.
కేసీయార్ పాలన తాలూకు నీళ్ల వైఫల్యాలు- రేవంత్ రెడ్డి ప్రయాసల గురించి చెప్పుకుంటున్నాం కదా… గోదావరిపై తాజాగా వ్యూహాత్మక, తెలంగాణ జలప్రయోజనాల అడుగుల గురించి చెప్పుకున్నాం కదా ఫస్ట్ పార్ట్‌లో… మరి కృష్ణా జలాల సంగతి ఏమిటి…? అదీ ఈ సెకండ్ పార్ట్…
అప్పుడెప్పుడో కృష్ణా జలాల్ని బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రాల నడుమ పంచింది… అదీ 75 శాతం డిపెంబులిటీ లెక్కలతో… మనకు వచ్చింది సుమారు 800 టీఎంసీల వాటా… (ఉమ్మడి ఏపీ)… తరువాత బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది… 65 శాతం డిపెండబులిటీ లెక్కలు వేసి, నీటిలభ్యతను పెంచి చూపించింది… ఉమ్మడి ఏపీకి దాదాపు 200 టీఎంసీలు అదనంగా… అంటే మొత్తం 1000 టీఎంసీల దాకా ఇచ్చింది…
Ads
కానీ కర్నాటకకు అధిక ప్రయోజనం కలిగించే (ఆలమట్టి ఎత్తు పెంపు సహా) నిర్ణయాల్ని ఉమ్మడి ఏపీ వ్యతిరేకించింది… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం మన వాటా ఎంతో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం… విభజన చట్టంలోనూ ఈ ప్రస్తావన ఉంది…
మనం సుప్రీంకోర్టుకూ వెళ్లాం… తరువాత కేంద్రం తెలంగాణ- ఏపీ కృష్ణాజలాల వాటాల్ని తేల్చే పనిని కూడా ఆ బ్రజేష్ ట్రిబ్యునల్‌కే అప్పగించింది… (కృష్ణా, గోదావరి మేనేజ్‌మెంట్ బోర్డులు కూడా ఏర్పడ్డాయి)… తరువాత మనం సుప్రీంలో కేసు వాపస్ తీసుకున్నాం… ఈనెల 23, 24, 25 తేదీల్లో ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి… ప్రస్తుతం కీలకదశలో ఉన్నాయి… సో, ఇప్పుడే సరైన నిర్ణయాలు, వాదనలు అవసరం తెలంగాణకు… అదుగో, అందుకే రేవంత్ రెడ్డి దీనిపై కాన్సంట్రేట్ చేస్తున్నాడు… తప్పదు…
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి… నీటిప్రాజెక్టుల విషయంలో దూకుడు, వేగం, సమర్థమైన ప్లాన్ ఉండి, ముందుగానే ప్రాజెక్టులు కట్టుకున్నవాడే తోపు, తురుము… ఆలమట్టి సరైన ఉదాహరణ… వైఎస్ భాషలో చెప్పాలంటే… ఇవేమైనా రసాయన ఫ్యాక్టరీలా..? అనుమతులు వచ్చేదాకా, వాటాల పంచాయితీలు తేలేదాకా ఆగడానికి..? ఎవడు ముందు పరుగు తీస్తాడో వాడికే ఫలాలు దక్కేది…
కానీ కేసీయార్ ఏం చేశాడు..? అటు జగన్ మన శ్రీశైలం నీటిని ఇంకా ఎక్కువగా ఎత్తుకుపోవడానికి పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పుకు ప్లాన్ చేశాడు, రాయలసీమ లిఫ్ట్ ప్లాన్ చేశాడు, తుంగభద్ర ఇష్యూస్ కూడా ఉన్నయ్… ఇవేవీ పట్టించుకోలేదు కేసీయార్ సరిగ్గా… జగన్‌తో దోస్తీ కోసం తెలంగాణ జలప్రయోజనాల్ని పణంగా పెట్టాడు…
పోనీ, శ్రీశైలం ఆధారిత, శ్రీశైలం ఎగువన కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకున్నాడా అంటే అదీ లేదు… ఎస్‌ఎల్‌బీసీని ఎలా పండబెట్టాడో చూశాం కదా ఉదాహరణకు… కొత్త ప్రాజెక్టుల్లేవు, పాత పెండింగ్ ప్రాజెక్టులు కదలవు… వెరసి మనకే మరింత జలనష్టం వాటిల్లే ప్రమాదం…
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా 900 టీఎంసీల కృష్ణాజలాల వాటా సంపాదించేలా ట్రిబ్యునల్ దగ్గర వాదనలు వినిపించాలని ఆదేశించాడు… మన తాగునీటి అవసరాలు, మన సాగునీటి అవసరాలు, మన పారిశ్రామిక అవసరాలకు తోడు… ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రాజెక్టులకు సరిపడా నీటివాటాలు పొందాలని మన ప్రయత్నం… గుడ్..,
కృష్ణా జలాల్లో తక్కువ వాటాకు కేసీయార్ కేంద్రం దగ్గర అంగీకరించి ఆల్రెడీ ద్రోహం చేశాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది… సరే, ఇప్పుడు 1000 టీఎంసీల టోటల్ ఏపీ కేటాయింపులో, మనకే 900 టీఎంసీల వాటాను ట్రిబ్యునల్ ఇస్తుందా అనేది కీలక ప్రశ్న… కానీ సంకల్పానికి, ప్రయత్నానికి, లక్ష్యానికి దరిద్రం దేనికి..? ఆ వాదనకు కట్టుబడాలి… అందుకే కొన్ని కొత్త ప్రాజెక్టులకూ అర్జెంటుగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, వాటి నీటి కోసమూ ట్రిబ్యునల్ ఎదుట వాదనల్ని సిద్ధం చేయాలని వ్యూహం…
తెలంగాణ కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని బట్టి మనకు అధిక వాటా కావాలని కోరుతున్నాం… ఇది న్యాయమైన డిమాండ్… తెలంగాణ ప్రభుత్వపు సరైన అడుగులు ఇవి… ఇరిగేషన్ ఇష్యూస్‌కు సంబంధించి, ఎలా పోరాడాలో, ఎలా అడుగులు వేయాలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన సలహాలు దక్కుతున్నాయి… స్థూలంగా చెప్పాలంటే… కేసీయార్ ఉద్యమ ప్రధాన ఎజెండాలోని నీళ్లు అనే అంశానికి తూట్లు పొడిస్తే.,. వాటిని పూడ్చటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిశ్శబ్దంగా అడుగులు వేస్తోంది అని అర్థం..!!
రేవంత్ రెడ్డి భాషలోనే చెప్పాలంటే... సమైక్య పాలనలోకన్నా కేసీయార్ పాలనలోనే తెలంగాణకు అధిక జలద్రోహం జరిగింది... అందుకే ఇప్పుడు రెండు ప్రధాన నదుల నీళ్లలో (నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు) తెలంగాణ సరైన వాటాల కోసం, చుక్క నీరూ వదలకుండా పోరాడాల్సిందే...!!
Share this Article