Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

*రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!

May 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. ముళ్ళపూడి వారి రెండు జెళ్ళ సీతకు తెర రూపాన్ని ప్రసాదించారు జంధ్యాల . రమణ గారి కధ కాదు ఈ రెండు జెళ్ళ సీత . బుడుగు , రెండు జెళ్ళ సీత అనే ఈ రెండు ముక్కలు తెలుగు హాస్య రచనా ప్రపంచానికి ముళ్ళపూడి వారు అందించిన ఆణిముత్యాలు . ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల …

జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో !  ఈ సినిమా దగ్గర నుంచే జంధ్యాల దర్శకత్వంలో పూర్తి హాస్య చిత్రాలు చాలా వచ్చాయి . ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసిన ఇ వి వి కూడా తర్వాత కాలంలో పలు హాస్య చిత్రాలను అందించారు .

Ads

జంధ్యాల గారికి విశాఖపట్టణం కలిసొచ్చింది . ఈ సినిమా అంతా విశాఖపట్టణం , అరకు , విజయనగరాల ప్రకృతి అందాలలలోనే తీసారు . ఈ సినిమాకు మరో రెండు విశేషాలు కూడా ఉన్నాయి . ఈ సినిమాకు హీరోయిన్ మహాలక్ష్మి . ఇదే ఆమెకు మొదటి తెలుగు సినిమా . ఈమె సీనియర్ నటి పుష్పలత కుమార్తె . ఈ సినిమాలో ఇద్దరూ తల్లీకూతుళ్ళుగానే నటించారు .

శ్రీలక్ష్మి , రాజేష్ అక్కాతమ్ముళ్ళు . ఈ ఇద్దరూ ఈ సినిమాలో నటించారు .

నలుగురు కాలేజి కుర్రోళ్ళు ప్రాణానికి ప్రాణంగా ఉండే రూంమేట్లు . ఎలాగోలా ఓ అమ్మాయిని ప్రేమించాలని తమ బిల్డింగులో ఉన్న ఓ జంటను ఖాళీ చేయించి , ఆ పోర్షన్లోకి ఓ రెండు జెళ్ళ సీత కుటుంబం అద్దెకు వచ్చేలా స్కెచ్ చేస్తారు . నలుగురూ ఆ అమ్మాయి ప్రేమ కొరకు చివరకు తన్నుకుంటారు .

డస్సిపోయిన మిత్రులు ఆ అమ్మాయి దగ్గరకే వెళ్లి తమ కష్టాన్ని చెప్పుకుంటారు . తనకు ముందే పెళ్లి అయిందని , తనను కాబోయే మామ ఎలా బద్నాం చేసి పెళ్ళిని ఆపాడో చెపుతుంది . ప్రేమికులు అన్నలు అయిపోయి విజయనగరం చేరుకుని ఆ మామ దుర్మార్గుడికి బుధ్ధి చెప్పి సీతకు పెళ్లి జరిపిస్తారు . పెళ్ళిలో పెళ్లి, మరో జంటకు కూడా పెళ్లి జరిపిస్తారు . టూకీగా ఇదీ కధ …

(ప్రేమించిన పిల్ల దక్కకపోతే యాసిడ్ సీసాతో, కత్తితో చెలరేగడం కాదు, నిజంగా, నిజాయితీగా ప్రేమించడం ఏమిటో చెబుతుంది సినిమా…)

నలుగురు కుర్రాళ్ళుగా నరేష్ , ప్రదీప్ , రాజేష్ , శుభాకర్ చాలా బాగా నటించారు . జంధ్యాల నటింపచేసారు . ముఖ్యంగా క్లైమాక్సులో చాలా గొప్పగా నటిస్తారు . వీళ్ళ బిల్డింగులో ఉంటూ వీళ్ళకు బకరాలు అయిన జంటగా సుత్తి వేలు , శ్రీలక్ష్మి అదరగొట్టేసారు . అనుమానపు మొగుడుగా వేలు , అమాయక పెళ్ళాంగా శ్రీలక్ష్మి ఇరగతీసారు . సినిమాలోని హాస్యంలో సగ భాగం పైన వీరిద్దరిదే .

ఆ తర్వాత చెప్పుకోవలసింది అల్లు రామలింగయ్య గురించే . ఈ సినిమాలో జిస్ దేశ్ మే గంగా బహతీ హై హిందీని కలగాపులగం చేసి మాట్లాడుతూ కామిక్ విలనీని గొప్పగా పోషించారు . మరో చెప్పదగిన పాత్ర సాక్షి రంగారావుది . రంగస్థలం నుండి వచ్చిన నటుడు కదా ! విషాద , భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు .

మహాలక్ష్మి
ఇతర ప్రధాన పాత్రల్లో శుభలేఖ సుధాకర్ , కమలాకర్ , కిరణ్ , రాళ్ళపల్లి , పొట్టి ప్రసాద్ , సుత్తి వీరభద్రరావు , పుష్పలత , దేవి , ప్రభృతులు నటించారు . కధ , స్క్రీన్ ప్లే , సంభాషణలు , దర్శకత్వం జంధ్యాల వారివే . కేవలం 14 లక్షల రూపాయల బడ్జెటుతో తీసిన ఈ సినిమాకు డబ్బులు , ప్రశంసలు వర్షించాయి . వంద రోజులు ఆడిన ఈ సినిమా తమిళంలోకి కూడా డబ్ చేయబడింది .

రమేష్ నాయుడు సంగీతం ఈ సినిమా విజయానికి బాగా దోహదపడింది . ఏ సినిమాకు అయినా సంగీత దర్శకుడు రెండు రకాల సంగీతాన్ని అందిస్తాడు . ఒకటి BGM , రెండవది పాటలకు . ఈ రెండింటికీ గొప్ప న్యాయం చేసారు రమేష్ నాయుడు … ఢమఢమ డబ్బాలో కంకరరాళ్ల మోతల నుంచి తెలుగు సినిమా పాటను మెలొడీ వైపు, ట్యూన్ వైవిధ్యం వైపు మళ్లించాడు రమేష్ నాయుడు…

సినిమాలోని ఆరు పాటల్లో అయిదు వేటూరి వారే వ్రాసారు . ఒక్క క్లైమాక్స్ పాట అయిన పురుషులలో పుణ్యపురుషులు వేరు అంటూ సాగే టీజింగ్ పాటను ఇంద్రగంటి వారు వ్రాసారు .క్లైమాక్సును బాగా పండించింది ఈ పాట . వరకట్న మహమ్మారిని ఎండగట్టుతూ ముగించే ఈ సినిమాకు ఈ పాట లైఫ్ అని చెప్పొచ్చు .

మహాలక్ష్మి
వేట వేట వేట అంటూ అమ్మాయిలకు సైట్ కొడుతూ సాగే పాట భీమిలి రోడ్లో బాగా తీసారు జంధ్యాల . సరిసరి పదపదని అంటూ సాగే పాటలో నలుగురు మిత్రులు ఎవరికి వారే రెండు జెళ్ళ సీతతో ఊహాలోకంలో డాన్సించే పాటను జంధ్యాల చాలా అందంగా చిత్రీకరించారు .

మందారంలో ఘుమఘులై డ్యూయెట్ మహాలక్ష్మి , కమలాకర్ల మీద , కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ కోక కట్టి డ్యూయెట్ శుభలేఖ సుధాకర్ , దేవిల మీద చాలా చక్కగా చిత్రీకరించబడ్డాయి . రెండు జెళ్ళ సీత తీపి గుండెకోత పాట ఈ సినిమాకు ఐకానిక్ . ఆరు పాటలూ బాగుంటాయి . పాటల్ని బాలసుబ్రమణ్యం , యస్ జానకి శ్రావ్యంగా పాడారు .

మహాలక్ష్మి
ఆరుగురు కుర్రాళ్ళు , మెయిన్ హీరోయిన్ , తోడు హీరోయిన్ అందరూ ముడతలు, ముదురు మొహాలు లేకుండా లేత లేతగా బాగుంటారు . సహజంగానే కాలేజి పిల్లలు అందరూ ఐడెంటిఫై అయిపోయి సినిమాను బాగా ఆడించారు .

కంబైన్డ్ స్టడీలు , కంబైన్ఢ్ సైట్ కొట్టటాలు , ఆ అమ్మాయి కోసం తమలోతామే కొట్టుకోటాలు, తన్నుకోవటాలు కాలేజి రోజుల్లో కామనే కదా ! అవన్నీ పుష్కలంగా ఉన్న ఈ సినిమా చక్కని సంసారపక్ష , వినోదభరిత , సందేశాత్మక సినిమా .

ఇక్కడ మహాలక్ష్మి గురించీ చెప్పాలి… ఈ సినిమాతో ఆమె అర్జెంటుగా తెలుగు కుర్రాళ్ల మనస్సులోకి దూరిపోయింది… ప్రత్యేకించి ఆ నవ్వు… తెలుగుతనం కనిపించే ముగ్ద మొహం… కన్నడ నటీనటులైన పుష్పలత, ఏవీఎం రాజన్ బిడ్డ… దీంతో తెలుగులో బాగా పాపులర్ అయిపోతుందని అనుకున్నారు, జంధ్యాలే తరువాత ఆనంద భైరవిలోనూ చాన్స్ ఇచ్చాడు… 

కానీ ఆమెకు కలిసిరాలేదు… సరైన ప్లానింగు గనుక చేసుకుని ఉంటే టాప్ హీరోయిన్ అయ్యేదేమో… ప్రస్తుతం ఏదో కన్నడ సీరియల్‌లో నటిస్తోంది… 

1983 మార్చిలో విడుదలయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే అర్జెంటుగా చూసేయండి . ఎప్పుడయినా బుర్ర ఖరాబుగా ఉంటే చూడతగ్గ వినోదాత్మక సినిమాలలో ఒకటి ఈ రెండు జెళ్ళ సీత . A watchable , neat , hilarious , entertaining , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఊపిరి పీల్చుకోవడానికి మరో విజ్ఞప్తి… ముగ్గురు సీఎంలకు మరో అభ్యర్థన…
  • ‘పవర్’… ఎప్పుడు వాడాలో తెలియాలి… వదిలేయడమూ తెలియాలి…
  • పోటీ… పోటీ…! ఫుడ్, రవాణా, కిరాణం, ఇతర డెలివరీల్లో పోటాపోటీ..!!
  • బీఫ్..! ఇండియా నుంచి ఎగుమతులు – రాజకీయాలు – నిజాలు..!!
  • పేలిపోయిన తేజస్..! ఎవరు బాధ్యులు..? ఏం చేయాలి మనం..? (పార్ట్-3)
  • ఫైనల్ సెల్యూట్…! మనసుల్ని ద్రవింపజేసే ఓ విషాద దృశ్యం..!!
  • తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2
  • తేజస్ కుప్పకూలి, పేలిపోవడం వెనుక పైలట్ తప్పుందా..? పార్ట్-1
  • అటు అమలాపురం… ఇటు పెద్దాపురం… మధ్య గోదావరి…
  • వాట్సప్ గ్రూపుల్లో వచ్చే ఎస్‌బీఐ APK టచ్ చేశారో… బ్యాంకు ఖాతా ఖల్లాస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions