్ ఇంటర్వ్యూలు… గంటకు ఓ ఐదు నిమిషాల బ్రేక్ ఉంటుంది… చూసేవాడు చూస్తాడు, లేదంటే స్విచాఫ్…
అయితే ప్రిరికార్డెడ్, ఎడిటెడ్ ఇంటర్వ్యూల మాటేమిటి ..? ఇవి ఇంకా సౌలభ్యం… అలా యూట్యూబులో పడేస్తే చాలు, అలా పడి ఉంటయ్… ప్రత్యక్ష ప్రసారం కాదుగా, ఓటీటీ పరిభాషలో చెప్పాలంటే జస్ట్, కంటెంట్… గంటల కొద్దీ ప్రత్యక్ష ప్రసారం అనేది పెద్ద టాస్క్, ఇంటర్వ్యూయర్‌కు ముందుగా సంబంధిత అంశాల మీద మంచి అవగాహన, స్పాంటేనిటీ అవసరం… గెస్టుకు జనంలో ఉన్న యాక్సెసబులిటీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి…
స్వప్న ఐడ్రీమ్స్ కోసం టుదిపాయింట్ పేరిట ఇంటర్వ్యూలు చేస్తుంటుంది… తాజాగా పాటల రచయిత అనంత శ్రీరాంతో చేసిన ఓ ఇంటర్వ్యూ పైన విషయాలన్నీ చకచకా గుర్తుచేసింది… ఈ ఇంటర్వ్యూ వారం కింద అప్‌లోడ్ చేసినట్టున్నారు… లక్షో లక్షంబావో వ్యూస్ కూడా ఉన్నయ్… ఇంటర్వ్యూ లెంథ్ తెలుసా..? 10 గంటలు… మీరు సరిగ్గానే చదివారు… అక్షరాలా పది గంటలు…
Ads
వామ్మో అనేయకండి… రామూయిజం పేరు మీద ఆమె వర్మతో చేసిన ఇంటర్వ్యూ భాగాలు భాగాలుగా సుదీర్ఘంగా ఉంటుంది… అవి ఎన్ని భాగాలో, మొత్తం ఒకేచోట కుట్టేస్తే అది వరల్డ్ రికార్డు అయి ఉండేదేమో తెలియదు గానీ… అదొక ప్రయోగం… క్వాలిటేటివ్ ఇంటర్వ్యూ కూడా..! వర్మను ఏం అడగాలో, ఎలా అడగాలో తెలిసిన ఏకైన ఇంటర్వ్యూయర్ ఆమె… సగటు యూట్యూబ్ ఫిమేల్ ఇంటర్వ్యూయర్ల మీద వెకిలి, వెటకారపు వ్యాఖ్యలకు దిగే పర్వర్షన్ స్వప్న మీద చూపించడు… చూపించలేడు…
అంతకుముందు టీఎన్ఆర్ ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూలు చేసేవాడు… బహుశా ఆయన ఎల్‌బీ శ్రీరాంతో చేసిన 8 గంటల ఇంటర్వ్యూ రికార్డు మొన్నమొన్నటిదాకా పదిలంగా ఉండిందేమో… ఈ అనంత శ్రీరాం ఇంటర్వ్యూ దాన్ని బద్ధలు కొట్టేసింది… ఇంటర్వ్యూ నాణ్యతలోకి మనం వెళ్లడం లేదిక్కడ… ఆమె గుడ్ ఇంటర్వ్యూయర్, సబ్జెక్టు నాలెడ్జి ఉంది… శ్రీరాం గుడ్ రైటర్… అలవోకగా, సరళంగా తన అభిప్రాయాల్ని మాటల చమక్కులతో సహా వెల్లడించగలడు… కానీ వివాదాస్పద ‘‘దిగుదిగు నాగ’’ పాటపై వివరణ మాత్రం తనకు చేతకాలేదనిపించింది… ఓ విఫల సమర్థనలా అనిపించింది… దాంతో అక్కడే ఇంటర్వ్యూ వీక్షణాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది… ఇక చూడాలనిపించలేదు…
సగటు యూట్యూబ్ చానెళ్ల తీరును బట్టి చూస్తే… ఈ 10 గంటల చాట్‌ను, కాదు, పదీముప్పావు గంటలు… అంటే 642 నిమిషాల నిడివిని నలభై యాభై ముక్కలు చేసి, వాటికి విడివిడిగా వర్తమాన ఆసక్తులను బట్టి థంబ్ నెయిల్ హెడ్డింగులు పెట్టేసి, యూట్యూబులోకి తోసేయాల్సింది… నిజంగా ప్రేక్షకులకు పెద్ద పెద్ద లెంథీ ఇంటర్వ్యూలు చూసేంత ఓపిక ఉందా..? అది అంత వీజీగా జవాబు దొరకని పెద్ద చిక్కు ప్రశ్న…
(అది కాదండీ, గంట సేపు interview ని పదే పదే రిపీట్ చేశారు అని ఎవరో అన్నారు… లైవ్ streaming లో అంతే, ప్రత్యక్ష ప్రసారం అయిపోగానే రిపీట్ అవుతూ ఉంటుంది… సో, length అలాగే చూపిస్తుంది అన్నారు మరొకరు… టెక్నికల్లీ కరెక్టే కావచ్చుగాక… కానీ అలాగైతే అదీ మైనసే కదా… కొన్నాళ్ల తరువాత సదరు వీడియో చూడాలనుకుంటే, ఆ నిడివి అంకెలు చూసి, భయంతో ప్రేక్షకుడు ఓపెన్ చేయకపోయే ఛాన్స్ ఉంది, మరి solution..? భయపడకండి, చిన్న వీడియో మాత్రమే అని డిస్‌క్లెయిమర్ ఒకటి డిస్‌ప్లే చేయాలేమో…!!)
అయిదారు నిమిషాల బిట్స్ చూడటానికే చిరాకుపడేవాళ్లు బోలెడు మంది… సరే, అలాగని సుదీర్ఘ ఇంటర్వ్యూల ప్రయాసను, ప్రయత్నాన్ని, ప్రయోగాన్ని ఆక్షేపించలేం… స్వప్న వేంఠనే ఒక ఫుల్ డే ఇంటర్వ్యూ దిశలో ప్లాన్ చేస్తే బెటర్… రికార్డు కోసం ప్రయత్నిస్తే తప్పేమీ లేదుగా…!! పోనీ, ఓ గంటసేపు ఎవరిదైనా ఇంటర్వ్యూను స్ట్రీమింగ్ చేసి, దాన్ని పదే పదే అలాగే రిపీట్ చేస్తే బెటరా..? అవునూ, యూట్యూబులో అత్యధిక నిడివి ఇంటర్వ్యూ ప్రపంచ రికార్డు ఎవరి పేరిట కలదు..? పోనీ, ఇండియా రికార్డు ఎంత..? బహుశా ఇదే ఐఉంటుందా..?! లిమ్కా బుక్ లేదా థమ్సప్ బుక్‌లోకి అనంత శ్రీరాముడు ఆల్‌రెడీ ఎక్కి ఉంటాడా..?!
Share this Article