Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్‌రెడ్డి పోలీసు అడ్డాలో, పోలీసు భాషలోనే క్లియర్‌గా చెప్పాడు..!!

December 28, 2024 by M S R

.

రాజు- దిల్ రాజు…… నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి…

తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ… నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే.

Ads

రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్ళు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజసిద్ధమైన పద్ధతిలో రేవంత్ ఈ విషయాన్ని సినిమావారికి బోధపరిచినట్లు ఉన్నారు. దాంతో సహజంగా దిల్ రాజు దిల్ లోపలినుండి అదే బయటికి వచ్చినట్లుంది.

విజయనగర రాజ్య రాజధాని హంపీలో ఎప్పుడూ లేనిది ఒక ఎండవేళ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అంబారీ ఎక్కి రాచవీధిలో తిరుగుతున్నాడు. పక్కన గుర్రం మీద మహామంత్రి తిమ్మరుసు. ఆయన వెనుక సకల పరివారం. చక్రవర్తి తనకు తానుగా ప్రతి ఇంటి ముందు ఆగి సమస్యలేమైనా ఉన్నాయా! అని అడిగి… ఉంటే వెంటనే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాడు.

ఒక ఇంటి వసారాలో నడుముకు తుండుగుడ్డ మాత్రమే కట్టుకుని ఉన్న ఒక బక్కచిక్కిన ముసలివాడు గుంజకు ఆనుకుని కునుకు తీస్తున్న దృశ్యం కృష్ణరాయల కంటపడింది. అందరికీ అన్నీ ఇస్తూ వస్తున్నాను. ఇతడు నిరుపేదలా ఉన్నాడు. ఏ అవసరముందో కనుక్కోండి… ఇచ్చేద్దాం అన్నాడు.

“మహాప్రభో! కొంప మునుగుతుంది. అతడు నాకు తెలుసు. మధ్యాహ్నం భోంచేసి హాయిగా నిద్రపోతున్నాడు. అతడికి రాత్రి భోజనం గురించి కూడా చింత ఉండదు. ఇప్పుడతడి నిద్రను భంగపరిస్తే… విజయనగర మహా సామ్రాజ్యాన్నే శపిస్తాడు. మనకు అనవసరమైన తలనొప్పి. త్వరగా అంతఃపురానికి వెళ్ళి భోంచేద్దాం. పదండి. నామాట విని దయచేసి అతడిని కదిలించకండి” అని తిమ్మరుసు వేడుకున్నాడు. తిమ్మరుసు మాట విని కృష్ణరాయలు భద్రంగా ఇంటికెళ్ళాడు.

రాయలసీమ- కర్ణాటక సరిహద్దులో అయిదు శతాబ్దాలుగా ఈ కథ ప్రచారంలో ఉంది. నిజంగా ఇది జరిగిందో! కల్పితమో! తెలియదు. “అవసరమైనవాడే రాజును అడుక్కుంటాడు. అవసరం లేనివాడు రాజునే తూ నా బొడ్డు అనగలడు” అని చెప్పడానికి ఉదాహరణగా ఈ కథను చెబుతుంటారు.

సినిమా అవసరాలు సినిమావారు అడిగినట్లే… రాజ్యం అవసరాలు రాజు అడిగారు. రాజ్య ప్రాధాన్యాలను రాజు వివరించారు. ఇంత పెద్ద రాజ్యం ముందు బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు ఎంత చిన్న విషయమో తెలిసిందని బహిరంగంగా చెప్పడం కూడా సిచువేషన్ బాగా డిమాండ్ చేసినట్లుగానే చూడాలి. రాజు కోరుకున్నదే దిల్ రాజు చెప్పారు.

మనవాతీతులమని, దైవాంశసంభూతులమని అనుకునేవారికి స్వస్వరూప జ్ఞానం కలిగించాలన్నది రేవంత్ ఉద్దేశం. “నా పేరు మరచిపోయినందుకు అల్లు అర్జున్ ను జైల్లో పెట్టించాను- అని దుష్ప్రచారం జరుగుతుంటే ఒక్కరైనా నోరు విప్పలేదే?” అన్న రేవంత్ కు ఉండాల్సిన స్పష్టత ఉంది. సినిమావారికే ఇంకా చాలా స్పష్టత రావాల్సి ఉంది.

రాజును తూ నా బొడ్డు అనాలంటే ఒంటిమీద తుండుగుడ్డ తప్ప ఇంకేమీ ఉండకూడదు. కానీ… మన పరిస్థితి అది కాదు కదా! రెండు అడగబోతే ఒక సెస్ మీద పడింది ప్రస్తుతానికి! ఇది కూడా రేవంత్ ఇవ్వదలుచుకున్న స్పష్టమైన సందేశమే.

“మాక్కావాల్సింది మీ దగ్గరుంది” అని వీరు సినిమా గేయ సాహిత్యాన్ని తాళంలో పాడబోతే…
“నాక్కావాల్సింది మీరు చేసి చూపించాల్సిందే” అని పోలీస్ కమాండ్ కంట్రోల్ నీలి ఆకాశహర్మ్య భవంతిలో తాళం లేకుండా సరళ వచనంలో స్పష్టంగా చెప్పి పంపారు ఆయన.

ఆ నేపథ్యంలో- “ఏ పాట నే పాడను?” అని వెతుక్కోకుండా ఒక్కొక్కరు వరుసగా ప్రభుత్వ పాటనే భయభక్తులతో మీడియా కెమెరాల ముందు పాడి వెళ్ళారు. సినిమా రాగతాళాలన్నీ స్టూడియోలవరకే. ముఖ్యమంత్రి ముందు అన్ని మేళకర్త రాగాలు, లయలు ప్రభుత్వరాగంలోనే లయమై ఉంటాయి. ఉండాలి.

హిమాలయాన్ని ఎడమకాలి కింద తొక్కి పెట్టిన భావానికి అభినయించే హీరోలు; హీరో లోతు కొలవలేక పాతాళం తలదించుకున్న సందర్భాల సాహిత్యం రాయించుకునే మేరునగ దర్శక, నిర్మాతలను పోలీస్ కంట్రోల్ రూముకు పిలిపించి… కూర్చోబెట్టి… క్లాసు తీసుకోవడంలోనే హోమ్ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ప్రతీకాత్మకంగా చాలా సందేశమే ఇచ్చారు.

భాగ్యనగరంలో ఇన్ని ప్రభుత్వ సమావేశ భవనాలుండగా లా అండ్ ఆర్డర్ ను ఆర్డర్లో పెట్టాల్సిన మీటింగ్ లాగా ఇదెందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిందో, డిజిపి ఎందుకు మాట్లాడారో సినిమావారికి అర్థమయ్యే ఉంటుంది!

నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. అప్పుడప్పుడూ రేవంత్ రెడ్లు కలుగజేసుకుని చెప్పేవరకు అది ఎంత పెద్దదో దానికీ తెలియదు! మనకూ తెలియదు!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions