.
ఎస్ఎల్‌బిసి సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ 50 రోజులుగా సాగుతున్నది కదా… రెండు మృతదేహాలు బయటపడ్డాయి, మిగతావారి జాడలేదు… సొరంగం నిండా బురద, మట్టి, విరిగిపడిన రాళ్ల కారణంగా అసలు ఎన్నిరకాల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ ప్రయత్నిస్తున్నా సరే ఫలితం కనిపించడం లేదు…
ఇవే చదువుతుంటే మరొక రెస్క్యూ వార్త కనిపించింది… చాలా ఆసక్తికరం… కేరళకు సంబంధించిన వార్త… ఓ చిన్న పిట్ట ఓ షాపులో ఇరుక్కుపోయింది… అదేమో అధికారుల ద్వారా సీల్ చేయబడింది… అది బయటికి రావాలంటే ఆ సీల్ తీయాలి… కానీ ఎవరు తీయాలి..?
Ads
ఆ ఒక్క పిట్ట కోసం చాలా పెద్ద ఆపరేషనే జరిగింది… కేరళ, కన్నూరు జిల్లా, ఉల్లిక్కల్ పంచాయతీ అది… ఈ పిట్టను రెస్క్యూ చేయడం అనేది పైకి చూడటానికి చిన్నదే అనిపించినా… కాస్త ఇంట్రస్టింగు… అక్కడి స్థానికులు కనబరిచిన భూతదయ చెప్పుకోదగింది…
ఒక టెక్స్‌టైల్ షాపు… న్యాయ విచారణల కారణంగా దాన్ని సెషన్స్ కోర్టు సీల్ చేయించింది… ఐతే పక్కనే ఉన్న షాపుల వాళ్లకు, ఆటో డ్రైవర్లకు ఆ షాపు నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి… అవేమిటో వీళ్లకు ముందుగా అర్థం కాలేదు… తరచి చూస్తే ఓ గాజు కిటికీ నుంచి బయటికి రావడానికి ఓ పిచ్చుక ప్రయత్నిస్తూ ఆ గాజు పలకను ముక్కుతో గట్టిగా కొడుతోంది… అవీ శబ్దాలు…
మూడు రోజులుగా అవే శబ్దాలు… విషయం అర్థమైన తరువాత స్థానిక అధికారులకు చెప్పారు… ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులను సంప్రదించారు… కానీ అదేమో కోర్టు ద్వారా సీల్ చేయబడింది… ఎవరూ సీల్ తీయడానికి వీల్లేదు… లీగల్ రిస్క్…
విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు… కానీ కలెక్టర్ కూడా చేయగలిగింది ఏముంది..? కోర్టు అనుమతి కావాలి కదా తనకు కూడా… స్థానికులు ఆ పిట్టను ఎలాగైనా కాపాడాల్సిందేనని సంకల్పించారు… జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.టి.నిస్సార్ అహ్మద్ దృష్టికి తీసుకుపోయారు ఎలాగోలా…
ఆయన కోర్టు రూం నుంచే ఏవో ఆదేశాలు జారీ చేయలేదు… ఇదేదో ఇంట్రస్టింగుగా ఉంది కదాని తనే స్వయంగా ఉల్లిక్కల్ వచ్చాడు… షాపు తలుపులు తెరవాలని ఆదేశించాడు… తన సమక్షంలోనే తలుపులు తెరవడం, ఆ పిచ్చుక ఒక్కసారిగా బయటకు వచ్చి ఎగిరిపోయింది…
కరుణ, భూతదయ వంటి పెద్ద పదాలు ఎలా ఉన్నా… ఒక్క పిట్ట కోసం స్థానికులు, రెస్క్యూ విభాగాలు, కలెక్టర్, చివరకు జిల్లా జడ్జి దాకా ఎంటర్ కావడం… వావ్… వార్త బాగుంది…
Share this Article