.
లైంగిక వేధింపుల మీద గట్టి వ్యతిరేకత తెలిపిన పోప్ ఫ్రాన్సిస్
… ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల అధినేత 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. పోప్ మొత్తం క్రైస్తవ సమాజానికి ప్రతీక కాదు. క్రైస్తవుల్లోని క్యాథలిక్‌లకు మాత్రమే ఆయన అధినేత. అది కాకుండా క్రైస్తవంలో ప్రొటెస్టెంట్లు, పెంతెకొస్తులు, ఆర్తడాక్స్‌లు అని చాలా వర్గాలుగా ఉంటారు.
దేశాన్ని, ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని ఇతర వర్గాలున్నాయి. మన దేశంలోని క్రైస్తవుల్లో 33 శాతం మంది క్యాథలిక్కులున్నారు. ఏసుక్రీస్తు బొమ్మలతో, భారీగా సినిమాల్లో చూపించే చర్చీలు క్యాథలిక్‌లవే. ‘పోప్’ కేవలం పదవి మాత్రమే.
Ads
ఆయన కింద ప్రపంచవ్యాప్తంగా 5,600 మంది బిషప్స్ ఉంటారు. వారి కింద ప్రీస్ట్‌లు ఉంటారు. అన్ని పదవులకూ ఉన్నట్లే పోప్ పదవికీ ఎన్నికలు, రాజీనామాలు ఉంటాయి. గత పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా అనంతరం 2013లో ఫ్రాన్సిస్ ఆ పదవిలోకి వచ్చారు. ప్రస్తుతం ఫ్రాన్సిస్ మరణం తర్వాత మరో పోప్‌ను ఎన్నుకుంటారు.
… గతంలోని పోప్‌లతో పోలిస్తే పోప్ ఫ్రాన్సిస్ చాలా విప్లవాత్మకంగా వ్యవహరించారనే పేరుంది. ముఖ్యంగా తప్పుల్ని తప్పు అని ఖండించడంలో ఆయనది సూటి పంథా అంటారు. సమాజంలోని లైంగికహింసతోపాటు చర్చీల్లో జరుగుతున్న హింస గురించి ఆయన బాహటంగానే విమర్శించారు.
ప్రార్థన మందిరాల్లో జరుగుతున్న బాలల లైంగిక దోపిడీ గురించి జరగాల్సిన చర్చ జరగడం లేదని, దాని మీద కఠినమైన చర్యలు అవసరం అని ఆయన గతంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అయితే, ఇలాంటి లైంగిక హింసకుగానూ చర్చి సిగ్గుపడాలని సంచలనాత్మక కామెంట్ చేశారు. ఇకపై చర్చీల్లో లైంగికహింస జరగకుండా తాను బాధ్యత తీసుకుంటానని కూడా అన్నారు.
… ఫ్రాన్సిస్ పోప్ అయిన తర్వాత బాధితులు బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించే ఏర్పాటు చేశారు. లైంగిక హింసను ప్రధాన చర్చలోకి తీసుకొచ్చారు. చర్చి ప్రీస్టులపై లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించే అధికారం బిషప్‌లకు ఇవ్వడంతోపాటు బిషప్‌లపై వచ్చిన ఆరోపణలనూ తోటివారు విచారించే అధికారం ఇచ్చారు.
గత పోప్‌లకంటే ఎక్కువగా లైంగిక హింస బాధితులను కలిసి, వారికి తన క్షమాపణలు చెప్పుకున్నారు. ఇదంతా క్యాథలిక్ సమాజానికి కొత్త సందేశాలను అందించింది.
… చర్చీలు ఎల్జీబీటీ వర్గాలను దయతో చూడాలని, వారిని కించపరచకూడదని చెప్పారు. ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. వినిమయ సంస్కృతి (Consumerism), పెట్టుబడిదారీ వ్యవస్థ (Capitalism)లను విమర్శించారు. అక్రమ వలసవాద రాజకీయాలనూ వ్యతిరేకించారు. వలసవాదులను రక్షించడం పౌరుల బాధ్యత అన్నారు. చర్చిలో మహిళలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేశారు.
.. అయితే, చేయదగ్గ చాలా పనులు పోప్ ఫ్రాన్సిస్ చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తీవ్రమైన లైంగిక ఆరోపణలున్న కొందరికి ఆయన ఎటువంటి శిక్షా వేయలేదని, చర్చీల్లో లైంగిక హింసను ముందే పసిగట్టే వ్యవస్థ గురించి ఆలోచించలేదని, చర్చిలో ఉద్యోగులు చేసే లైంగిక వేధింపులపై గట్టిగా మాట్లాడలేదని, ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయనను కొందరు విమర్శిస్తారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు నివాళి …
***
PS: చర్చీల్లో లైంగిక హింసలా అని సందేహించొద్దు. అమెరికాలో SNAP (Survivors Network of those Abused by Priests) అని 1989లో బార్బరా బ్లెయిన్ అనే ఆవిడ ఓ సంస్థను నెలకొల్పారు. క్రైస్తవ మతాధికారులు, ప్రీస్టుల (ఫాదర్లు) చేతిలో లైంగిక హింసకు గురైన వారంతా ఈ సంస్థలో సభ్యులుగా చేరతారు. ఇందులో 56 దేశాలకు చెందిన 12 వేల మందికిపైగా సభ్యులున్నారు. ఈ సంస్థ మీద బోలెడు విమర్శలున్నా, సంస్థ ఉన్నమాట నిజం…. — విశీ (వి.సాయివంశీ)
Share this Article