.
ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ పేరు చాలు.. సంగీత ప్రియులు ఉర్రూతలూగిపోయేవారు. ఆయన పాటలు వినడమే కాదు, లైవ్‌లో ఆయన సంగీత బృందం చేసే మ్యాజిక్‌ను చూడాలని అభిమానులు ఉత్సాహపడేవారు. ఆస్కార్ అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపు, దశాబ్దాల సంగీత ప్రయాణం.. ఇవన్నీ రెహమాన్‌కు ఉన్న బ్రాండ్ విలువను పెంచాయి…
కానీ ఇప్పుడు..? అదే రెహమాన్ కచేరీల నిర్వహణలోనూ, ప్రేక్షకులను థియేటర్లకు కాకుండా వేదికల దగ్గరకు రప్పించడంలోనూ సవాళ్లు ఎదుర్కొంటున్నాడు? తాజాగా గురుగ్రామ్‌లో జరగాల్సిన ఆయన కచేరీ వాయిదా పడటం తన బ్రాండ్ వాల్యూ గణనీయంగా పడిపోవడానికి, తన పట్ల సంగీత ప్రియుల ఆదరణ రానురాను బాగా తగ్గిపోవడానికి అద్దం పడుతోంది…
Ads
నవంబర్ 21న గురుగ్రామ్‌లోని బ్యాక్‌యార్డ్ స్పోర్ట్స్ క్లబ్‌లో రెహమాన్ తన ‘వండర్‌మెంట్ టూర్’లో భాగంగా సంగీత విభావరి నిర్వహించాల్సి ఉంది. సాధారణంగా టికెట్ ధర రూ.2,499 కాగా, ప్రీమియం వీడీఐపీ డెక్‌ల ధర ఏకంగా రూ.1.50 లక్షల వరకు ఉంది. అయితే కార్యక్రమానికి కొద్ది రోజుల ముందు నిర్వాహకులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

అనివార్య పరిస్థితులు, చివరి నిమిషంలో ఎదురైన కీలక పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవా లైవ్ ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్వహిస్తామని చెప్పినా కొత్త తేదీని వెల్లడించలేదు. టికెట్లు కొనుగోలు చేసినవారికి మాత్రం పూర్తి డబ్బులు తిరిగి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టికెటింగ్ సంస్థ డిస్ట్రిక్ట్ తన వెబ్‌సైట్‌లో ఈ కార్యక్రమాన్ని ‘క్యాన్సిల్‌డ్’గా పేర్కొంది. అంటే నిర్వాహకుల ప్రకటనలో వాయిదా, టికెటింగ్ ప్లాట్‌ఫామ్ దగ్గర రద్దు అనే రెండు రకాల సంకేతాలు కనిపిస్తున్నాయి…
ఇది ఒక్క కార్యక్రమంతోనే ఆగిపోలేదు. ఇదే వండర్‌మెంట్ టూర్‌లో భాగంగా కోల్‌కతాలో జనవరి 11న జరగాల్సిన కచేరీని ఏప్రిల్ 11కు వాయిదా వేశారు. ఆ తర్వాత అది కూడా నిరవధికంగా వాయిదా పడింది.
గత ఏడాది ఢిల్లీలో జరిగిన ‘హార్మనీ ఆఫ్ హార్ట్స్’ కార్యక్రమం విషయంలోనూ టికెట్ల రద్దు, ఓవర్‌బుకింగ్, ప్రేక్షకుల అసౌకర్యం వంటి వివాదాలు తలెత్తాయి. కార్యక్రమానికి ఒక్కరోజు ముందు పలువురికి టికెట్లు రద్దయినట్టు సమాచారం అందింది. టికెట్లు చెల్లుబాటైనవారు వెళ్లినా వేదిక దగ్గర రద్దీ, నిర్వహణ లోపాలపై ఫిర్యాదులు వచ్చాయి. రెహమాన్ స్థాయి సంగీతకారుడి కార్యక్రమాల చుట్టూ ఇలాంటి పరిణామాలు పదేపదే చోటుచేసుకోవడం నిర్వాహకులకూ, అభిమానులకూ ఇబ్బందికరమే.
అసలు సమస్య కచేరీల మార్కెట్‌లోనే ఉందా? ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ఉంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో భారీ స్థాయి మ్యూజిక్ కాన్సర్ట్‌లకు ఆదరణ పెరిగింది. కానీ పేరు ఉన్నంత మాత్రాన టికెట్లు అమ్ముడైపోవడం లేదు. కళాకారుడి పాపులారిటీని టికెట్ కొనుగోలు చేసే ప్రేక్షకుల సంఖ్యగా మార్చడం వేరు. భారీ వేదికలు, సౌండ్ సిస్టమ్స్, లైటింగ్, ప్రయాణం, ప్రచారం.. వీటన్నింటికీ భారీ ఖర్చు అవుతుంది. టికెట్ల ధరలు కూడా సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండటం లేదు.
ఈ విషయంలో అనిరుధ్ రవిచందర్ మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఆయన కచేరీలకు యువతలో ఉన్న క్రేజ్, సంగీత ప్రదర్శనలోని ఎనర్జీ, సినిమా పాటలకు ఉన్న ప్రజాదరణ కలిసి మంచి మార్కెట్‌ను సృష్టించాయి. మిగిలిన సంగీత దర్శకుల విషయంలో మాత్రం ఇదే స్థాయి స్పందన కనిపించడం లేదన్న చర్చ ఉంది. రెహమాన్ లాంటి అంతర్జాతీయ స్థాయి సంగీతకారుడి కచేరీ కూడా వాయిదా పడటం ఈ మార్కెట్ వాస్తవాలను మరోసారి చర్చకు తెస్తోంది.
రెహమాన్ చుట్టూ పెరిగిన వివాదాలు కూడా ప్రభావం చూపాయా? ఇటీవలి కాలంలో రెహమాన్ సంగీతం కంటే ఆయన చుట్టూ జరుగుతున్న చర్చలే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నాయి. రామాయణం సినిమా కోసం ఆయన రూపొందించిన ‘మంగళ్ రంగ్’ పాటలో ఖవ్వాలీ తరహా సంగీత ప్రయోగాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హిందూ ఇతిహాసానికి సంబంధించిన పాటలో సూఫీ సంగీత ప్రభావం ఎందుకంటూ కొందరు ప్రశ్నించారు.
మరోవైపు బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతపరమైన అంశాలు కూడా కారణమై ఉండొచ్చని రెహమాన్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలు ఆయన అభిమానుల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ భిన్నమైన అభిప్రాయాలను సృష్టించాయి.
ఈ నేపథ్యంలో గురుగ్రామ్ కచేరీ విషయంలోనూ నిర్వాహకులు అన్ని కోణాల్లో ఆలోచించి ఉంటారా? టికెట్ అమ్మకాలు, కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చు, ప్రేక్షకుల స్పందన, తాజా వివాదాల నేపథ్యంలో తలెత్తే పరిస్థితులు.. ఇలాంటి అంశాలన్నీ వారి నిర్ణయంపై ప్రభావం చూపి ఉండొచ్చనే ఊహాగానాలకు అవకాశం ఉంది…
సినిమా పాటలతో కోట్లాది అభిమానులను సంపాదించడం ఒక ఎత్తయితే.. వాళ్లందరినీ టికెట్ కొనిపించి కచేరీకి రప్పించడం మరో ఎత్తు. రెహమాన్‌కైనా ఈ మార్కెట్ పరీక్ష తప్పడం లేదు!
Share this Article