ఉక్రెయిన్- రష్యా యుద్ధం… కారణాలు ఏవైనా సరే, ఏదో దేశంవైపు లైన్ తీసుకోవాల్సిన అనివార్యత ఇండియాది… ఉక్రెయిన్‌కు అమెరికా, నాటోల మద్దతు… రష్యాతో మనకు అవసరాలున్నయ్, కాలపరీక్షకు నిలబడిన దోస్తీ ఉంది… కానీ ఏ సైడ్ తీసుకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం… తప్పదు…
సేమ్, పాలస్తీనా- ఇజ్రాయిల్ ఇష్యూ… రష్యాలాగే ఇజ్రాయిల్ కూడా ఇండియాకు సాయం చేసే దేశమే… కానీ అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ను కాదని పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ వచ్చాం… కారణాలు బోలెడు… ఇప్పుడు ఇజ్రాయిల్ వైపు మన మొగ్గు… హమాస్ తదితర ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయలేం, ఇజ్రాయిల్‌నూ దూరం చేసుకోలేం… ఇక్కడా బ్యాలెన్స్ చేస్తున్నాం… తప్పదు…
ఇలాంటిదే మరో సమస్య వస్తోంది… ఇది దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి… అక్కడ గయానా పేరిట ఓ దేశం, దాని పొరుగున వెనిజులా అని మరో దేశం… ఆ రెండు దేశాల నడుమ యుద్ధం ప్రారంభమయ్యే సూచనలున్నయ్… అదీ మనకు తల్నొప్పిగా మారవచ్చు… ఎలాగంటే..? గయనా జనాభే 8 లక్షలు, అందులో 3.5 లక్షల మంది భారతీయ మూలాలున్నవాళ్లే… అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూడా ఇండియన్ రూట్సే… మా పక్షాన నిలబడండి మహాప్రభో అని ఆ దేశం మనల్ని వేడుకుంటోంది… కానీ…
Ads
సదరు వెనిజులాతో కూడా మనకు ఇన్నాళ్లూ సత్సంబంధాలే ఉన్నయ్… ఐతే అసలు సమస్య ఏమిటి..? శ్రీలంకలాగే వెనిజులా కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది… అది ఆర్థికంగా బలోపేతం కావాలి… అందుకని అది గయానాలోని చమురు ధనిక ప్రాంతం ఎసెక్విబో అనే ప్రాంతంపై కన్నేసింది… వెనిజులాకు అది సరిహద్దు… దాన్ని ఆక్రమించుకుంటే ఆ చమురుతో తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని వెనిజులా ఆశ… అవసరమైతే సైనిక చర్య ద్వారా దాన్ని తమ దేశంలో కలిపేసుకోవాలని ప్రయత్నం…
ఆల్‌రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది… ఇక్కడ 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నయ్ మరి… రోజూ మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయవచ్చు… ఇంటర్నేషనల్ కోర్డ్ ఆఫ్ జస్టిస్‌లో వివాదం ఉంది… గతంలో వెనిజులాను, ఈ ఎసిక్వెబోను స్పెయిన్ పరిపాలించిందనీ, అందుకే ఇది తమ దేశంలో భాగమని వెనిజులా వాదన… నో, వందేళ్లకుపైబడి అది మా దేశంలో భాగమేనని గయానా ఆ వాదనను తిరస్కరిస్తోంది… నిజానికి ఎసిక్వెబో ప్రాంతం మొత్తం గయానాలో సగానికన్నా ఎక్కువ… అదే ఆ దేశానికి ఆదాయ కేంద్రం…
ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి వెనిజులా అధ్యక్షుడు కొన్ని నాటకాలకు తెరతీశాడు… తమ దేశంలోనే ఓ రెఫరెండమ్ జరిపాడు… ఆక్రమించుకోవాలని అనుకున్న ప్రాంతాన్ని ఓ కొత్త రాష్ట్రంగా ప్రతిపాదించాడు… అసలే ఆర్థిక సమస్యల్లో మూలుగుతున్న దేశం కదా, జనం కూడా ఆయన మాటలకే వోటేశారు… 95 శాతం మంది ‘కబ్జాకు’ అనుకూలంగా వోటేశారట… సరే, ఇండియాతో సంబంధాల విషయానికి వద్దాం… సగానికన్నా ఎక్కువ మంది ఇండియన్ రూట్స్ వాళ్లే అనే ఓ సెంటిమెంట్ అంశాన్ని కాసేపు పక్కన పెట్టినా మనకూ చమురు కావాలి… అదే సమయంలో వెనిజులాతో వైరమూ అక్కర్లేదు…
కానీ గయానా మన సాయాన్ని కోరుతోంది… యుద్ధమే వస్తే తమ పక్షాన నిలబడాలంటోంది… సమస్య పరిష్కారానికి సహాయపడాలని అభ్యర్థిస్తోంది… అమెరికా, రష్యా, చైనా తదితర అగ్ర దేశాల్లాగే ఇండియా కూడా ఇప్పుడు బలమైన దేశం… ప్రపంచ రాజకీయాల్లో మన మాటకూ విలువ ఉంది… కానీ ఈ రాబోయే యుద్ధంలో తనేం చేయగలదు..? గయానాకు సపోర్టుగా నిలబడాలనీ, మన చమురు అవసరాల కోసం ఆ దేశపు చమురు ఫీల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలని కొందరి సలహా… కానీ అంతర్జాతీయ రాజకీయాలు అంత సులభం కావు… మొత్తానికి మన విదేశాంగ మంత్రి జైశంకర్ బుర్రకు మళ్లీ పనిపడింది…!!
చైనా అండ చూసుకుని మాల్దీవులు తోకజాడిస్తోంది… అక్కడ మన సైనిక స్థావరం మన అవసరం… శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లను మచ్చిక చేసుకుని ఆల్‌రెడీ వాటిని దూరం చేస్తోంది చైనా… పాకిస్థాన్ అనే ధూర్తదేశం సరేసరి… ఈ స్థితిలో మన గోచీ సర్దుకోకుండా వేరే దేశాలకు సాయంగా వెళ్లే స్థితిలో ఉన్నామా..? ఇదీ ప్రశ్న…
Share this Article