Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జారిపడిన కాంగ్రెస్ జెండాకు కనిపించే వారస ఆశాకిరణం… రేహాన్..!

December 29, 2021 by M S R

…… By…. Nancharaiah Merugumala…………..  

ఎగరలేక సోనియా చేతుల్లో పడిన కాంగ్రెస్‌ రాట్నం జెండా!

ప్రియాంక కొడుకు రేహాన్‌ చేతికి వస్తుందా మరో  పదీపాతికేళ్లకు?

––––––––––––––––––––––––––––––––––––

భారత జాతీయ కాంగ్రెస్‌ 136వ వార్షికోత్సవం (137వ స్థాపక దినం) సందర్భంగా మంగళవారం దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ‘తాత్కాలిక’ అధ్యక్షురాలు సోనియాగాంధీ పతాకావిష్కరణకు వచ్చారు. పార్టీ రాట్నం జెండాను ఎగరేసే ప్రయత్నంలో ఇనప స్తంభంపైకి తెల్లతాడుతో పంపారు. పోల్‌ చివరికి చేరగానే తాడు నుంచి జెండా ఊడి, కిందికి జారి సోనియమ్మ చేతుల్లో పడింది. జెండాను ఒడిసిపట్టుకున్న ఆమె మళ్లీ దాన్ని ఎగరేసే ప్రయత్నం చేయకుండా మరో ఇద్దరు నేతలతో కలిసి పట్టుకుని నాయకులు, కార్యకర్తలకు ప్రదర్శించారు. కాంగ్రెస్‌ చేతుల్లోంచి అధికారం పోయి ఏడున్నరేళ్లు అవుతున్నా పైకెగరలేని పార్టీ జెండా ఇంకా నెహ్రూ–గాంధీ పరివారం చేతుల్లోనే పడింది. పైన ఎగిరినా, ఎగరలేక కిందకు జారినా మువ్వన్నెల రాట్నం జెండాకు సురక్షిత స్థానం సోనియా, రాహుల్, ప్రియాంకల హస్తాలే. వారి తర్వాత ‘కుటుంబంలోని చివరి ప్రధాని’ రాజీవ్‌ గాంధీ మనవడు, మనవరాలు రేహాన్, మిరాయా వాడ్రాలు ఈ ఖద్దరు జెండా మోయడానికి ఇష్టపడతారా? ఓ పది పద్నాలుగేళ్లలో ఈ విషయం తెలుస్తుంది.

Ads

rehan

క్రికెట్‌ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో ఒక కంటి (ఎడమ) చూపు పోగొట్టుకున్న రేహాన్‌ కు ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఎక్కువ. దాదాపు రెండేళ్ల క్రితం 19 ఏళ్ల వయసులో ఈ అబ్బాయి ట్విటర్‌ అకౌంట్‌ తెరిచాడు. రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నా, ఈ 21 సంవత్సరాల కుర్రాడికి ట్విటర్‌ లో మంచి అభిమాన బృందం ఉంది. దురదృష్టవశాత్తూ 16 ఏళ్ల వయసులో ఎడమ కంటికి దెబ్బ తగిలి చూపు శాశ్వతంగా పోయిందిగాని ప్రియాంక కొడుకు జంకలేదు. ‘‘ఫోటోగ్రాఫర్‌ కు ఓ కన్నుపోయినా నష్టం లేదని తర్వాత తెలుసుకున్నా. ఈ దుర్ఘటన తర్వాత ఇది నా జీవితంలో అత్యంత ముఖ్య ఘటన అని గుర్తించా. కారు నడిపేటప్పుడు కాస్త ఎక్కువ పక్కకు తిరిగి చూడాలి. రోడ్డు దాటేప్పుడు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంతే. ఒక కన్నుతోనే చూసే శక్తి ఉన్నవారికి అంతకన్నా ఇబ్బంది ఏమీ ఉండదు, ’’ అంటూ తాను తీసిన ఛాయాచిత్రాల ప్రదర్శన (కిందటి జులైలో దిల్లీలో) సందర్భంగా రేహాన్‌ రాజీవ్‌ చెప్పాడు. సందర్భాన్ని బట్టి తన కన్ను ఒకటి కనపడదని చెబుతాడు. ఈ విషయం వెల్లడించడానికి భయపడడు. (అప్పుడప్పుడూ ఈ విషయంలోనే ప్రియాంక హైదరాబాద్‌లోని ప్రముఖ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని సందర్శిస్తుంది… ప్యూర్ పర్సనల్… ఏ నాయకుడినీ కలవదు…) 

aicc

రాజకీయాలంటే ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపాలంటున్న ప్రియాంక కొడుకు

––––––––––––––––––––––––––––––––––––––––––––

యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ లోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌ (ఎస్వోఏఎస్‌) లో పాలిటిక్స్‌ చదువుతున్న రేహాన్‌ తీసిన ఫోటోలు చూస్తే– చిన్న వయసులోనే లోతైన మనిషిలా అనిపిస్తాడని అంటారు. బ్రిటన్‌ లో రాజకీయాలు ఎక్కువ చర్చించే, అధ్యయనం చేసే విద్యాసంస్థల్లో ఒకటిగా బాగా పేరున్న ఎస్వోఏఎస్‌లో చదువుతున్న కారణంగా రేహాన్‌ రాజకీయాలను క్షణ్ణంగా ఫాలో అవుతున్నాడు. రాజనీతిశాస్త్రం లండన్‌ లో చదువుతున్న మీరు చివరికి రాజకీయాల్లోకి దిగుతారు కదా? అని ఓ పత్రిక విలేఖరి ప్రశ్నించగా, ‘‘నేను రాజకీయాల్లో బాగా ఇన్వాల్వ్‌ కాకపోయినా, ఈ రంగంలో ఏం జరుగుతుందో నిత్వం గమనిస్తుంటాను. రాజకీయాలపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించాలి. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో చూస్తుండాలి. రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి? ఎలా పనిచేస్తున్నాయి? అని అందరూ అధ్యయనం చేయాలని నేను భావిస్తాను,’’ అని రాజీవ్‌ మనవడు ధైర్యంగా చెప్పాడు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావాలని ఆలోచించడం లేదు గాని ఫోటోగ్రఫి మాత్రం తనకు ఇష్టమైన వ్యాపకంగా జీవితాంతం ఉంటుందని రేహాన్‌ చెప్పాడు. ఇండియా వంటి పూర్వపు వలస దేశాల్లో ‘ డైనాస్టీ’ని ఎంత ‘నేస్టీ’ అనుకున్నా, ప్రజాస్వామ్యం వేగంగా ముందుకు కొనసాగడానికి రాజకీయ కుటుంబాల అవసరం ఉందని ఎక్కువ మంది అంగీకరించే రోజులివి. పొలిటికల్‌ సైన్స్‌ చదువుకున్న రేహాన్‌ వంటి ‘సీరియస్‌ రాజకీయ వారసులకు’ అనుకూలమైన రాజకీయ కార్యక్షేత్రం భారతదేశం.

rehan vadra

రాజకీయాల్లో చేరడానికి అన్ని విధాల అనుకూల కుటుంబ నేపథ్యం

–––––––––––––––––––––––––––––––––––––––––

ముత్తాత ఫిరోజ్‌ గాంధీ పేరులోని ఫిరోజ్‌ (సుగంధం–తులసిదళం వాసన వంటిది)ను పోలిన అర్ధం ఉన్న రేహాన్‌ ఎప్పటికైనా– అంటే మేనమామ రాహుల్‌ మాదిరిగా 34 ఏళ్ల వయసులోనైనా రాజకీయాల్లో చేరకతప్పదని దిల్లీ ఇంగ్లిష్‌ పాత్రికేయులు చెబుతున్నారు. తల్లి ప్రియాంకకు ఎలాగూ తన నాయనమ్మ ఇందిరలా రాజకీయాలంటే ఆసక్తి ఉంది కాబట్టి రేహాన్‌ రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది. ముందు చూపుతో ఒక్కగానొక్క కొడుకు పేరు రేహాన్‌ కు అదనంగా రాజీవ్‌ అనే మాట కొన్నేళ్ల క్రితం ప్రియాంక జోడించారు. పాకిస్తాన్‌ పంజాబ్‌లోని సియాల్‌ కోట్‌ అనే నగరంలో మూలాలున్న పంజాబీ ఖత్రీ (క్షత్రియ) కుటుంబ నేపథ్యం (తండ్రి రాబర్ట్‌ వాద్రా వైపు నుంచి) కూడా రేహాన్‌ కు ఉపయోగపడుతుంది, అమ్మమ్మ సోనియాది ఇటలీ అయితే, నాయనమ్మ మౌరీన్‌ మెక్‌ డొనాఫ్‌ ఇంగ్లండ్‌లోని స్కాట్లండ్‌ మూలాలున్న మహిళ. పంజాబీ ఖత్రీ అని చక్కగా సూచించే ‘ వధేరా ’ అనే ఇంటి పేరును ప్రియాంకతో పెళ్లయ్యాక–వాడ్రా అని రాబర్ట్‌ మార్చుకున్నాడు. ఇన్ని రకాలుగా వైవిధ్య భరితమైన కుటుంబ నేపథ్యం ఉన్న రేహాన్‌ రాజీవ్‌ వాడ్రా తన పేరులో నెహ్రూ, గాంధీ అనే తోకల అవసరం లేకుండా తాత రాజీవ్‌ కు తగిన రాజకీయ వారసుడు అవుతాడని ఆశిద్దాం. తల్లి ప్రియాంక ముత్తాత జవాహర్‌ లాల్‌ పేరు నిలబెట్టాలని కోరుకుందాం.

rehan

2000 ఆగస్టు 29న పుట్టిన ‘ మిలేనియం బిడ్డ ’ కూడా అయిన రేహాన్‌ భారతదేశ ప్రథమ కుటుంబం పేరు మరోసారి మోగించడానిక అన్ని విధాలా అర్హుడిగా కనిపిస్తున్నాడు. తాత రాజీవ్, మేనమామ రాహుల్‌ అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చి స్థిరపడిన విషయం ఈ కుర్రాడికి తెలుసు. తాను మాత్రం సంపూర్ణ ఆసక్తితో రాజకీయాల్లోకి వస్తాడనే అభిప్రాయం కలిగిస్తున్నాడు. మళ్లీ అసలు విషయానికి వస్తే– ఈరోజు ఎగరేయడానికి ఇనపు స్తంభం చివరికి చేరిన కాంగ్రెస్‌ పార్టీ రాట్నం జెండా జారి పార్టీ అధ్యక్షురాలు సోనియా చేతిలో పడినట్టే బీజేకీ కూడా జెండా కిందకు జారిన అనుభవం ఉంది. పాలకపక్షం కాబట్టి బీజేపీది కాస్త పెద్ద అనుభం, పెద్ద జెండా. 2018 ఆగస్ట్‌ 15న 72వ స్వాతంత్య్ర దినం సందర్భంగా బీజేపీ ఆఫీసులో పార్టీ అధ్యక్షుని హోదాలో అమిత్‌ షా తాడు లాగగానే స్తంభం మధ్య నుంచి పైకి పోకుండా కిందకు వచ్చింది నేషనల్‌ ఫ్లాగ్‌. కాని తాడు తెగలేదు, తాడు నుంచి జెండా ఊడలేదు. మళ్లీ పైకి పంపడానికి రెండో తాడు కిందకు గుంజగానే జాతీయ పతాకం పైకి చేరింది. జాతీయ జెండాను తిన్నగా పైకి పంపలేని అమిత్‌ షా దేశాన్ని ఏం పాలిస్తాడని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. రాజకీయ పార్టీలకు జెండాలు, దేశాలకు జాతీయ జెండాలు చిహ్నాలుగా అవసరం లేని రోజు ఎప్పుడొస్తుందో మరి?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions