Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!

September 17, 2025 by M S R

.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నీళ్ల హక్కుల విషయంలో తెలివైన వ్యూహంతో వెళ్తూ… గతంలో కేసీయార్ చేసిన నదీజల నష్టాల్ని సరిదిద్దే దిశలో కదులుతున్న తీరు ఆసక్తికరం, తెలంగాణకు ప్రయోజనకరం.., కాస్త వివరంగానే చెప్పుకోవాలి… ఎందుకంటే, పదేళ్ల కేసీయార్ హయాంలో జరిగిన జలనష్టం ఇప్పుడు చర్చకు వస్తోంది కాబట్టి…

మరీ టీఎంసీలు, క్యూసెక్కుల భాషలో గాకుండా… తెలంగాణ ప్రయోజన రాజకీయాల భాషలో చెప్పుకుందాం… తెలంగాణ పోరాట ముఖ్యసూత్రాలు ఏమిటి..? నీళ్లు, నిధులు, నియామకాలు… చాలా ఇష్యూస్ ఉన్నా సరే, ఇదే పోరాట మెయిన్ ఎజెండా… నీళ్ల గురించి చెప్పాలంటే…? ఉమ్మడి పాలనలో తెలంగాణ జలప్రయోజనాల్ని ఆంధ్రా పాలకులు దెబ్బతీశారు…

Ads

వైఎస్ పీరియడ్‌లో… రాయలసీమ వైపు మొగ్గు కనిపించినా సరే, రాష్ట్రం మొత్తాన్ని ఓ యూనిట్‌గా పరిగణించి జలయజ్ఞం చేపట్టాడు… తను బతికి ఉంటే తెలుగు రాష్ట్రాల నదీజలాల ఉపయోగం వేరే రేంజులో ఉండేది… కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక, నేను అవసరమైతే కోర్టులో వాదించి మన వాటాను సాధిస్తాననీ అన్నాడు కేసీయార్… కానీ..?

కృష్ణా ప్రాజెక్టులపై శీతకన్ను… పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల కదలిక లేకుండా పోయింది… ఎంతసేపూ గోదావరిపైన ఆ కాళేశ్వరానికే ప్రాధాన్యత ఇచ్చాడు… అదేమో ఇష్టారాజ్యంగా కట్టిన ఫలితంగా, లక్ష కోట్ల ఖర్చు చేసినా సరే… అది నొగలు విరిగిన బండి ఇప్పుడు… అంతేనా..? జగన్‌తో కలిసి మన గోదావరి నీటిని పెన్నా దాకా తరలించే ఆలోచన చేశాడు…

అంతేకాదు, పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు కుట్రల పట్ల నిర్లక్ష్యం, ఉదాసీనత, రాయలసీమ లిఫ్టు పథకం కడుతుంటే పట్టింపులేనితనం… సో, రెండు నదుల జలాల్లోనూ మన స్వయంకృత నష్టాలు… అంటే, ప్రత్యేక రాష్ట్ర ఎజెండాలోని ముఖ్యమైన నీళ్లు అనే అంశానికి మనంతట మనమే దెబ్బకొట్టుకున్నాం… కేసీయార్ పాలన అనాలోచిత విధానాల ఫలితం అది…

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎదురైన మొదటి సమస్య… మన కేసీయార్ అలా నష్టపరిస్తే, పరాయి చంద్రబాబు గోెదావరి నీళ్లను బనకచర్ల పేరిట ఎత్తుకుపోతామని, మరో కాళేశ్వరం కట్టాలని ప్లాన్ వేశాడు… నామీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వ మనుగడ ఉంది, మోడీ మెడలు వంచి అనుమతులు తెస్తానని అనుకున్నాడు… వృథాజలాలు అనే పదాన్ని కాయిన్ చేసి, ఏదో మాయ చేసే ఎత్తుగడకు దిగాడు…

(మరోవైపు… అయ్యో, అయ్యో, రేవంత్ రెడ్డి సంతకాలు చేసేశాడు, గురుదక్షిణగా గోదావరి జలాలు ఇచ్చేస్తున్నాడు, బనకచర్లకు సై అన్నాడు అంటూ… ఇదే కేసీయార్ క్యాంపు గాయిగత్తర ప్రచారానికి పూనుకుంది… అసలు అక్కడ ఆలూ లేదు, చూలూ లేదు…)

banakacharla

చివరకు ఏమైంది..? బనకచర్ల అటకెక్కింది… పైన కనిపించిన క్లిప్పింగు తెలుగుదేశం ప్రభుత్వ అనుకూల ఆంధ్రజ్యోతిలో ఈమధ్య వచ్చిందే… (ఆచి లేదు, తూచి లేదు… సొంత శిబిరం నుంచి కూడా ఈ మరో కాసుల కాళేశ్వరం మీద వ్యతిరేకత రావడంతో పాటు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలివిగా చంద్రబాబును ఫిక్స్ చేసింది, ఎటూ కదలకుండా…)

తెలివిగా ఫిక్స్… పోలవరం ప్రాజెక్టుకు లింక్, చత్తీస్‌గఢ్ కొత్త ప్రాజెక్టులకు లింకు, నదుల అనుసంధానానికి లింకు, తెరపైకి ఇచ్చంపల్లి ప్రాజెక్టు సహా… ముందు గోదావరిలో మా వాటా తేల్చండి, తరువాత ఆలోచిద్దాం అని తెలంగాణ ఖండితంగా చెప్పింది… కేంద్ర జల, పర్యావరణ సంస్థలు కూడా ‘బాబు గారూ, బనకచర్ల కుదరదండీ’ అని చెప్పేశాయి… చివరకు కేంద్రం దగ్గర రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరినా, ఏపీ ఆ పేర్లనే సూచించలేదు… బీఆర్ఎస్ నోరు కూడా మూతపడింది…

అంతేకాదు, కేసీయార్ కట్టిన బరాజులేమో ప్రమాదకరంగా ఉన్నాయి, నిల్వ చేసే సీన్ లేదు… నిల్వ చేస్తే బరాజులు ఉంటాయో కొట్టుకుపోతాయో తెలియదు… మెడ విరిగిన మేడిగడ్డ రిపేర్ చేయించడానికి పూణెలోని ఓ సంస్థతో సర్వే చేయిస్తోంది ప్రభుత్వం… తరువాత నీటి పంపింగుకు సరిపడా నిల్వకు పరిమితం చేయాలనేది రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన… గుడ్…

మరోవైపు తుమ్మిడిహట్టి… పాత ప్రాణహిత- చేవెళ్ల స్పిరిట్‌తో తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టి, ప్రాణహిత నుంచి వీలైనంత నీటిని వాడుకోవాలని తాజా నిర్ణయం… ఇప్పటికే పూర్తయిన రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాలువలను కూడా వాడుకుంటారు… మహారాష్ట్రలో ముంపు ఉంటుంది కాబట్టి 150 మీటర్ల ఎత్తులో కట్టడానికి (3, 4 వేల ఎకరాల ముంపు) మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు… (ఈ దెబ్బకు చంద్రబాబు నోటి నుంచి ఇక వృథాజలాలు అనే మాట మళ్లీ రాకపోవచ్చు...)

tummidihatti

అవసరమైతే 148 మీటర్లకైనా అంగీకరించాలి… మహారాష్ట్ర అడిగితే ఆ ముంపు భూములకు గరిష్ట పరిహారాలను ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది… ఇక ఇచ్చంపల్లి,  నదుల అనుసంధానం ఇప్పుడప్పుడే తెమలదు, తేలదు… దానికి చాలా చిక్కులున్నాయి… ఇవీ గోదావరికి సంబంధించి కేసీయార్ చేసిన నదీజలనష్టాలకు విరుగుడు అడుగులు…

(మరి కృష్ణా సంగతేమిటి..? తరువాయి కథనం పార్ట్-2 లో...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…
  • వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!
  • భారీ బ్యానర్ ఐనంతమాత్రాన … సినిమా ఆడాలనేముంది..?
  • సత్సంగత్వే నిస్సంగత్వం… పలు భ్రమల్ని బద్దలుకొట్టే ఆత్మవైరాగ్యం…
  • రేప్పొద్దున విలేకరులకు ఇంకేం జరిగినా ఇంతేనా ఈనాడూ..?!
  • చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…
  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions