మొన్న రిలయెన్స్ ఏం చెప్పింది..? నో, నో, మేం వ్యవసాయ సంబంధ ఉత్పత్తులను కొనడం లేదు… భూములు కొనడం లేదు… మాకు అసలు ఆ వ్యాపారం మీద ఆసక్తే లేదు… మా వ్యాపార ప్రణాళికల్లో ఆ ప్లాన్లే లేవు… అంటూ ఏదేదో క్లారిఫికేషన్లు ఇచ్చింది కదా… కానీ అది రెండు వారాల క్రితమే కర్నాటకలో ధాన్యం సేకరించింది… అదీ సోనా మశూరి… రాయచూరు జిల్లా, సింధనూరు తాలూకాలో 1100 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు రిలయెన్స్ గ్రూపు కంపెనీ అయిన రిలయెన్స్ రిటెయిల్ ఒప్పందం కుదుర్చుకుంది… అయితే ఇక్కడ కాస్త తెలివి ప్రదర్శించింది…
తను నేరుగా రైతుల నుంచి కొనకుండా స్వాస్థ్య ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అనే మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది… ఈ కంపెనీ రిలయెన్స్ తరఫున రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నమాట… దాన్ని ప్రాసెస్ చేసుకుని, రిలయెన్స్ తన రిటెయిల్ స్టోర్స్‌లో అమ్ముకుంటుంది… తాజాగా కుదిరిన డీల్ ప్రకారం క్వింటాల్‌కు 1950 చెల్లిస్తారు… ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధరకన్నా కాస్త ఎక్కువే… ఎంఎస్పీ 1868… వీళ్లు ఇస్తున్న ధర 1950… అంటే 82 అదనం… అది పెద్ద తేడా కాదు…
Ads
రైతులే గన్నీ బ్యాగులు కొని, రైతులే సింధనూరు కంపెనీ గోదాముకు తరలించాల్సి ఉంటుంది… కాబట్టి ఖర్చులు పోను, మద్దతుధర వచ్చినట్టు లెక్క… మధ్యలో ఉన్న స్వాస్థ్య కంపెనీకి కూడా 1.5 శాతం కమీషన్ చెల్లించాలి… ఈ మొత్తం వ్యవహారంలో రిలయెన్స్‌కూ రైతుకూ నడుమ ఏ లింకూ ఉండదు… ప్రొక్యూర్ చేసేది వేరే కంపెనీ… ఆ కంపెనీకే రిలయెన్స్ నగదు బదిలీ చేస్తుంది… ఆ కంపెనీ రైతులకు చెల్లింపులు చేస్తుంది… అంటే మున్ముందు రైతులతో వచ్చే చిక్కులకు రిలయెన్స్ బాధ్యత వహించదన్నమాట…
చూశారా, చూశారా, రిలయెన్స్ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నదో… కొత్త వ్యవసాయ చట్టాల అమలుకు ఆల్రెడీ రంగంలోకి దిగింది… పంజాబ్, హర్యానాలో తమ ఆస్తుల్ని రైతులు ధ్వంసం చేస్తున్నారు కాబట్టి… భయపడిపోయి… రైతులకు మోసపుమాటలు చెబుతూ… హెబ్బే, మేం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు రంగంలో లేమని బుకాయిస్తోంది అనే వార్తలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి… ఇక్కడ నాణేనికి మరోవైపు చూద్దాం…
రిలయెన్స్‌కు రిటెయిల్ వ్యాపారం ఉంది… ఆ స్టోర్స్ కోసం ధాన్యమే కాదు, రకరకాల పంట ఉత్పత్తులను కొంటుంది… కొనాలి… కొనకపోతే తన వ్యాపారమే నడవదు… ఆ ఉత్పత్తులను స్వాస్థ్య వంటి ట్రేడర్స్ ద్వారా కొంటున్నది తప్ప నేరుగా రైతుల నుంచి కాదు… ఇదేమీ ధాన్యం రైతులతో కుదుర్చుకున్న కంట్రాక్టు ఫార్మింగ్ కాదు… ఎంఎస్పీ దిగువ కొనుగోళ్లు కావు… సో.., కొత్త వ్యవసాయ చట్టాలు ఈ కొనుగోళ్లకు వర్తించవు.., ఆ ఆదానీకి గోదాముల నిర్వహణ, నిల్వ, రవాణా తదితర దందాలున్నయ్… రిలయెన్స్‌కు అవి కూడా లేవు… అందుకని సింధనూరు ధాన్యం కొనుగోళ్లకూ కొత్త వ్యవసాయ చట్టాలకూ లింక్ లేదు… రిటెయిల్ మాల్స్ అందరూ చేసే పని రిలయెన్స్ చేస్తోంది… అంతే… అసలు కంట్రాక్ట్ ఫార్మింగు ఏమిటో కూడా తెలీకుండా కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బాష్యాలు, వార్తలు ఉత్పత్తవుతున్నయ్…! నిజంగా రైతు దోపిడీకి గురయ్యే అంశాలపై మాత్రం కలాలు కదలవు…!!
Share this Article