.
BT Govinda Reddy …….. డ్రాగన్ పరుగులు నిల్చిపోయినట్టేనా?
అమెరికాకు ఎగుమతులు నిల్చిపోవడంతో చైనా ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. అగ్రదేశం అవసరాలకోసం ఉత్పత్తి చేసిన వినిమయ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, వాహనాలను లాటిన్ అమెరికా, ఆఫ్రికా, తూర్పు ఏషియా దేశాలేవీ కొనే పరిస్థితిలో లేవు.
Ads
వాటి అవసరాలు వేరు. పెరిగి పోతున్న నిల్వలను వదిలించుకోవడానికి షీ జిన్ పింగ్ పొరుగుదేశాలకు రాయబారాలు పంపుతున్నాడు. తను స్వయంగా వియత్నాం, మలేషియా, కంబోడియాలకు వెళ్లి వచ్చాడు.
గతంలో ఈ దేశాల అధ్యక్షులు చైనాను సందర్శించినప్పుడు ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలకని దేశాధినేత ఇప్పుడు మూడో ప్రపంచ దేశాల యాత్రలు పెట్టుకోవడం చూస్తుంటే డ్రాగన్ ఆందోళనలో ఉన్నది అర్థమవుతుంది.
చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) జిన్ పింగ్ దేశాన్ని నడిపిస్తున్న తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా 245 % సుంకాలు మరో 3 నెలల పాటు కొనసాగితే పారిశ్రామిక రంగం కుదేలవుతుందనే భయం కనిపిస్తోంది.
మరో వైపు ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FDI) తిరుగుబాట పట్టాయి. హాఫ్ మారథాన్ లో రోబోలను పరుగెత్తించడం లాంటి చర్యలు రోజుకొకటి చేస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. నిరుద్యోగం పెరగుతుందని ప్రజల్లో గుబులు కనిపిస్తోందని విదేశీ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని చైనా ఎదుర్కొంటోంది. అమెరికా ఎగుమతులకు ఉద్దేశించి ఉత్పత్తి చేసిన వస్తువులను దేశీయ మార్కెట్లో విక్రయిస్తే కొంత వరకు నిల్వలను తగ్గించుకోవచ్చని భావిస్తున్నా అది అంత తేలిక కాదు.
చైనా 100 యూనిట్ల (వస్తువుల)ను ఉత్పత్తి చేస్తే అందులో దేశీయ మార్కెట్ వినియోగం 50 శాతం. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితిలో ఎన్ని ఉద్దీపనలు అందించినా, రాయితీలు కల్పించినా నిలిచి పోయిన ఎగుమతులను దేశీయ మార్కెట్లో ‘క్లియరెన్స్ సేల్’ ద్వారా వదిలించుకోవడం అసాధ్యం.
అమెరికా ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వియత్నాం చైనాకు దూరం జరుగుతోంది. జిన్ పింగ్ తిరిగొచ్చిన కంబోడియా, మలేషియాల వార్షికాభివృద్ధి అంకెలు ప్రోత్సహకంగా లేవు.
ఇజ్రాయెల్ కు మద్ధతిస్తున్న అమెరికా, యూరప్ దేశాల వాణిజ్య నౌకలను ఎర్ర సముద్రంలో ముంచుతున్న యొమెన్ ఉగ్రవాద సంస్థ హూతీలకు చైనా సాంకేతిక మద్ధతు అందించినట్టు వెల్లడైంది. చైనా సైన్యం ఆధీనంలోని ప్రభుత్వ సంస్థ ఎర్ర సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకల కదలికలకు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ లను అందించి సహకరిస్తోందని వైట్ హౌజ్ బయట పెట్టింది. హూతీని నడిపిస్తున్నది ఇరానేనని తెలిసిందే.
ఈ సమాచారంతో హూతీలను వెనకేసుకొస్తున్న చైనా పట్ల యూరప్, ఉత్తర అమెరికా దేశాలు తమ వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. ఏకాకిగా మిగిలితే చైనా పాలకవర్గంలో చీలికలు వచ్చి అధికార మార్పిడికి దారితీయవచ్చు.
చైనాలో మీడియా సంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా సోషల్ మీడియా సమాచార విస్ఫోటనంతో ప్రజలకు అన్నీ తెలిసిపోతున్నాయి. ప్రపంచపు ఉత్పత్తిదారు డ్రాగన్ ఈ సంక్షోభం నుంచి బయటపడటం అంత తేలికేమీ కాదు.
మనల్ని ఏమాత్రం సహించని, పాకిస్థాన్ దోస్త్ చైనా డ్రాటన్, ఎలిఫెంట్ భాయి భాయి అని ఎందుకు అంటున్నదో అర్థమైంది కదా… ఇప్పుడు ఇండియా కావల్సి వచ్చింది… Image source: India Today
Share this Article