అందరూ మెచ్చుకుంటున్నారు కదాని… పదే పదే ఒకే ఐడియాను రిపీట్ చేయాలనుకోవడం, దాన్నే క్రియేటివిటీగా చెప్పుకోవడం శుద్ధ దండుగరా సోనీ తండ్రీ… మరీ స్టార్ వాడి బిగ్‌బాస్ అనబడే ఓ చెత్తా రియాలిటీ షోగా ఇండియన్ ఐడల్ షోను కూడా మార్చేయకండిరా నాయనా… నిజమే, ఏ టీవీ రియాలిటీ షో అయినా రేటింగ్స్ కోసం నానా వేషాలూ వేయకతప్పదు… మ్యూజిక్, కాంపిటీషనూ మన్నూమశానంకన్నా ఇతరత్రా అంశాలే పాపులారిటీకి దోహదపడుతున్నదీ నిజమే… అయితే అసలు కూరకన్నా మసాలాయే ప్రధానమైపోతే క్రమేపీ వంట వెగటు కలిగిస్తుంది… జాగ్రత్త… విషయం ఏమిటంటే..? ఈ ఇండియన్ ఐడల్ షో ఈసారి బాగా రక్తికడుతోంది, కంటెస్టెంట్లు అదరగొడుతున్నారు… కానీ ఈ షోవాడు ఏం చేస్తున్నాడు అంటే… ప్రతివారం ఓ గెస్టును పట్టుకొస్తున్నాడు… వోకే, గుడ్… ఆ గెస్టుకు సంబంధించిన పాటలే వీళ్లూ పాడుతున్నారు… అంతేతప్ప నిజంగా తమలో ప్రతిభను ప్రదర్శించే వైవిధ్యభరిత పాటల్ని ఎంపిక చేసుకోలేని స్థితి… ఐనా సరే, గుడ్… ఏ షో అయితేనేం, డర్టీ పిక్చర్లో విద్యాబాలన్ చెప్పినట్టు ఎంటర్టెయిన్మెంట్ ముఖ్యం కదా… ఇదీ అదే అనుకుందాం… అయితే…
వచ్చిన గెస్టులు ఆహా ఓహో అనేస్తున్నారు… పాటల్లో లీనమవుతున్నారు… ఎంకరేజ్ చేస్తున్నారు, తమ పాత స్మృతులు యాదికి తెచ్చుకుంటున్నారు… ప్రేక్షకులకు కూడా నచ్చుతోంది… రేఖ వచ్చి ఈ వాతావరణాన్ని మార్చేసింది… తను డోలక్ కొట్టింది, డాన్స్ చేసింది, జోకులు వేసింది, ఓ బిట్ పర్ఫామ్ చేసింది… అందరినీ ఆత్మీయంగా హత్తుకుంది, కన్నీళ్లు పెట్టుకుంది… జడ్జి నేహకు చీరె కానుకిచ్చి, తనే కట్టింది… షణ్మఖప్రియను తెలుగులో మెచ్చుకుంది… సవాయ్ భట్‌కు ఇంటి నుంచి తెచ్చిన పన్నీర్ కూర, చపాతీ తినిపించింది… అందరికీ పెట్టింది… వెరసి ఒక వినోదవీచిక ఆమె… 68 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ ప్రౌఢ… ఇక ఇప్పుడు జయప్రద వచ్చింది… ఏం చేసింది..?
Ads
సేమ్, అదే షణ్ముఖప్రియను తెలుగులో మెచ్చుకుంది… ఇంటి నుంచి తెచ్చిన రసం అన్నాన్ని తినిపించింది… తనూ డాన్స్ చేసింది… హేమిటో, రేఖలాగే చేయాలని…!! రేపటి వారం మరో గెస్టు వస్తే మటన్ బిర్యానీ తెస్తుందేమో… లేదా మిరపకాయ బజ్జీల్ని తెస్తాడేమో… ఈ ఇంటి వంటలు తెచ్చి తినిపించడం ఏమిట్రా నాయనా..? ఐనా షణ్ముఖ బాగా పాడి తనను మెప్పిస్తుందని ముందే ఊహించి, ఇంటి దగ్గర రసం అన్నం వండి, తీసుకొచ్చావా..? చెప్పొచ్చావులేవమ్మా…! ఐనా పెరుగు పెరుగే, మజ్జిగ మజ్జిగే… రేఖ రేఖే… జయప్రద జయప్రదే… 59 ఏళ్లకే ఈమెలో ముసలితనం కనిపిస్తోంది… రేఖ 68 ఏళ్లకూ ఆ ఛాయలు తక్కువ… పైగా హిందీలో జయప్రదకు సర్గమ్ వంటి ఒకటీరెండు మినహా మిగతావన్నీ కమర్షియల్, గ్లామర్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్… కానీ రేఖ అలా కాదు కదా… ఆమెకు బాలీవుడ్ పుస్తకంలో ఓ అధ్యాయమే ఉంది… సరే, వాళ్లిద్దరి నడుమ పోలికలు ఎందుకులే గానీ… వైవిధ్యమున్న పాటలు పాడటంలో ప్రతిభస్పర్థ కనిపించాలంటే ఈ గెస్టులకు తగిన పాటలే పాడాలనే వాతావరణం ఉండొద్దు… రేఖ వచ్చిన్నాటి షో ఆల్ ఇండియా రేటింగుల్లో టాప్ త్రీ ప్లేసులో కనిపించింది కదాని, జయప్రదను కూడా తీసుకొచ్చి అలాగే చేయిస్తే ఎలాగోయ్ సోనీవాడా..?! పవన్ దీప్, ఆశిష్ హోటల్ క్వారంటైన్‌కు చేరారు… రేఖ పన్నీర్ కూర తిన్న సవాయ్ భట్ తల్లి అనారోగ్యం కారణంగా ఇంటికి వాపస్ వెళ్తాను అంటున్నాడు… జయప్రద ఎపిసోడ్లో జడ్జి నేహ కూడా ఉండటం లేదు… ఏదో దిష్టి తగిలినట్టుంది ఈ షోకు… ఒక్క షణ్ముఖ ప్రియకు తప్ప..!! అన్నట్టు, రాంగోపాలవర్మను పిలిచేరు సుమీ, ఓ వోడ్కా బాటిల్, మటన్ కబాబ్స్ ఎత్తుకుని వచ్చేస్తాడు… ఇక మీ ఇష్టం…
Share this Article