Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖంగుమనే ఆ గొంతు నుంచి జాలువారిన తీయని పాటలూ ఎన్నో

August 30, 2025 by M S R

.

ఖంగుమన్న గొంతులో తీయని పాటలు ఎన్నో! – మహమ్మద్‌ ఖదీర్‌బాబు

జగ్గయ్య గారు కాంచనతో స్టెప్స్‌ వేయడం చూస్తూ ఉన్నాను.
అందాలు తొంగి చూసే హా హా హా
ఆనందం ఈల వేసే రా రా రా
సొగసు విరిసే వయసు మెరిసే
ఎగిసి పోదామా…

Ads

‘కాదలిక్క నేరమిల్లయి’ ఒరిజినల్‌ డ్యూయెట్‌నీ, ‘ప్రేమించి చూడు’లో ఈ డ్యూయెట్‌ని అప్పుడప్పుడు చూస్తుంటాను. రెండు వెర్షన్‌లలో కాంచన జింకలా కదులుతుంది. ఎల్‌.ఆర్‌.ఈశ్వరీ లాంగ్‌ హమింగ్‌కి అలా పరిగెత్తుకొచ్చి పల్లవికి క్యూ ఇవ్వడం ఇప్పటి వాళ్లు అవశ్యం చేయలేరు. తమిళంలో ఇద్దరు హీరోలూ స్టెప్స్‌ వేశారు. తెలుగులో అక్కినేనికి పెద్ద విశేషం కాదు. కాని జగ్గయ్య గారే… చాలా గ్రేస్‌గా స్టెప్స్‌ వేస్తారు.

చూస్తుంటే చిన్న చిర్నవ్వు వస్తుంటుంది. ఈ పాటలో కాకుండా ఆయన మరే పాటలోనూ స్టెప్స్‌ వేసినట్టు లేరు.
తెలుగువారి బల్‌రాజ్‌ సహానీ జగ్గయ్య గారు. తెలుగు సినిమాల్లో ‘సూట్‌’తో అత్యధిక పాత్రల్లో నటించిన ఏకైక నటుడు ఆయనే. నాకు ఊహ తెలిసే వేళకు జయప్రద తండ్రిగా ‘అడవి రాముడు’లో, శ్రీదేవి తండ్రిగా ‘వేటగాడు’లో కనిపించిన జగ్గయ్య తెలుగువారి గ్రెటెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇష్టమే గానీ హఠాత్తుగా ఆయన పాటల మీద నా దృష్టి పడింది.

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో నా మనసును చిలికేవో….
పది గజాల పెరడులో అటూ ఇటూ తిరుగాడుతూ సుశీలను అరువు తెచ్చుకుని కృష్ణకుమారి పాడుతుంటే పదే పదే వినడం ఇష్టం ఈ పాటను. రెండో చరణంలో జగ్గయ్య పి.బి.శ్రీనివాసూ వచ్చి పాటను చూసేలా చేస్తారు. మొక్కలకు పాదులు తీస్తున్న జగ్గయ్య అల్లరిగా, కొంచెం వాత్సల్యంగా చెల్లెల్ని ఆట పట్టిస్తూ పాడుతూ ఉంటే తెలియని హాయి నిండి ఉంటుంది ఇందులో.

ఈ పాటలు వింటూ ఉండగా జగ్గయ్య గారికి చాలానే మంచి పాటలు ఉన్నట్టున్నాయే అనుకున్నాను. వెతికితే ఎన్నెన్నో కనిపించాయి. వీటన్నింటినీ ఒకచోట పెట్టి ఒక్కముక్క రాసినట్టు లేరు ఎవరూ.

‘ఇదేమి లాహిరి… ఇదేమి గారడీ ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి’…
‘ఈడు జోడు’లో. చిన్నప్పటి నుంచి రేడియోలో వింటున్నా ఇది జగ్గయ్య గారిదని ఇప్పుడే తెలుసుకున్నా.
‘మధురమైన రేయిలో మరపురాని హాయిలో పండు వెన్నెలే నేడు’… –‘తోబుట్టువులు’
‘ఓ పోయే పోయే చినదానా నీ తీయని మనసు నాదేనా’ – ‘ఉయ్యాల జంపాల’
‘అప్పు చేసి పప్పు కూడు’లో జగ్గయ్య పాటలు హిట్‌. ‘మూగవైతే ఏమిలే’ అందరూ నోరు తెరిచి పాడుకున్నారు.

‘చేయి చేయి కలుప రావే హాయిహాయిగా’లో జమునతో జగ్గయ్య సరసమే కాదు అడ్డచారల చొక్కా కూడా బాగుంటుంది.
‘ఓ కౌన్‌ థీ’ని ‘ఆమె ఎవరు’గా తీశారు తెలుగులో. తెల్లచీరలో తడిసిన జయలలిత. ఎంత ఆడిందో మరి. మనకో పాట మిగిల్చి వెళ్లింది.

‘నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో’…
పి.బి.శ్రీనివాస్‌ ఎక్కువ పాడినట్టున్నారు జగ్గయ్యకు. ‘మంచి మనిషి’లో గుబురు గులాబీమాల వంటిది కదూ ఈ పాట–
ఓహో గులాబీ బాల… అందాల ప్రేమ మాల
సొగసైన కనుల దానా… సొంపైన మనసు దానా
నీ వారెవరో తెలుసుకో… తెలుసుకో…

‘మనసే మందిరం’ క్లయిమాక్స్‌లో జగ్గయ్య పాట రూపం వల్లనా, సారం వల్లనా, పి.బి.శ్రీనివాస్‌ గానం వల్లనా… నిలిచి ఉంది నేటికీ. నాటకాలు వేయించడానికి సావిత్రిని పొలాల వెంట ఎత్తుకుని నడిచేవారట జగ్గయ్య. సావిత్రి ఆయనొక్కరినే ‘బావా’ అని పిలిచేదట. ‘మనుషులు మమతలు’లో వీరిద్దరూ తాగి పాడుకునే పాట ఉంది.

‘నిన్ను చూడనీ నన్ను పాడనీ’… హీరో హీరోయిన్‌ ఇలా తాగి పాడుకోవడం ఎంత విడ్టూరం. వారు కాబట్టి ఎబ్బెట్టుగా లేకుండా రక్తి కట్టించారు. ‘మనసే మందిరం’లో మాత్రం? పాట జగ్గయ్యదే. ఎక్స్‌ప్రెషన్‌– సావిత్రిది.
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు…

జగ్గయ్య కంఠం ఒక శ్రుతి పక్వమైన ఇన్‌స్ట్రుమెంట్‌. డాక్టర్‌ చక్రవర్తిలో ‘బ్రతిమిలాడించుకోవాలా?’ అనే జగ్గయ్య గారి మాట లేకుండా ‘మనసున మనసై’ పాటను వినడం వెలితిగా ఉంటుంది. ఆయన మాట ఆ పాటకు తనదైన ఇన్‌స్ట్రుమెంట్‌ యాడ్‌ చేసింది. ‘డాన్స్‌ ఐ సే డాన్స్‌’… అని ఘంటసాలే అరిచినా జగ్గయ్యే అన్నట్టుగా అనిపించి బి.సరోజాతోపాటు మనకూ భయం వేసి ‘ఎక్కడి పోతాము చిన్నవాడా’ అంటూ గుటకలు మింగుతాము.

  • జగ్గయ్య గారు సాహిత్యకారుడని అందరికీ తెలుసు. ఆత్రేయ గారి సాహిత్యం కోసం ఆయన చేసిన కృషీ తెలిసిందే. ‘మనం అనే మాట వేరే ఏ భాషలోనూ లేదు. తెలుగుకే సొంతం. మనం అనే భావనను తెలుగువారు కాపాడుకోవాలి’ అనేవారు. ఇంగ్లిష్‌ వుయ్, హిందీ హమ్, తెలుగు మేము… ఒకటే . ‘మనం’ వేరు. జగ్గయ్య వల్ల ఒక కవిమాట కలకాలం శుభాలు పలుకుతూ ఉంది.

భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు…
అది సి.నారాయణ రెడ్డి. కాని జగ్గయ్య గారి వల్ల ఆరుద్ర తెలుగువారికి ఇచ్చి వెళ్లిన పాట ప్రాప్తమున్న తీరానికే దానిని చేర్చింది. ఆ తీరం ప్రేక్షక హృదయం.

కళాకారులు మరణించినా జీవిస్తూ ఉంటారంటే ఏంటో అనుకున్నాను. ఈ 2025 ఆగస్టు నెలలో వేళాపాళా లేకుండా నేను జగ్గయ్య గారి గురించి రాస్తున్నానంటే కళాకారులు వేళాపాళా ఎరగక మన జీవితాల్లోకి వచ్చి వెళుతుంటారని అర్థం.

మరి– ముసురు పట్టినప్పుడు వారి వల్లే కదా ‘పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడేది’…
… కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది
గోదారి వరదలాగా కోరిక చెలరేగింది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నా నడుం తాకుతావా..? నాన్సెన్స్, ఇక మీ భాషాసినిమాల్లోనే నటించను…
  • పారాసెటమాల్, ఐబుప్రొఫెన్‌లతో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్..!!
  • ఫాఫం మోడీ భాయ్… నువ్వూ కాళేశ్వరం కుట్రలో భాగస్వామివేనట..!!
  • రేవంత్‌రెడ్డి సైలెంట్ ర్యాగింగ్… కేసీయార్ క్యాంపు పరుగులు, ఆపసోపాలు…
  • సంకేతాలు అవేనా..? తదుపరి అగ్రదేశ అధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు..?
  • కురిసిన ఈ సిరివెన్నెల వెలుగుల్లో తడవని ప్రేక్షకుడు లేడు అప్పట్లో…
  • ఇల్యూమినాటి..! ప్రపంచాన్ని శాసించే ఈ గ్రూపు టార్గెట్ మోడీ..?!
  • ఖంగుమనే ఆ గొంతు నుంచి జాలువారిన తీయని పాటలూ ఎన్నో
  • ఈ సినిమా రిజల్ట్‌పై వెక్కివెక్కి ఏడ్చానని చిరంజీవే చెప్పాడు..!!
  • బిట్‌కాయిన్ కేసు..! ఇండియాలో ఓ క్రిప్టో సెన్సేషన్… శిక్షలు ఖరారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions