ఫస్ట్ పేజీలో… పెద్ద ఫోటో… దానికి రైటప్… ముందు నమ్మాలనిపించలేదు… ఇది పంపిన మిత్రుడినే లింక్ పంపించు గురూ అన్నాను… అరె, నిజమే… నా డౌట్లు దేనికీ అంటే… అసలే మనది రైతు అబ్బుర ప్రభుత్వం… అసలు రైతుకు సమస్య అంటేనే మన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తల్లడిల్లిపోతారు… అలాంటిది ఈ ఫోటో వార్త ఏదో తేడా అనిపించింది… నమ్మాలనిపించలేదు…
మన సర్కారుకు అసలు వ్యవసాయం చేయని, పడావు భూములు, రాళ్లుగుట్టల భూముల పెద్ద పెద్ద దొరలు కూడా రైతులే… పాపం, ప్రాణాల్నే పణంగా పెట్టి వ్యవసాయం చేసి, ఆరిపోతున్న కౌలురైతులు అసలు రైతులే కాదు… వీలైతే కౌలు రైతులకు జరిమానాలు వేసినా తప్పులేదు అనుకునే అత్యంత ఉదారవైఖరి… అన్నీ డొల్ల పథకాలే కదా… అన్నీ వోట్ల లెక్కలే కదా…
మనుగోడు తనకు జై అంది… అంటే నువ్వు తెలంగాణను మస్తు ఉద్దరించేశావు, ఇక నీ దేశమాత రుణం తీర్చుకో కేసీయార్ అని యావత్ ప్రజానీకం బీఆర్ఎస్‌కు అంగీకారం తెలిపినట్టేనట… ఆ హస్తినలోని దుష్ట కౌరవుల రాజ్యాన్ని ఖతం చేయిపో అని ఆదేశించినట్టేనట… బహుశా సర్కారు రైతు సంక్షేమ పథకాలే ఈ ప్రశంసకు, అభినందనకు కారణాలై ఉంటాయి… అసలు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సమితి… ఇకపై భారతీయ రైతు సమితి అనాలనిపించేంత రైతు ప్రేమ… తిక్క లేస్తే రైతుల రుణమాఫీ కూడా చేసేస్తాడు… దేశమంతా ఫ్రీకరెంటు అన్నవాడికి ఇదెంత పని..?
Ads
నిజానికి పొలంలో ఎర్ర జెండాలు పాతడం దేనికి సంకేతం..? అప్పట్లో నక్సలైట్ల జోరు ఉన్నకాలంలో దొరలు, భూస్వాముల పొలాల్లో ఎర్ర జెండాలు పాతేసి, ఆక్రమించేసి, ఎవరో పేద రైతుకు ఇచ్చేసేవాళ్లు… ఇప్పుడు అప్పుల పాలై, అవి తీర్చలేక లబోదిబోమంటున్న చిన్న రైతుల పొలాలే ఎర్ర జెండాలకు టార్గెట్… బహుశా మొన్నమొన్నటివరకూ ఏ బ్యాంకర్‌కూ దమ్ములేకపోయేది ఇలా చేయడానికి…
కానీ ఇప్పుడు కేసీయార్ ఎడమ చంకలో సీపీఎం, కుడి చంకలో సీపీఐ ఉన్నాయి కదా… నక్సలైట్లు లేరు కదా… ఇంకేం… ఎర్ర జెండాలకు ఎదురేముంది..? వాటిని ఎక్కడైనా పాతుతారు అధికారులు కూడా… పాలకుడి స్నేహితులు ఎవరో వాళ్లకు తెలియదా ఏం..? అవునూ, అప్పులు తీర్చని పేద రైతు పొలంలో ఎర్ర జెండాలు పాతడం అంటే ఏమిటి అర్థం… ఈ పొలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం అనే బహిరంగ ప్రకటనా..? ఆ పంట కోసేసి అమ్మేసి, ఖాతాలో జమచేసుకుంటారా..? ఎర్ర జెండాలు తీసేస్తే మెడలు విరిగిపోతాయ్ అనే నక్సలైట్ల మార్క్ హెచ్చరికల్ని కూడా రాబోయే రోజుల్లో వినాల్సి వస్తుందా..?
ఫోటోలో బ్యాంకర్లను చూడండి… విజేతలుగా తలెత్తుకుని గర్వంగా కనిపిస్తున్నారు… అందులో ఆడలేడీస్ కూడా ఉన్నారు… అమ్మా, తల్లీ, నీ నెలజీతం ఎంతమ్మా..? ఈ పని కోసమేనా నిన్ను బ్యాంకు వాడు కొలువులోకి తీసుకుంది…?
అసలే కొత్త దోస్తానా… కేసీయార్‌ను ఏమైనా అంటే, సారుకు గుస్సా వస్తే, ఎహెఫోరా సూదులూ దబ్బనాలూ అని తరిమేసే ప్రమాదం ఉంది… అధికార పార్టీ వాళ్లయితే బ్యాంకు అధికార్లకు మద్దతుగా నిలబడతారేమో… వాళ్లకు జనం అక్కర్లేదు కదా… అవసరమొచ్చినప్పుడు వోటుకు 5 వేలు ఇస్తే సరి… మీడియా సంగతా..? అసలు ఆ రైతు చేసిన కుట్ర ఏమిటో రెండు పేజీలు నింపేది నమస్తే తెలంగాణ… నమస్తే సాక్షి, వెన్నువంగిన ఈనాడు గురించి వదిలేస్తే… మరి ఆంధ్రజ్యోతికి ఏమైంది..?
కానీ ఏమాటకామాట… బ్యాంకర్లు చేసింది తప్పు… తప్పున్నర… ఎర్ర జెండాలకు బదులు గులాబీ జెండాలే పాతాల్సింది… గతంలో ఎరుపు అంటే డేంజర్… రంగుల స్వభావాల్ని మార్చితే తప్పేముంది..? కాలం మారుతోంది… బ్యాంకర్లు మాత్రం మారరు… ఛిఛీ… సరే, అదుగో చూడండి… వేల కోట్లు ఎగవేసే అక్రమ వ్యాపారులకు కాస్త తోడుగా ఉండండి… దేశం విడిచిపోతారేమో, వోకే… రుణాల రద్దు అంటారేమో, వోకే… అన్నింటికన్నా ముందు ఈ బక్క రైతుల్ని లోపలేసి తోమేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురండి… మోడీ కాదనడు, వద్దనడు… కలర్ వేరు గానీ, తనూ ఈ తానులో ముక్కే…!!
Share this Article