ఆరోజు అయోధ్య కేసు విచారణ చివరిరోజు… 92 ఏళ్ల ముసలాయన రాముడి తరఫున వాదిస్తున్నాడు… నిలబడే తన వాదనలు వినిపిస్తున్నాడు… పర్లేదు, వయోరీత్యా మీరు కూర్చుని మీ వాదన చెప్పవచ్చు అని జడ్జి సూచించాడు… కానీ ఆయన వద్దన్నాడు… న్యాయవాది నిలబడే వాదించాలనే భావనతో కాదు, అది అయోధ్య రాముడి కేసు కాబట్టి, తను రాముడి తరఫు న్యాయవాది కాబట్టి… నిలబడే వాదించాడు…
రాముడికి వ్యతిరేకంగా వాదించిన ధావన్ ఎట్సెట్రా కోపంతో పలుసార్లు ఊగిపోతున్నా సరే, వాళ్ల వైపు నిర్వికారంగా చూస్తూ, కూల్‌గా వ్యవహరించాడు ఆ పెద్దాయన… వాదనలన్నీ అయ్యాక అదే ధావన్ కోసం పావుగంట వేచి ఉండి, చివరకు తనతో కరచాలనం చేసి, అంతే కూల్‌గా కోర్టు నుంచి నిష్క్రమించాడు ఆ వృద్ద న్యాయవాది… పేరు గుర్తుందా… కె.పరాశరన్… మసీదు ఎప్పుడైనా మసీదే అనే వాదనకు జవాబుగా… మీ ప్రార్థనలకు అదే అయోధ్యలో 50 దాకా మసీదులున్నాయి, కానీ హిందువులకు రాముడి పుట్టిన స్థలం ఒక్కటే కదా, గుడి కూడా ఎప్పుడైనా గుడే కదా అని వాదించాడు తను…
అయోధ్యలో ప్రాణప్రతిష్ట దగ్గర పడుతున్నకొద్దీ చాలామంది చాలా పాత సంఘటనల్ని నెమరేసుకుంటున్నారు… గుడి కూల్చి మసీదు కట్టిన బాబ్రీ దగ్గర నుంచి రామద్వేషి నెహ్రూ దాకా… ఎవరెవరేమిటో చర్చించుకుంటున్నారు… కానీ ఎందుకో ఈ పరాశరనే గుర్తొచ్చాడు… అప్పట్లో గుడి భూమిపూజను కుటుంబసభ్యులతో కలిసి టీవీలో చూస్తున్న ఫోటో గుర్తుంది… ఇప్పుడు ఏకంగా గుడే సాకారం కాబోతోంది… ఆయన ఎక్కడ..?
Ads
ఆయన వయస్సు ఇప్పుడు 97 ఏళ్లు… నటుడు కమలహాసన్ తనకు బంధువు… మొన్నామధ్య ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వార్త ఏదో చదివినట్టు గుర్తు… కొన్నాళ్లు రామజన్మభూమి క్షేత్ర ట్రస్టు బాధ్యతలు కూడా చూశాడు… అయోధ్య కేసు మాత్రమే కాదు… శబరిమల కేసు కూడా అయ్యప్పస్వామి తరఫున వాదించింది తనే… బ్రహ్మచర్యం అంటే స్త్రీద్వేషం కాదనేది తన వాదన…
పురాణాల మీద, మన లీగల్ సిస్టం మీద, రాజ్యాంగం సూచించిన హక్కుల మీద అపారమైన పట్టు తనకు… ఆయన జ్ఞానం, జ్ఞాపకశక్తి అందరినీ అచ్చెరువు పరిచేవి… ఒక న్యాయవాదిగా తను పోషించిన పాత్రలు సాధారణమేమీ కాదు… 1976లోనే తమిళనాడు అడ్వొకేట్ జనరల్ ఆయన… (అప్పుడది రాష్ట్రపతి పాలనలో ఉంది…) తరువాత ఇందిరాగాంధీ పిరియడ్‌లో సొలిసిటర్ జనరల్ ఆయన… 1983 నుంచి 1989 నడుమ ఇందిర, రాజీవ్ హయాంలో అటార్నీ జనరల్… 2011లో పద్మవిభూషణ్… తరువాత రాజ్యసభ…
సుదీర్ఘ ప్రయాణం… భారతీయ న్యాయచరిత్రలో తనకంటూ ఓ పేజీ… పరిపూర్ణ రామభక్తుడు… ఆయన తండ్రి కేశవ అయ్యంగార్, శ్రీరంగంలో ఓ అడ్వొకేట్ ఆయన… ముగ్గురు కొడుకులు కాగా, ఒక కొడుకు మోహన్ పరాశరన్ యూపీఏ-2 హయాంలో సొలిసిటర్ జనరల్‌గా చేశాడు… అయోధ్య పుస్తకం ఎవరైనా రాస్తే అందులో పరాశరన్‌కూ ఓ పేజీ దక్కుతుంది… అవును, ఖచ్చితంగా… ఒక రామభక్తుడి జన్మకు అంతకన్నా సార్థకత ఏముంది..?!
Share this Article