( పురాణ ప్రసిద్ధురాలైన రేణుక జమదగ్ని మహర్షి భార్య. ఆమె తన పాతివ్రత్య ప్రభావంతో ,నది నుండి ప్రతిరోజూ నీటినే కుండ ఆకారంలోకి మార్చి ఆశ్రమానికి తీసుకొచ్చేది . ఒక రోజు నది వద్ద అత్యంత సుందరుడైన కార్తవీర్యార్జున మహారాజును చూసి ఒక క్షణం … ఒకే ఒక క్షణం రేణుక మనస్సు మోహావేశంతో చెదిరింది. ఆరోజు నీరు కుండ ఆకారంలోకి గట్టిపడలేదు. రేణుక మామూలు మట్టికుండలో నీళ్లు పట్టుకుపోవడంతో జమదగ్ని తన దివ్యదృష్టితో జరిగిన సంగతిని గ్రహించాడు. తల్లిని చంపమని ఏడుగురు కొడుకులను కోరగా ,చివరివాడైన పరుశురాముడు మాత్రమే ముందుకు వచ్చి గొడ్డలితో తన తల్లి రేణుక తల నరికాడు. కొడుకు విధేయతకు సంతసించి జమదగ్ని పరుశరాముని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. పరుశరాముడు తన తల్లిని బ్రతికించమని అడగగా జమదగ్ని రేణుకకు తిరిగి ప్రాణం పోసాడు.
సైన్సు ,టెక్నాలజీ మీద మోహంతో అధమ విలువలకు తలవొంచిన మానవ జాతి వినాశనాన్ని ,ధరిత్రీ విలాపాన్ని రేణుక పరంగా చెప్తున్నాడీ అద్భుత మలయాళ రచయిత ఓ .వి.విజయన్ .1995 లో నేను అనువదించిన ఈ కథ ఆంధ్ర ప్రభ వార పత్రికలో ప్రచురింపబడింది .కరోనా నేపథ్యంలో ఇది గుర్తుకు వచ్చింది.)
*** ***
Ads
“వస్తోంది …. గాలి వస్తోంది.”
చెట్ల బెరడుతో వంటిని కప్పుకున్న ఓ పదహారేళ్ళ యువతి గుహలోకి చూస్తూ అరిచింది. గుహ లోపల ఆమె తండ్రి పురందరునికి ధ్యానభంగమైంది. అతను నెమ్మదిగా కళ్ళు విప్పి గుహ ముఖద్వారం వంక చూస్తూ “లోపలి రామ్మా ! సురభీ !” అని పిలిచాడు.
గాలి ఇంకా చాలా దూరంలో ఉంది. దాని పసుపు వర్ణంపై సంధ్యాకిరణాలు పరావర్తనం చెందటంతో ఆకాశం బంగారు జలతారులా మెరిసిపోతోంది. గుహ ద్వారం వద్ద ఉన్న ఎత్తైన రాతి మీద నిలబడి సురభి సమీపిస్తున్న రంగుల అలలను తన్మయత్వయంతో పరికిస్తోంది. ఆమె అనాచ్చాదిత ఉరోజాల గంధవర్ణం కన్నా సురభి కా క్షణంలో తన వైపు దూసుకొస్తోన్న గాలి మరింత అందంగా కనిపించింది. గుహ లోపలి నుండి పురంధరుడు మళ్ళీ పిలిచాడు “రా తల్లీ లోపలికి !”
” వస్తున్నా నాన్నా !”
పురందరుడు కూతురు కోసం చూస్తున్నాడు . సురభి ఇంకా రాయి దిగలేదు .
అతను మరోసారి చెప్పాడు “సురభీ! ఆ గాలి చూడొద్దు . నీ మనసు నీ ఆధీనంలో ఉండదు .”
“అలా జరగదు ,నాన్నా !”
ఆమె ఇంకా రాతి మీద అలాగే నిలబడి ఉంది . ఉవ్వెత్తున లేస్తూ ,తిరుగుతూ గాలి అలలు అలలుగా ముందుకు ప్రయాణిస్తున్నది. దూరంనుండే దాని మోహపు రేణువులు సురభి నిలబడి ఉన్న బండను ప్రదీప్తం చేస్తున్నాయి .
ఆమె జనకుని గొంతులో హెచ్చరిక మృదువుగా ధ్వనించింది ” తల్లీ ! జాగ్రత్త ! ఆ గాలి… అదొక శలభాలను ఆకర్షించే అగ్ని !”
గాలి తన అనంత రసాయనాల సమ్మేళనాల స్పటిక విస్ఫోటనం ద్వారా వజ్రాలను ఆకాశంలోకి వెదజల్లింది . ఆ వజ్రాలు సూర్యాస్తమయ నేపథ్యంలో తళుకులీనుతూ ఆమెను మరింతగా తమ ఆకర్షణలో బంధించాయి .
“మల్లె చెట్టుకు పాదు చేస్తున్నాను!” సురభి అబద్ధమాడింది .
ఆమెలో అబద్ధం వ్యభిచరిస్తే కలిగే పిండం లాగా పెరిగిపోయింది. ఆమె ఆ రహస్యంలోని ఆకర్షణను ఎంతగా ఆరాధించిందో ,తన అవిధేయతకు అంతగా విచారించింది .
*** *** ***
గుహ లోపల పురందురుని కళ్లముందు పదహారు సంవత్సరాల కిందటి సంఘటన ఇబ్బందిగా కదలాడింది . గుహ లోపల మెత్తటి గుడ్డపై మూడు నెలల పసిపాప సురభిని పరుండపెట్టి , అతని భార్య శర్మిష్ఠ గాలిని చూడటానికి గుహ బయట ఉన్న రాతిపై కెక్కింది. ధ్యానం చేసుకుంటున్న పురందరుడు మెళకువలోకొచ్చి ఆమెను అడిగాడు “శర్మిస్టా! ఏమి చేస్తున్నావు ?”
“గాలి వస్తోంది “
“రానీ !”
“కొద్దిసేపు బయటే ఉండి గాలిని చూస్తాను “
పురందరుడు కొంతసేపు నిశ్శబ్దం వహించి ,మళ్ళీ అడిగాడు “నీ మనస్సు స్వాధీనం తప్పుతున్నదా ?”
వారిద్దరి మధ్యా ప్రతిధ్వనించిన నిశ్శబ్దంలో ఆమె భయాన్ని మోహాన్ని పురందరుడు గ్రహించాడు .
శర్మిష్ఠ జవాబిచ్చింది “లేదు .ఊరికే దాని అద్భుతమైన వర్ణాలను చూస్తున్నాను . అయినా అదింకా చాలా దూరంలో ఉంది . మనలను సమీపించేలోగా నేను గుహ లోపలి తిరిగొస్తాను !”
“నీ కిష్టమైతే చూడు . కాని ఆ గాలి వికృతాకారుల నగరం మన గుహలలోని ప్రశాంతిని భగ్నం చేయడానికి విరజిమ్మే రసాయనిక ధూళి మాత్రమేనని గుర్తుంచుకుంటే చాలు “
“పసుపు పచ్చని గాలి ప్రదీప్తాగ్నిలో బంగారంలా మెరుస్తోంది. దాని పైపొర మీద రసాయనాలు వజ్రాల్లా పరిభ్రమిస్తున్నాయి “
“షర్మిష్టా ! నీవు బలహీనతకు లోనై మాట్లాడుతున్నావు. ఆ పసుపు గాలిలో అంత ఆకర్షణ ఏముంది ?దాని కంటే గొప్పవైన మన శరీరాల గంధం వర్ణాల గురించి ,మన కోర్కెల ఫలితమైన బిడ్డ గురించి ఆలోచించు “
గుహ బయట నుండి ఏ సమాధానమూ రాకపోయేసరికి పురందరుడు కొద్దిసేపు ఆగి ప్రశ్నించాడు “నీవింకా ఏమేమి చూస్తున్నావు ?”
శర్మిష్ఠ సందేహపడుతూ జవాబిచ్చింది “గాలి సమీపిస్తున్నది. దాని పసుపు వర్ణంలో ——చూస్తున్నా !”.మళ్ళీ నిశ్శబ్దం .
పురందరుడు తన దివ్యదృష్టితో అంతా చూసాడు. అయినా అతను “నీకేమి భయం లేదు .ఉన్నదున్నట్లుగా నాకు వర్ణించి చెప్పు !” ప్రోత్సహించాడు .
“నేను ఒక ఆడ ,ఇద్దరు మగ వికృతాకారులను చూస్తున్నాను “
పురందరుని మొహాన విచార రేఖలు అలుముకున్నాయి .’ రేణుక పాపం నా భార్యను కబళించింది ‘ తనలో తాను గొణుక్కున్నాడు .
“షర్మిష్టా ! ఇంకా ఏమి చూస్తున్నావు ?”
“భయంకరమైన రతికేళి ,మగ వికృతాకారులు స్త్రీని తమ అంగాలతో చుట్టివేస్తున్నారు . ఆమె సంతోషంతో కేరింతలు కొడుతోంది .”
“లోపలి వచ్చి ,గుహ ముఖద్వారాన్ని మూసివేయి !”
ఆమె రాలేదు..గుహ లోపల పసిపాప సురభి ఏడుస్తోంది . పురందరుడు ఆమెను మృదువుగా తట్టి ఏడుపు మానిపించాడు.
“షర్మిష్టా! ఏమి చేస్తున్నావు ?”
“ఇదిగో , వచ్చేస్తున్నా “
ఆమె ఇంకా రాతి మీదే నిల్చుని ఉంది . సమీపిస్తున్న గాలి రొదతో గుహంతా నిండిపోయింది .
“షర్మిష్టా ! తొందరగా !”
ఆమె బదులివ్వలేదు . అంతకంతకూ పెరుగుతున్న రొదలో కూడా పురందరునికి బయటి శబ్దాలు వినపడుతున్నాయి .వికృతాకారుల నవ్వు ! వారి రతికేళి చూస్తున్న ముని భార్య నవ్వు ! గాలి ఒక్కసారిగా పెట్రేగిపోవడంతో గుహ పక్కనే ఉన్న రాయి గుహ ద్వారాన్ని మూసివేసింది.
” అయ్యో ! షర్మిష్టా !”
మూసుకుపోయిన గుహద్వారం మీదుగా ,మైదానాల మీదుగా గాలి సుడిగుండంలా తిరుగుతోంది . పురందరునికి ఇంకా శర్మిష్ఠ నవ్వు ” నే నింక ఎంతమాత్రం తట్టుకోలే ” ననే వణుకుతున్న కంఠంతో ఆమె ఏడుపు వినిపిస్తూనే ఉన్నాయి .
రసాయనాలు గడ్డి మైదానాలమీద చిక్కటి మేఘాల్లా ఆవరించుకుని ,ఆకాశాన్ని దృష్టిపథంలో నుంచి మాయం చేశాయి. ఊపిరి తీసుకోడానికి అవస్థ పడుతున్న శర్మిష్ఠను మగ వికృతాకారులు చుట్టేశారు .వారి దగ్గరినుండి వచ్చే దుర్గంధం భరించలేక ఆమె బాధతో మెలికలు తిరిగిపోతోంది.
“ఆక్సీజన్ ను పీల్చే ఆటవిక జాతి మనిషీ !”
ఒక మగ వికృతాకారుడు ఆమెను సంబోధించాడు -“బ్రహ్మానందం కలిగించే రసాయన ఆవిరులను ఎలా పీల్చాలో నీకు నేర్పిస్తాము .మా అందమైన దంతాలను చూడు . మీలాగా అవి మా నోట్లో ఉండవు . ముత్యాల దండలవలె మా ముఖం చుట్టూ ఉంటాయి .”
” భగవంతుడా !”
” చూడు ,ఆటవిక స్త్రీ ! మా శరీరంలో మూడవ భాగం యంత్రం ,మరో మూడవ భాగం రసాయనికం కాగా ,మిగిలిన భాగం మాత్రమే కండరాలతో కూడిన శరీరం .మేము కూడా ఒకప్పుడు మీలాగా ఆక్సిజన్ ను పీల్చినవాళ్ళమే. చిన్న చిన్న మర్మావయవాలతో ముష్టి మూడు నిమిషాల రతికేళితో సంతృప్తిపడిన వాళ్ళమే . మా బిడ్డలను స్ఫటిక గోళాలలో కాకుండా ,మీలాగా గర్భాశయాలలో పెంచిన వాళ్ళమే . కానీ సైన్స్ మమ్మల్ని ప్రకృతి బంధనాలనుండి విముక్తి చేసింది. గుహలలో నివసించే అనాగరికురాలా ! నీవెందుకు ప్రగతిని నిరసిస్తున్నావు ? మా లోహ అంగాలవైపు చూడొకసారి —“
” భగవంతుడా ! రక్షించు !”
” ఈ మాత్ర మింగావంటే ఒకే ఒక క్షణంలో నీవు మాలాగా మారిపోతావు. శతాబ్దాల విజ్ఞానం , మార్చే మహిమ ,మానవ చరిత్ర లోనే మహా విప్లవం – . అన్నీ రంగరించి ఈ మాత్రలో పొందుపరిచారు !”
రేణుక పాతివ్రత్యం శర్మిష్ఠను హెచ్చరించింది . ” నా ఈ శరీరంతో ,నా భర్త పిల్లలతో సంతృప్తిగానే ఉన్నాను .”
“నీవు సైన్స్ పరువు తీస్తున్నావు “
” దయచేసి నన్నొదిలిపెట్టండి “
” నీవు రసాయనాలను అవమానపరిచినందుకు మానవ ప్రగతి పేరు మీదుగా నిన్ను శిక్షిస్తున్నాము “
వికృతాకారుడు పైనున్న మేఘాలను పగ తీర్చుకోమని ఆదేశించాడు . ఆకాశం నుండి ఒక పిడుగు నెమ్మదిగా శర్మిష్ఠ నెత్తి మీదకు దిగింది .
గుహలో ఉన్న పురందరుడు పిడుగు చప్పుడు ,వికృతాకారులు విపరీతమైన గోలతో వెళ్లిపోవడం అన్నీ వింటూనే ఉన్నాడు. గుహ ద్వారం బయట శర్మిష్ఠ శరీరం ధూళిగా మారి గాలిలో కలిసిపోయింది.
*** *** ***
గత స్మృతులన్నీ పురందరుడిని భయపెడుతున్నాయి .మళ్ళీ కూతురిని పిలిచాడు .
” సురభీ ! లోపలి రా !”
“నాన్నా !” ఆమె అరిచింది .” మల్లెచెట్టు గాలికి కొట్టుకుంటోంది “
“మళ్ళీ పాతుకుంటుంది లేమ్మా ! మనకంటే మొక్కల కే బాగా తెలుసు -యంత్రాలనుండీ, రసాయనాల నుండీ ఎలా కాపాడుకోవాలో ! నీవు లోపలి రా సురభీ !”
మళ్ళీ బలహీనత ఆమెను ఆక్రమించుకుంటోంది .మిరుమిట్లు కొలిపే రసాయనాల రంగులతో సువాసనలు వెదజల్లే తన గంధవర్ణపు చర్మాన్ని పోల్చుకుని న్యూనతా భావంతో బాధపడుతోంది .
కిందటి పౌర్ణమి రోజున కృష్ణ ,తను కలిసి గడ్డి మీద నడుస్తున్నారు .చంద్రుడు పై నుండి అమృతధారల్ని వర్షిస్తున్నాడు . గడ్డిలో కీటకాలు మృదువుగా చప్పుడు చేస్తున్నాయి.
సురభి తన ప్రియుని చేయందుకున్నది -” నా యౌవనానికి కూడా పౌర్ణమి వచ్చింది “
వాళ్లు చేతులను పెనవేసుకుని నడుస్తున్నారు.
కృష్ణ ఆమె స్పర్శలోని ఉద్రేకాన్ని గ్రహించాడు .
“కృష్ణా ! నా ఉడుపులను జారవిడువఁనియ్యి !”
” ఓపిక పట్టు ,ప్రియతమా “
” నీకు నా శరీరాన్ని వెన్నెల వెలుగులో చూడాలని లేదా ?”
కృష్ణ ఆమె నడుము చుట్టూ మృదువుగా చేయి వేసాడు . ” ఈ శరీరం నాది. మలినం కాకుండా చూసుకో ! నీ కొరకు నా శరీరాన్ని కూడా అట్లాగే ఉంచుతాను”
సురభి పెదవులు కోరికతో తడిగా విచ్చుకున్నాయి .
” ఆగు !” కృష్ణ వారించాడు . “పవిత్రాగ్ని సాక్షిగా మనం ఏక శరీరమయ్యే క్షణం కొరకు! “
సురభి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ,వారిస్తున్నా వినకుండా కృష్ణ పెదవుల మీద ముద్దుల వర్షం కురిపించసాగింది .” కృష్ణా ! నా పెదవులు తియ్యగా లేవా ?”
ఆమె తన సిగముడి విప్పడంతో జలపాతంలా దుమికే నీలవేణిలా ఆమె కురులు అతనిని కప్పివేశాయి . తన బెరడు వస్త్రాన్ని కూడా జారవిడిచి వెన్నెల కాంతిలో నగ్నంగా నిలుచుంది . అసలే రసికుడైన చంద్రుడు రెట్టించిన ఉత్సాహంతో తన చంద్ర కిరణాలతో ఆమె అణువణువూ శోధిస్తున్నాడు.
“కృష్ణా ! నన్ను ముట్టుకో !”
“నీ స్పర్శ కొరకు ప్రార్థిస్తూ వేచి ఉంటాను . మీ నాన్న ,నా గురువు పవిత్రాగ్నిని వెలిగించేదాకా వేచి ఉంటాను.”
“నేను నీకు నచ్చలేదా కృష్ణా ! నా చర్మంగంధం రంగు కంటే ఆ రసాయనాల బంగారు వర్ణమే నీకు నచ్చిందా ?”
” దేవుని సాక్షిగా —-“
ఆమె నిరుత్సాహంగా బెరడు వస్త్రాన్ని అందుకుంది . దూరాన దిగంతాల ఆవల వికృతాకారుల నగరం ,సైన్సుకు పట్టుకొమ్మ జ్వాల లేకుండానే మండుతూంది . దాని దీపాల వరుస చీకటి రాక్షసుడి మెడ చుట్టూ ఆభరణంలా భాసిస్తోంది .
“కృష్ణా ! నీకో రహస్యం చెప్పనా ? రసాయనాలు నా మనశ్శాంతిని భగ్నం చేస్తున్నాయి “
కృష్ణ ఒక్కసారిగా వణికిపోయాడు .
సురభి అదుపు తప్పిన దుఃఖంతో కూలబడి ఏడవసాగింది . ” నన్ను రక్షించు కృష్ణా ! పాపపు ఆలోచనలు నన్ను లోబరుచుకుంటున్నాయి . నా ఈ మానవ శరీరం నీకు తృప్తి నిస్తున్నదా ? నాకు ఇవ్వడం లేదు “
*** *** *** ***
గుహ ముఖద్వారం వద్ద నిలబడి సురభి నిషేధించిన పండును అందుకోవడంలో గల ఆనందాన్ని అనుభవిస్తోంది .
పురందరుడు విచారంగా ధ్యానం చేసుకోసాగాడు . “భగవంతుడా ! రేణుక శాపం పునరావృతం అవుతున్నది “.
వస్తూన్న గాలి రసాయనాల వేడికి మల్లెచెట్టు వాడిపోయింది . ఒక్క క్షణం మల్లె చెట్టు గురించి బాధపడినా రసాయన మేఘాలు సమీపించాయన్న ఆనందంలో ఆ బాధను మర్చిపోయింది. మేఘాలపై వజ్రాల గొడుగు కింద ఆమెకు క్రీడిస్తూ వస్తున్న ఇద్దరు మగ , ఒక ఆడ వికృతాకారులు కనిపించారు.
గుహలో దివ్య దృష్టితో చూస్తున్న పురందరుడు బిగుసుకుపోయాడు . మేఘాలు పెద్ద రొదతో సురభిని ఆక్రమించుకున్నాయి. మగ వికృతాకారుని మోహం స్త్రీపై చిందింది . వారి మొహాల చుట్టూ ఉన్న దంతాల నుండి రతికేళిని ప్రోత్సహించే మాటలు స్రవిస్తున్నాయి . ఆ ప్రదేశమంతా కామ మధూళికా రేణువులతో నిండిపోయింది.
” ఓ ఆటవిక స్త్రీ ! ” మగ వికృతారుడు సురభితో అంటున్నాడు -” ఆక్సిజన్ ను పీల్చి పీల్చి నీకు విసుగు పుట్టడం లేదా ?”
“నేను విసిగి పోయాను “
“నీకు యంత్ర రతి కావాలనిపించడం లేదా ?”
పాపపు ద్రవాలతో సురభి శరీరం తడిసింది .ఆమె సమాధానమిచ్చింది .” నాకు కావాలి ,నాకు కావాలి “
“నీకు రసాయనాలంటే ఇష్టం .విముక్తి అంటే ఏమిటో నీకు అర్ధమైంది కదూ !”
“అవును ,నాకు బాగా అర్ధం అయింది “
ధ్యానములో ఉన్న ఆమె తండ్రి , నిష్ఠాగరిష్ఠుడైన ప్రియుడు సురభికి గుర్తుకొస్తున్నారు .
వికృతాకారుడు ఆమె పెదవులను బలవంతంగా తెరచి మాత్రను నోట్లో వేశాడు .
‘విముక్తి ‘ ఆమె నాలుక మీద కరిగి రక్తనాళాల్లోకి ప్రవహించింది . సురభి పిచ్చిపట్టినట్లుగా నవ్వుతోంది. చూస్తూండగానే ఆమె దంతాలు బయటకు వచ్చి ,మొహం చుట్టూ ముత్యాల దండలా అమిరాయి . ఆమె ఫాల భాగంపై మూడు నేత్రాలు రెక్కలు విప్పాయి. ఎద మీద నాలుగు పెద్ద రొమ్ములు మొలిచాయి . చర్మం గంధం రంగు నుండి జ్వలించే బంగారు వర్ణంలోకి మారింది. ఆమె మెదడు రసాయనిక మిశ్రమంగా మారగా, ఎముకలు లోహాలుగా పరివర్తనం చెందాయి.
సురభి మత్తులోనుండి బయటపడి ,తన కళ్ళను ,రొమ్ములను ,శరీరాన్ని చూసుకుంది .”నేనెవరిని ?” ఆమె ప్రశ్నించింది .
మగ వికృతాకారుడు జవాబిచ్చాడు ” ఇంతకుముందు నీవొక అనాగరికురాలివి . సైన్స్ నిన్ను విముక్తి చేసి ,మానవిగా మార్చింది “
పైన ఆకాశంలో సంధ్యాకిరణాలు వికృతంగా మెరుస్తున్నాయి . రసాయనిక ఆవిర్లు ఆమె ఊపిరితిత్తులని నింపాయి.
గుహ లోపల పురందరుని ధ్యానం అగ్నిలా మారి సురభిని కాల్చింది .
“రక్షించండి !” సురభి ఆక్రోశిస్తుంది . “నన్ను తిరిగి మనిషిగా మార్చండి “
“ఇప్పుడే నీవు మనిషిగా మారావు . అంతకు ముందు నీ ఒక జంతువువు “
సురభి పశ్చాత్తాపం ఆమెను దహించి వేస్తూండగా ,ఉపశమనం గురించి ఆక్రోశిస్తుంది . “నన్ను తిరిగి జంతువుగా మార్చండి .నా గంధం రంగును ,నా రెండు రొమ్ములను తిరిగి ఇవ్వండి. నన్ను కృష్ణ వద్దకు చేర్చండి “
ఆమెను బంధించిన వికృతాకారులు వికటాట్టహాసం చేశారు . ఆమె శరీరంలో ఉన్న మాత్ర చివరి వ్యతిరేకతను కూడా అణచివేసింది.
సురభి వికృతాకారుల నుండి విడిపించుకుని ,పోగొట్టుకున్న తన జంతు స్థితిని కొరకు తన చుట్టూ ఆవరించుకున్న పసుపు గాలిలో అన్వేషించసాగింది.
*** *** **** ***
పురందరుడు ,కృష్ణ జరిగిన ఘోరాన్ని చూసేందుకు గుహ బయటికి వచ్చారు . రసాయన మేఘాలు గడ్డి మైదానాలను తన విషవాయువులతో దహించి వేస్తున్నాయి .
పురందరునిలో తరతరాల తపశ్శక్తి బుసలు కొడుతూ లేచింది .
కృష్ణ ఆ మృత సంజీవిని ప్రార్థించాడు . సంతోషించిన పురందరుడు జమదగ్నిలాగా కృష్ణ వైపు తిరిగాడు.
” నాయనా ! నీకేమి వరం కావాలో కోరుకో !:
కృష్ణ చూపు మహర్షి నుండి నాశనమైన ధరిత్రి వైపు మళ్లింది. ఒకప్పుడు జవజీవాలతో ,పైరు పచ్చలతో కళకళలాడిన భూమి ,భూమి తల్లి.
కన్నీళ్లతో ,ఉద్వేగంతో కృష్ణ వరం కోరుకున్నాడు .
” మా అమ్మ !”……………. (అనువాదం :: Bp Padala … కథారచయిత :: O.V.Vijayan … 1996 లో ఆంధ్రప్రభలో ప్రచురితం…)
Share this Article