సాధారణంగానే ఏ పత్రిక సండే మ్యాగజైన్లను చదవడం ఇష్టముండదు… ప్రత్యేకించి వాటి ముఖచిత్ర కథనాలు పెద్ద సొల్లు… కాకపోతే లోపల అప్పుడప్పుడూ కొన్ని కథలు, క్రైం స్టోరీలు కాస్త బెటర్… అనుకోకుండా సాక్షి మ్యాగజైన్ తిరగేస్తుంటే… అవును, జస్ట్, తిరగేస్తుంటే ఓ క్రైం కహానీ కనిపించింది… ఒక క్రైం కథను రచయిత ఏ శైలిలో ఎలా రాశాడో పరిశీలించడమే నా ఉద్దేశం… అదిలా మొదలైంది…
టైటిల్ పేరు పథకం… ‘‘హఠాత్తుగా నిద్ర నుంచి మెలకువ వచ్చింది సుధీర్‌కు… చెవులు రిక్కించి విన్నాడు… ఎవరో మెట్లు ఎక్కుతున్న శబ్దం… రాత్రి రెండు గంటలు కావొస్తోంది… ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు… తిరుపతి పొలిమేరల్లోని అవిలాలలో మిత్రుడి గదిలో రెండురోజులుగా ఉంటున్నాడు తను… ఈరోజు పల్లెలో ఏదో పని ఉందని అతని మిత్రుడు కూడా ఊరెళ్లాడు…’’
కళ్లకు బ్రేక్ పడింది ఒక్కసారిగా… తిరుపతి, అవిలాల, ఓ హారర్ థ్రిల్లర్‌గా శైలి ఎత్తుకోవడం… ఎక్కడో చదివాను… ఎక్కడబ్బా…? సాక్షి వేరే పత్రికలో వచ్చిన స్టోరీ కాపీ అండ్ పేస్ట్‌కు పాల్పడిందా..? పెద్ద పెద్ద దర్శకులే సిగ్గువిడిచి చేస్తున్న పని, ఇప్పుడు పెద్దగా తప్పు అని కూడా భావించడం లేదు ఇప్పుడు… విజయసాయిరెడ్డి వంటి పార్టీ నంబర్ టూ కూడా సాక్షిని గరికపాటిలా తీసిపారేస్తున్నాడు… పార్టీ నేతల్లో చాలామందికి ఉన్న అభిప్రాయమే అది…
Ads
ఈనాడు, జ్యోతి వంటి థాట్ పోలీసింగ్ పత్రికలకు భిన్నంగా ఓ ఆల్టర్నేట్ వాయిస్‌గా ఉండటానికి పుట్టిన సాక్షి అందులో ఘోరంగా విఫలమైంది… చివరకు సొంత పార్టీకి కూడా పెద్ద ఫాయిదా లేదు… ఈ కాపీ అండ్ పేస్ట్‌లు దానికి పెద్ద లెక్కా అనుకుంటూ, మెల్లిమెల్లిగా వెనక్కి థింకుతుంటే ధన్‌మని వెలిగింది… ఇది సాక్షిలోనే చదివినట్టు గుర్తు…
ఎక్కడి నుంచో ఎత్తుకొస్తే నామర్దా… మన కథల్నే మనమే మళ్లీ మళ్లీ ఎన్నిసార్లయినా అచ్చేసుకుంటే తప్పేముంది..? సినిమాను పదే పదే రిలీజ్ చేసుకున్నట్టు..? అంతే మరి… కొత్త ఉత్పత్తి లేదు, మరి ఏదో నింపి తగలెట్టాలి కదా… మరేటి చేస్తం..? పాతదే మళ్లీ కాపీ అండ్ పేస్ట్… మార్పులు కూడా అక్కర్లేదు… సేమ్ టైటిల్… సేమ్ ఫైల్…
ఆ మ్యాగజైన్ సాక్షిలో పెద్దలెవరూ చదవరు… వాళ్లలో చాలామంది అసలు తమ పేపరే చదవడం లేదు… ఇలా రీరిలీజులు చేస్తే ఎవడు పట్టుకుంటాడు..? అంతేనా… అంతే… అయితే కుమ్మేసెయ్… అదుగో ఆ ఆలోచనల ధార నుంచి, మొన్నటి ఆగస్టు 21 సంచిక నుంచి… యథాతథంగా రిపీట్ కొట్టేశారు… కొత్తగా రాసేవాళ్లు ఎవరున్నారు..? రాయించేవాళ్లు ఎవరున్నారు..? ఏదో చల్తా… మొన్నటి ఆగస్టులోని కథను యథాతథంగా ఇప్పుడు సేమ్ సేమ్ పబ్లిష్ చేయడం అంటే పాత్రికేయ కోణంలో ఓ సిగ్గుచాటు వైఫల్యం… ఈనాడు వంటి పత్రికలోనైతే ఒకరిద్దరి కొలువులకు ఉరివేస్తారు…
బట్, సాక్షి కదా… ఏమీ కాదు… అవకాశముంటే ఇంక్రిమెంట్ ఇస్తారు… సార్, సాయిరెడ్డి గారూ, త్వరగా పత్రికను తీసుకొచ్చేద్దాం సార్… ఇలాంటి సిగ్గుచేటు యవ్వారాలకు తావులేని, ఈనాడుకు దీటైన ఓ పత్రికను తీసుకొద్దాం… ఎలాగూ సాక్షి ఔటాఫ్ ట్రాక్… దాన్ని బాగు చేయడం జగన్ వల్ల కూడా కాదు… ఇంతకీ మన కొత్త పత్రికకు పేరేం పెడుతున్నారు సార్…?
Share this Article