జల్తే హై జిస్కే లియే– మహమ్మద్ ఖదీర్‌బాబు
( నేడు తలత్ మెహమూద్ శత జయంతి)
జ్వలించే ప్రతి మనసు కోసం పాటను లేపనం చేసిన గాయకుడతడు. అస్థిమిత నిదుర రాత్రుల వేళ జ్ఞాపకాలో, ద్రోహాలో, ఆశించి భంగపడిన పరిష్వంగపు లేమో బాధిస్తున్నప్పుడు దాపున కూచుని, చేయి పట్టి, మంద్రమైన ఓదార్పును పలికిన దయార్ద్రుడతడు. మనకంటూ కొన్ని లిప్తలు గడపాలనుకున్నప్పుడు అనుమతి లేకుండా అడుగు పెట్టగల అనుపమాన సౌందర్యగళ బాంధవుడతడు. రాత్రి మదిర అతనితో చెల్లుబాటు. పగటి తేనీరు అతనితోనే గిట్టుబాటు. ధనికులకు వ్యక్తిగత మందీమార్బలం ఉంటారు. ఏం గొప్ప. మనవంటి సాదా ఇన్‌సాన్‌లకు వ్యక్తిగత గాయకునిగా వచ్చి కచ్చేరితో ఐశ్వరవంతులను చేస్తాడతడు.
తలత్. అరేబియన్ నగిషీ చెక్కిన మట్టి సురాయీ. చల్లని జలభాండం. వెచ్చని అశ్రువొడి.
మేరీ యాద్ మే తుమ్ నా ఆసూ బహానా
నా జీకో జలానా ముజే భూల్ జానా…
తలత్‌ను మరువలేం. పాటను మతంగా కలిగిన ప్రవక్త సాక్షాత్కరిస్తే మరువగలమా?
ఫిర్ వహీ షామ్ వహీ గమ్
వహీ తన్హాయీ హై
దిల్ కొ సమ్‌జానే తెరీ యాద్
చలీ ఆయీ హై…
‘అదబ్’, ‘ఆదాబ్’ తెలిసిన లక్నో నవాబ్ తలత్. దేశంలోనే తొలి ‘గజల్ నవాబ్’ అయ్యాడు. కవన కేంద్రమైన లక్నో గాలి పీల్చినవాడికి గజల్‌లో కాడ ఎక్కడో పూవు ఎక్కడో బాగా తెలిసి ఉంటుంది. సుతారంగా విసురుతాడు పరిమళాన్ని వొదులైన మునివేళ్ల గుప్పిటతో మీదకు. కొన్ని యుగాలసేపు అది నిలిచి ఉంటుంది అంతే జలతారుగా.
సినిమా పాటకు సిలబస్ సెట్ చేసిన అనిల్ బిస్వాస్ ‘ఆర్జూ’లో తలత్‌కు పాట ఇచ్చినప్పుడు వొణకని గొంతుతో పాడటం రాత్రంతా సాధన చేసి టేక్ ఇచ్చాడు. ‘ఏడ్చినట్టుంది. నీ పాటకు అందం కంపనం. వింటే శ్రోతలకు అనుకంపనం’ అన్నాడు అనిల్ బిస్వాస్. మఖ్మల్ గుడ్డకు ముడతలు పడతాయి… చెదిరిపోతాయి. చెదురుతూ ఏర్పడుతూ వుండే కంపనగానాన్ని తలత్ మరెప్పుడూ వదలుకోలేదు. అతనిది ఇండియాస్ ఫస్ట్ వెల్వటీ వాయిస్.
అయ్ దిల్ ముఝే ఐసీ జగాహ్ లేచల్
జహా కోయీ న హో…
రఫీ, ముఖేష్‌ల కంటే తలత్ సీనియర్. నౌషాద్, రఫీ, షకీల్ ఒక త్రయంగా ఏర్పడకపోయి ఉంటే– రఫీ నిరుపేద వినయం నౌషాద్ మనసును గెలవకపోయి ఉంటే– ఈ నవాబీ తలత్ మరికొన్ని ఎక్కువ పాటలే పాడి ఉండేవాడు. దిలీప్ కుమార్‌ను ట్రాజెడీ కింగ్ చేయగల తలత్… ఆ రోజుల్లో తెర మీద సెల్ఫ్‌పిటీలో కునారిల్లే ఏ హీరోకైనా మేలిమి చేయూతే. మరైతే కోమలమైన అందగాడు కావడం కూడా అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ‘దిల్–ఏ–నాదాన్’లో హీరోగా నటించి హీరోలుగా నటించే వాళ్లందరికీ ఇబ్బంది కలిగించాడు. అప్పటికి రాజ్ కపూర్ ముఖేశ్‌కు పరిమితమైతే దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్ మిగిలిన గాయకులకు దారి ఇచ్చారు. అయినా దేవ్ సాబ్… మీకు తలత్ ఏం తక్కువ చేశాడు? ఈ పాటను ఎంతో ఎక్కువేగా చేశాడు?
జాయేతో జాయే కహా … సంఝేగా కౌన్ యహా
దర్ద్ భరే దిల్ కీ జుబాన్…
రొమాంటిక్ ఇమేజ్ ఉన్నవారు ఆ టానిక్‌ను రాత్రికో మూత తాగి పడుకుని తెల్లారి పనిలో పడాలి. ‘తలత్ సాబ్’ అని పన్నీరు చల్లి మెహెఫిల్స్‌కు పిలిస్తే పరుగెత్తి పోవచ్చునా? మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి కచ్చేరీలు చేసిన తొలి ప్లేబ్యాక్ సింగర్ తలత్. అమెరికా, లండన్… పాకిస్తాన్‌లో కచ్చేరీ చేస్తే ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తే వారిలో 90 శాతం మంది ప్రేక్షకుల ముఖాలే ఎవరూ చూళ్లేదు. అన్నీ బురఖాలు, నఖాబ్‌లే. ఒక టూరు చేసొచ్చే సరికి ఇక్కడ ముఖ్యమైన పాటలు వేరెవరికో పోయి ఉండేవి. అవకాశం అడగడం, ముఠాలు కట్టడం ఈ జంటిల్మెన్‌కు రాదు. పాట ఇస్తే ప్రాణం పోయడం మాత్రమే తెలుసు.
ప్యార్ పర్ బస్‌తో నహీ హై
మేరా లేకిన్ ఫిర్‌భీ
తూ బతా దే కె తుజే ప్యార్ కరూ యా నా కరూ…
తలత్ జీవించి ఉండగానే సినీ మాయారంగపు వేదిక నుంచి మాయమై దాదాపు అజ్ఞాతంలో ఉండిపోయాడు. తన పాటలను మనకు జాగీర్లుగా రాసి ఇచ్చి 1998లో మృతి చెందాడు.
పూలకంటే నాజూకైన అతని గీతాలను భద్రంగా దాచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
దిల్‌మే రఖ్‌లేనా ఇసే హాతోంసే యే ఛూటే నా కహీ
గీత్ నాజూక్ హై మేరా సీషేసేభీ టూటే నా కహీ
గున్‌గునావూంగా యహీ.. గీత్ మే తేరే లియే
జల్తే హై జిస్కే లియే….
– ఫిబ్రవరి 23, 2024
పి.ఎస్: హైదరాబాద్ వచ్చాక నేను చూసిన తలత్ ప్రియమైన అభిమాని కె.బాలగోపాల్ గారు. ఆయన తరచూ తలత్ పాటలు మాత్రమే వినేవారు. అనంత్ తలత్ పాటలను చాలా బాగా పాడ్తాడు. ‘జల్తే హై జిస్కే లియే’.
Share this Article