.
జార్జి ఫెర్నాండెజ్… ఇప్పుడు ఎందుకు గుర్తుకువస్తున్నాడు..? అమెరికా ట్రంపు ఆంక్షల కొరడాలు, సుంకాల కత్తులతో ఇండియా మీద దండయాత్ర చేస్తున్నాడు కాబట్టి… నోటికొచ్చింది మాట్లాడుతూ, ఘడియకో నిర్ణయంతో కలకలాన్ని, కలవరాన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి… మన ఆర్థిక వ్యవస్థ మీద ఏదేదో కూస్తున్నాడు కాబట్టి…
4- 5 ట్రిలియన్ల ఆర్థిక సత్తాకు చేరిన ఈరోజుల్లోనూ అమెరికా ఇంకా మన మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి… మన ఆర్థిక వ్యవస్థను కించపరుస్తున్నాడు కాబట్టి… నాన్ వెజ్ పాలు, జీఎం ఫుడ్స్ వంటివి వద్దన్నా డంప్ చేస్తానంటున్నాడు, లేకపోతే ట్రేడ్ డీల్ లేదుపో అంటున్నాడు కాబట్టి… ఇలాంటి చాలా చాలా కాబట్టి…
Ads
అప్పట్లో జార్జి ఫెర్నాండెజ్ ఇలాంటి కంపెనీల పనిపట్టాడు కాబట్టి… ఎవరూ తలెగరేయకుండా, స్వదేశీ కంపెనీలను తొక్కేయకుండా అవసరమైన విధానాలను తీసుకొచ్చాడు కాబట్టి… 1977 తరువాత కేంద్ర మంత్రి కాగానే… బహుళ జాతి కంపెనీల పెత్తనాల్ని, గుత్తాధిపత్య ధోరణులను కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు… పాశ్చాత్య కంపెనీలకు ముకుతాడు వేశాడు… ఐనా అప్పట్లో అమెరికా కిక్కుమనలేదు…
రూపాయికి ఎకరం చొప్పున ధారాదత్తం చేసే పాలకులు కాదు అప్పట్లో… Foreign Exchange Regulation Act (FERA) చట్టాన్ని దేశం లోకి తెచ్చి, 40 % యాజమాన్య హక్కు భారతీయులకి ఉండాలని, అలాగే ఆ కంపెనీ ఉత్పత్తుల ముఖ్య ఫార్ములా లేదా ప్రోడక్ట్ టెక్నాలజీ బహిర్గతం చేయాలని, కంపెనీ అకౌంట్స్, ఫైనాన్సియల్స్ అన్నీ భారత ప్రభుత్వానికి చూపించాలని చేసిన చట్టం…
దాని కారణంగా అనేక భారతీయ కంపెనీలు, బ్రాండ్లు నిలదొక్కుకున్నాయి… ఫార్ములా వెల్లడించడం ఇష్టం లేక కోకోకోలా ఇండియా నుంచి వెళ్లిపోయింది… అది పోయాకే మన ాగోల్డ్ స్పాట్, సిట్రూస్, క్యాంప, లెహర్ బ్రాండ్ శీతల పానీయాలు పుట్టుకొచ్చాయి.., అంటే మన స్వదేశీ కంపెనీలైన పార్లే, మరి కొన్ని మార్కెట్లోకి అడుగు పెట్టాయి..,
ఫెర్నాండెజ్ దెబ్బకి పారిపోయిన మరో కంపెనీ IBM, ఇప్పటికీ ప్రపంచంలో సిస్టమ్స్ తయారీలో అగ్రగామి.., కానీ ఒకనాడు దాని టెక్నాలజీ లోకల్ కంపెనీలకు బదిలీ చెయ్యటం ఇష్టం లేక దేశం వదిలిపెట్టి వెళ్లిపోయింది… తరువాత పీవీ- మన్మోహన్ ఆర్థిక సంస్కరణల పుణ్యమాని, వెళ్లిపోయిన చాలా కంపెనీలు మళ్ళీ మన దేశంలోకి వచ్చాయి…
1. Coca-Cola – తన పెట్టుబడుల పరిమాణాన్ని తగ్గించుకోవడం, ఫార్ములాను వెల్లడించడం ఇష్టం లేక వెళ్లిపోయింది…
2. IBM – తన వాటాల సైజు తగ్గించుకోవడం, అకౌంట్ల వివరాల్ని బహిర్గతం చేయడం ఇష్టం లేక, టెక్నాలజీ బదిలీకి అంగీకరించక వెళ్లిపోయింది…
3. Philips – ఫెరా నిబంధనలకు తలొగ్గి, ఫిలిప్స్ ఇండియా పేరిట వేరే కంపెనీ పెట్టి కొనసాగింది…
4. Nestlé – ఫెరాకు లోబడి తన ఇండియన్ ఆపరేషన్స్‌ను పునర్ వ్యవస్థీకరించుకుని కొనసాగింది…
5. Siemens – తన పెట్టుబడుల వాటా తగ్గించుకుని, ఫెరాకు జైకొట్టి ఇండియాలో కొనసాగింది…
6. Procter & Gamble (P&G) –మొదట వెళ్లిపోయింది, తరువాత ఇండియా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యాలు, సబ్సిడరీ కంపెనీలతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది…
7. Colgate-Palmolive – ఫెరా నిబంధనలకు అంగీకరించి, తన యాక్టివిటీస్ రీస్ట్రక్చర్ చేసుకుని దేశంలో కొనసాగింది…
8. Union Carbide – తన ఇన్వెస్ట్‌మెంట్లను రీస్ట్రక్చర్ చేసుకుంది, కానీ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తరువాత చాన్నాళ్లు మూతబడింది… జస్ట్, కొన్ని పెద్ద కంపెనీల ఉదాహరణలు ఇవి…
అప్పట్లో ఫెరా ఓ రకమైన బలమైన స్వదేశీ భావనతో దేశీయ కంపెనీలకు ఓ రక్షణగా నిలబడింది… విదేశీ కంపెనీల నియంత్రణను గణనీయంగా తగ్గించివేసింది… మారుతున్న కాలంలో ఫెరా వంటి చట్టాలతో విదేశీ పెట్టుబడులను, వ్యాపారాల్ని నియంత్రించలేం కానీ… పగ్గాలు మాత్రం అవసరం… ఈతరానికి జార్జి ఫెర్నాండెజ్ ఎవరో తెలియదు…
కర్నాటకలో పుట్టాడు… ముంబై కార్యస్థలి… బీహార్ నుంచి పార్లమెంటుకు వెళ్లేవాడు… బలమైన కార్మికనేత… ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్‌లో చాలా అవస్థలపాలయ్యాడు… లైఫ్ మొత్తం పోరాటమే… కేంద్రంలో చాలా పోర్ట్‌ఫోలియోలు చూశాడు… పరిశ్రమలు, రక్షణ వంటి కీలక శాఖలు కూడా… ఇలాంటి నాయకులు ఉంటేనే అమెరికా ఉడత ఊపులకు సరైన సమాధానాలు ఇస్తుంది దేశం… ( గోపు విజయకుమార్ రెడ్డి
)
Share this Article