.
Subramanyam Dogiparthi
….. రేపటి పౌరులం రేపటి పౌరులం రేపటి పౌరులం , సత్యాగ్రహ గాంధీలం , సమతా శాంతుల నెహ్రూలం , సాహసంలో సుభాషులం , సంకల్పంలో పటేలులం , తెగించి దూకితే భగత్ సింగులం , తిరుగుబాటులో రామరాజులం , నీతికి నిలిచిన నేతలు ఎత్తిన నిప్పుల పిడికిళ్ళం . ఎంత గొప్పగా వ్రాసారో సి నారాయణరెడ్డి గారు రేపటి పౌరుల సినిమాకు ఐకానిక్ అయిన ఈ పాటను !!
The Child is the father of the man . Said William Wordsworth in his famous Rainbow poem . ఇంట్లో తల్లిదండ్రుల , సమాజంలో పెద్దల ఆలోచన , నైతిక విలువలు రేపటి పౌరులను ప్రభావితం చేస్తాయి కాబట్టి పెద్దలు నీతి నియమాలతో ఉండాలనే సందేశంతో వచ్చిన సినిమా . ఆ క్రమంలో రేపటి పౌరులను తయారు చేసే పవిత్ర ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని చాటి చెప్పే సినిమా .
Ads
నిన్నటికి 39 సంవత్సరాలు నిండిన ఈ రేపటి పౌరులు సినిమా ప్రజా దర్శకుడు టి కృష్ణ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా . ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు అన్నది కాదు ముఖ్యం . గంగిగోవు పాలు గరిటెడయినను చాలు . తీసిన సినిమాలు జనం గుండెల్లో ఎంతగా పాతుకుపోయాయి అనేది ముఖ్యం .
జీవించింది 36 సంవత్సరాలే అయినా వజ్రాల్లాంటి సినిమాలను అందించారు . విజయశాంతిని సానబెట్టి ఓ గొప్ప నటిగా ప్రేక్షకులకు అందించారు . నేటి భారతం , దేవాలయం , వందే మాతరం , ప్రతిఘటన , రేపటి పౌరులు నాకు బాగా నచ్చినవి . ఈ సినిమాకు షీరో విజయశాంతే . నిప్పు కణికగా దడదడలాడిస్తుంది .
టి కృష్ణతో పాటు ప్రకాశం జిల్లా ప్రజా నాట్య మండలి ఎర్ర కళా సైన్యాన్ని తప్పకుండా మెచ్చుకోవాలి . పోకూరి బాబూరావు , వెంకటేశ్వరరావు , నల్లూరి వెంకటేశ్వరరావులను ముందుగా అభినందించాలి . ఒకరికి ఒకరు తోడై ఓ ఎర్ర కళా ప్రభంజనాన్నే సృష్టించారు .
ఈ రేపటి పౌరులు సినిమా కధను నేసి , ప్రేక్షకుల నెత్తురు మరిగేలా స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని , అద్భుతమైన దర్శకత్వం వహించారు టి కృష్ణ . ముఖ్యంగా ఈ సినిమాలో పాత్రలు . ఏ ఒక్క పాత్రను తక్కువ చేయలేం , తీసేయలేం . అంత గొప్పగా సృష్టించారు . నటీనటులు కూడా అంత లీనమై నటించారు .
ఆ తర్వాత మెచ్చుకోవలసింది సంభాషణలను వ్రాసిన యం వి యస్ హరనాధరావు గారిని . అవి మాటలా ! స్టెన్ గన్ నుంచి దూసుకువచ్చే బుల్లెట్లు . సమాజాన్ని , వ్యవస్థని , ప్రభుత్వాన్ని ఈడ్చి ఈడ్చి కొడతాయి . ఏం లాభం ! చర్మాలు మొద్దు కదా !
పిల్లల్లో గొప్ప పాత్ర పి యల్ నారాయణ కొడుకుది . చదువంటే ఎంత పిచ్చి అంటే చదువుకుంటానికే హత్య చేసి జైలుకు వెళతాడు . జైల్లో ప్రాణాలు వదులుతాడు . ఆ పిల్లవాడి శవాన్ని పూడ్చి పెట్టేటప్పుడు పి యల్ నారాయణ డైలాగులు , నటన ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తాయి . ఆయనకు ఈ సినిమా లోని నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది .
అతని తర్వాత ఒళ్ళు అమ్ముకునే నిస్సహాయ మహిళ పాత్రలో అనూరాధని అభినందించాలి . ఆమె డైలాగులు , నటన కూడా చాలా చాలా బాగుంటాయి . ఒళ్ళు అమ్ముకునే ఆడదాన్ని చీత్కరించుకునే సమాజం కొనుక్కునే మగ పురుషులను పల్లెత్తు మాట అనదు . ఇద్దరూ సమాజానికి ఒకటి కాదని ఆ పాత్ర ఆవేదిస్తుంది .
సమాజంలోని చీడపురుగులకు ప్రతీకగా చొక్కా లేని మంత్రి రాళ్ళపల్లి , అన్యాయవాది సుత్తి వేలు , తాను సేఫ్ అవటానికి తన కింద పనిచేసే కానిస్టేబుల్ని కూడా బలి పశువుని చేసే టిపికల్ పోలీసోడిగా కోట శ్రీనివాసరావు , ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లను కూడా అమ్ముకునే డాక్టరుగా నర్రా బాగా కుదిరారు .
రోడ్ మీద నిద్రిస్తున్న సత్యాగ్రహ పిల్లల మీద కారు నడిపే దుర్మార్గుడిగా , మంత్రి కొడుకుగా నళినీకాంత్ క్రూరంగా నటించాడు . ఇలాంటి మంత్రి కొడుకులు , డబ్బు చేసినోళ్ళ బలిసిన పిల్లలు మన దేశంలో కావలసినంత మంది .
నాలుగేళ్ళ కింద ఉత్తర ప్రదేశ్ లో నిరసన తెలియచేస్తున్న రైతుల మీదకు వాహనాన్ని తోలి పబ్లిగ్గా చంపిన భాజపా మంత్రి కుమారుడు అశీష్ మిశ్రా చక్కగా బెయిల్ మీద ఉన్నాడు . డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ MLC అనంత బాబు వికృత చరిత్ర మనందరికీ తెలిసిందే . ఇలాంటి ఉదంతాలను నలభై ఏళ్ళ కిందే సినిమాల్లో చూపారు .
- అడవుల్లోకి పోయి జనానికి దూరంగా యుధ్ధం చేయటం వలన ప్రయోజనం ఉండదనే సందేశాన్ని మావోయిస్టులకు తెలుపుతుంది ఈ సినిమా .
సత్య పోరాటమే అభిలషణీయం అని జడ్జి గారిని ప్రజల మధ్యకు తెస్తుంది టీచర్ సరస్వతి . న్యాయ దేవత కళ్ళకు కట్టిన నల్ల గుడ్డను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈమధ్య తీయించారు . 39 ఏళ్ల కిందే ఈ సినిమాలో నల్ల గుడ్డను తీయిస్తారు .
ఇలా వ్రాసుకుంటూ పోతే ఓ Ph.D థీసిస్సే అవుతుంది . ఈ సినిమా ప్రాశస్త్యాన్ని నాకన్నా గొప్పగా గౌరవించే తెలుగు ప్రేక్షకులు చాలామందే ఉన్నారు . ఇంక పూర్తి చేయటానికి ప్రయత్నిస్తా . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో మరి కొన్ని గొప్ప పాటలు ఉన్నాయి .
విరిసీ విరియని నవ్వుల్లారా తెలిసీ తెలియని మనసుల్లారా , అయ్యా నే చదివి బాగుపడతా పాటలు ఉత్తేజ పూర్వకంగా ఉంటాయి . అలాగే పేరెంట్స్ డే నాడు పిల్లలు పాడే తల్లుల్లారా తండ్రుల్లరా చదువులు చెప్పే గురువుల్లారా చిత్రీకరణ చాలా బాగుంటుంది .
ఎవరురా అన్నాడు ఏ యెదవరా అన్నాడు ఈ దేశం ముందుకు పోలేదని ! ఎర్ర పాట ఆవేదనతో కాసేపయినా ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది . పాటల్ని నారాయణరెడ్డి , జాలాది , ఎర్ర వంగపండు వ్రాయగా బాలసుబ్రమణ్యం , వందే మాతరం శ్రీనివాస్ , శైలజ , జానకమ్మ , రమణలు పాడారు .
ఇతర ప్రధాన పాత్రల్లో రాజశేఖర్ , నల్లూరి వెంకటేశ్వరరావు , జయశీల , వై విజయ , తాతినేని రాజేశ్వరి , తదితరులు నటించారు . రేపటి పౌరులుగా చిరంజీవులు జితేంద్ర , శ్రీ హనుమాన్ , సాయి భూషణ్ , సతీష్ , శ్రీనివాస్ , విజయకృష్ణ , అశోక్హి , బేబీ యశోధరలు వీర విహారం చేసారు . అందరి చేత అద్భుతంగా నటింప చేసిన దర్శక బృందాన్ని అభినందించాలి . ఉత్తమ చిత్రంగా నంది , ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి . తమిళంలోకి డబ్ చేయబడింది . ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మెజారిటీ షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా .
సూపర్ డూపర్ హిట్టయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇప్పటికీ చాలా గ్రామీణ పాఠశాలలో రేపటి పౌరులం పాట ఫంక్షన్లప్పుడు వినిపిస్తుంటుంది . సినిమానే అప్పుడప్పుడు స్కూల్ పిల్లలకు చూపిస్తుండాలి . నేను ఈ సినిమా ఎప్పుడు టివిలో వచ్చినా వదలకుండా చూస్తుంటాను . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడండి . An unmissable , inspirational , thought provoking , real patriotic movie . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు
Share this Article