Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక పార్లమెంటు… ఒక రేణుకా చౌదరి… ఒక శునకోపాఖ్యానం…

December 3, 2025 by M S R

.

మొరిగే కుక్కలు, కరిచే కుక్కల అన్ పార్లమెంటరీ చర్చ

# దేశవ్యాప్తంగా ప్రతి 11 సెకెన్లకు ఒక కుక్కకాటు కేసు నమోదవుతోంది.

Ads

# 2022 లో దేశంలో కుక్కకాటు సంఘటనలు- 22 లక్షలు. 2024లో- 37 లక్షలు.

# 2024 లో కుక్కకాటు కేసులు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బాగా పెరిగాయి.

# దేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలున్నాయి.

# కుక్కల ద్వారా దాదాపు 60 రకాల వ్యాధులు మనుషులకు వచ్చే ప్రమాదముంది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం వీధి కుక్కల దెబ్బకు ఇప్పుడు రెండుగా చీలిపోయి ఉంది. ఢిల్లీలో వీధి కుక్కలు కరిచి చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకుని ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించాయా! ఖబడ్డార్! అని శునక నిర్ములన మహా యజ్ఞానికి ఆదేశాల హవిస్సులు ఇచ్చింది.

దాంతో రాహుల్ గాంధీ మెదలు అనేకమంది సెలెబ్రిటీలైన జంతు ప్రేమికులు సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని కోరుతూ సరికొత్త ఉద్యమానికి ఊపిరులూదారు. జంతుప్రేమికుల ఒత్తిడికి తలొగ్గి సుప్రీం కోర్టు కొంత పట్టు సడలించింది. అది వేరే సంగతి.

కొన్ని సందర్భాలు విచిత్రంగా మొదలై ఎటెటో వెళ్ళిపోయి అంతుచిక్కని సముద్రమంత గంభీరమై కూర్చుంటాయి. అలాంటిది పార్లమెంటు ముందు శునకోపాఖ్యానం.

నిజానికి పార్లమెంటులో కుక్కలకు పనిలేదు. చట్టసభలు ఉన్నది చట్టాలు చేయడానికి. చట్టాల బాగోగులమీద చర్చించడానికి. ఒకవేళ పొరపాటున కానీ…ఉద్దేశపూర్వకంగాకానీ కుక్కలు పార్లమెంటులోకి ప్రవేశించినా… అవి చర్చించలేవు. చట్టాలను చేయలేవు. అందుకే వాటికి ప్రవేశం నిషేధం. మరి ఈ విషయం కాంగ్రెస్ ఎం పి రేణుకా చౌదరికి తెలియకుండా ఉంటుందా? ఏమో!

రేణుకా చౌదరి

కుక్కను పార్లమెంటు ఆవరణంలోకి తీసుకురావడం సంగతేమోకానీ…”కరిచే కుక్కలు పార్లమెంటు లోపలే ఉన్నాయి… ఆ కుక్కలతో పోలిస్తే ఈ వీధి కుక్క చాలా మంచిది. ఎవరినీ కరవదు… పార్లమెంటుకు వస్తుంటే దారిలో ప్రమాదానికి గురై దిగులు దిగులుగా ఉంటే… వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళుతూ… మధ్యలో నేను పార్లమెంటులో దిగడానికి వెంట తెచ్చాను. నేను దిగిపోయాక మా డ్రయివర్ దాన్ని పశువుల ఆసుపత్రికి తీసుకెళతాడు- అంతే” అన్న వివరణతో అధికార బీజెపికి అద్భుతమైన అవకాశం దొరికినట్లయ్యింది.

మూగజీవానికి వైద్యం చేయించే సహృదయత వరకు బాగానే ఉన్నా… ఈ సందర్భంగా ఆమె అన్న మాటలు పార్లమెంటునే కించపరిచేలా ఉన్నాయని బిజెపి ఎంపిలు ఏ పాయింటును పట్టుకోవాలో సరిగ్గా ఆ పాయింటునే పట్టుకున్నారు.

సాధారణంగా మొరిగే కుక్కలు కరవవు. పార్లమెంటు ముందు కుక్కల సంగతి మనకు అంతగా తెలియదు. “అన్ పార్లమెంటరీ” అని వాడకూడని మాటలకు ఒక పారిభాషిక పదమే ఉంది. బూతు, తిట్టే కాదు. అన్ పార్లమెంటరీ ఇంకా చాలా ఉన్నాయి.

పార్లమెంటు సభ్యులు సాక్షాత్తు పార్లమెంటు ముందే అన్ పార్లమెంటరీ చర్చకు తెరలేపితే… లోపల పార్లమెంటులో గౌరవ సభ్యులు పార్లమెంటరీ భాషకే పరిమితమవుతారా? అన్నదే ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు అన్ని పార్లమెంట్ల ఓటర్లు తేల్చుకోవాల్సిన విషయం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక పార్లమెంటు… ఒక రేణుకా చౌదరి… ఒక శునకోపాఖ్యానం…
  • తేరే ఇష్క్ మే …! తమిళం మార్క్ ఓవర్ డోస్ హింస ప్రేమ…!
  • ఒక యువ ప్రేమ… ఒక ప్రౌఢ ప్రేమ… ఓ పాత ప్రేమ… వెరసి సంసారం..!!
  • నో సారీ…! జస్ట్ సైలంట్…! దిష్టి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ పెడసరం..!!
  • గ్లోబల్ సమిట్ అతిథులకు ప్రత్యేక కిట్లు… తెలంగాణతనంతో..!
  • Rage Bait …. ఈ సంవత్సరం మాటగా ఆక్స్‌ఫర్డ్ ఎంపిక… అంటే ఏమిటి..?
  • మద్య వ్యాకరణం..! తాగుబోతులే ఆర్థిక వ్యవస్థలకు అతి పెద్ద దిక్కు..!!
  • క్యూర్… ప్యూర్… రేర్…! తెలంగాణ విజన్-2047 లో ఏమిటి ఈ పదాల అర్థం..!!
  • కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి… ఇదీ తెలంగాణపై కేంద్ర బీజేపీ వివక్ష లెక్క…
  • ఏందమ్మా జగద్ధాత్రీ… పవిత్ర టీవీ సీరియళ్ల సంప్రదాయం బ్రేక్ చేస్తావేం..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions