Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

RDSS … కేసీయార్ మరిచిన విజ్ఞత-! రేవంత్ చూపించిన పరిణతి..!

May 24, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నాడు… సాహసం, విజ్ఞత, పరిణతి ఉన్నాయి ఇందులో..! దిక్కుమాలిన సందేహాలతో, అపోహలతో, అనవసర రాజకీయాల్ని కలిపేసి కేసీయార్ తీసుకోలేకపోయిన ఓ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది… ఇది కేంద్రం- రాష్ట్రం నడుమ ఉండాల్సిన సత్సంబంధాలను, ప్రజలకు నచ్చజెప్పి మరీ సంస్కరణల్ని అమలు చేస్తామనే పాలకుడి ధైర్యాన్ని ఇది చూపిస్తోంది…

ఇంకా బీఆర్ఎస్ క్యాంప్ దీనిపై నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టు లేదు… చేస్తుంది… దాన్ని తిప్పికొట్టేలా కాంగ్రెస్ ముఖ్యులు, మంత్రులు ప్రిపేర్ కావాలి… కానీ వారిలోనే ఎందరికి ఈ పథకం వివరాలు తెలుసనేది ప్రశ్నార్థకమే… అసలు నిన్నటి ఆ కేబినెట్ నిర్ణయం ఏమిటీ అంటే..?

Ads

ఇండియన్ పవర్ సెక్టార్‌లోని RDSS అంటే Revamped Distribution Sector Scheme (సవరించిన విద్యుత్ పంపిణీ రంగ పథకం)లోకి తెలంగాణ డిస్కమ్స్‌ను తీసుకురావడం… కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది… దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థల (DISCOMs) పనితీరును మెరుగుపరచడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం…

కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో తీసుకున్న సంస్కరణ ఇది… కేంద్రం- రాష్ట్రాలు సంయుక్తంగా వ్యవహరించి… విద్యుత్తు వ్యవస్థలో సాంకేతిక, వాణిజ్య నష్టాల్ని తగ్గించడమే కాదు, దుర్వినియోగాన్ని అరికట్టడం కూడా..! తెలంగాణలో దీనికి సంబంధించిన చర్చలు-  ఒప్పందాలు గతంలోనే (ముఖ్యంగా ఉదయ్ – UDAY పథకం, తదుపరి సంస్కరణల కాలంలో) జరిగినప్పటికీ, ఆ తర్వాత ఈ పథకంలో చేరకపోవడానికి బలమైన రాజకీయ, సాంకేతిక కారణాలు ఉన్నాయి… కేసీయార్ కాలంలో రాజకీయ కోణంలో జరిగిన తప్పుల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నాడు…

RDSS ముఖ్య లక్ష్యాలు

  • నష్టాల నివారణ…: విద్యుత్ సరఫరాలో జరిగే సాంకేతిక, వాణిజ్య నష్టాలను (AT&C losses) 12-15 శాతానికి తగ్గించడం…

  • ఆదాయ వ్యయాల సమతుల్యత..: విద్యుత్ కొనుగోలు ఖర్చుకు (ACS), వచ్చే ఆదాయానికి (ARR) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సున్నాకి తీసుకురావడం…

  • స్మార్ట్ మీటర్ల ఏర్పాటు…: దేశవ్యాప్తంగా ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడం…

  • ఆర్థిక సాయం..: దీని కింద కేంద్ర ప్రభుత్వం డిస్కామ్‌లకు దాదాపు 60% వరకు గ్రాంట్ల రూపంలో నిధులు సమకూరుస్తుంది…

2017 ఒప్పందం తర్వాత తెలంగాణ ఎందుకు చేరలేదు?

గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో (జనవరి 2, 2017న) కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కామ్‌ల మధ్య ఉదయ్ (UDAY) సంస్కరణల ఒప్పందం కుదిరింది… ఆ తర్వాత కాలంలో దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ RDSS నిబంధనలపై అప్పటి బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి కొన్ని తీవ్రమైన అభ్యంతరాలు ఉండటంతో దీని అమలును నిలిపివేశారు… ఆ కారణాలు ఇవే…

1. వ్యవసాయ మీటర్ల ఏర్పాటుపై అభ్యంతరం… 

కేంద్ర ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా మీటర్లు పెట్టాలనే నిబంధనలు (లేదా ప్రతిపాదనలు) ఉన్నాయి… అప్పటికే బీజేపీతో వైరం పెరిగి, బీజేపీ జాతీయ నాయకులపై కూడా తనదైన శైలిలో ఉరుముతున్న కేసీయార్… తనూ ఓ జాతీయ పార్టీ పెట్టి ఏకంగా ప్రధాని కావాలనుకునే ఆలోచనల దిశలో… బీజేపీ సంస్కరణను కూడా వక్రకోణంలో చిత్రీకరించి అడ్డుపడ్డాడు…

నిజానికి మీటర్లతో ఉచిత విద్యుత్తు ఆగిపోతుందనే భావన, ప్రచారం శుద్ద తప్పు… ఆ భారం భరించాల్సింది రాష్ట్రం… వ్యవసాయ విద్యుత్తులో దుర్వినియోగం జరుగుతుంటే అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్రానికి లేదా..? సరైన లెక్కలు ఎప్పటికప్పుడు తేలితే తప్పేమిటి..? ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రైతు డిస్కమ్ ఏర్పాటు చేసి, ఈ దిశలో సరైన అడుగులు వేస్తోంది కూడా..!

2. ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్ల భారం… 

సాధారణ వినియోగదారులకు కూడా ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టడం, వాటి నిర్వహణ ఖర్చులు, సంస్కరణలు పూర్తి చేయకపోతే కేంద్రం ఇచ్చే గ్రాంట్లు నిలిచిపోతాయనే కఠిన నిబంధనలు ఉన్నాయని బీఆర్ఎస్ ప్రచారం చేసింది… కానీ ప్రభుత్వ కార్యాలయాలకు, అధిక వినియోగం ఉండే కస్టమర్లకు ఈ స్మార్ట్ మీటర్ల బిగింపులో ప్రాధాన్యం ఉంటుందని, వినియోగదారులపై భారం ఉండదనీ, ఆ ఖర్చు కూడా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది… కరెంటు రీచార్జ్ పద్దతి వస్తే తప్పేమిటి..? (ఐతే రాష్ట్రం అమలు చేసే 200 యూనిట్ల కరెంటు విషయంలో ఏ పద్ధతి పాటిస్తారో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది…)

ప్రస్తుత పరిస్థితి (మే 2026 అప్‌డేట్)

గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కీలక నిర్ణయం తీసుకుంది…

తాజా కేబినెట్ నిర్ణయం…: తెలంగాణ డిస్కామ్‌లను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించడానికి,  కేంద్ర నిధులను (60:40 నిష్పత్తిలో వచ్చే గ్రాంట్లు) వినియోగించుకోవడానికి వీలుగా RDSS పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది…

ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత…

  • రైతులకు మినహాయింపు…: వ్యవసాయ కనెక్షన్లకు ఎలాంటి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయబోరని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది… రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది…

  • ఎక్కడ ఏర్పాటు చేస్తారు?…: స్మార్ట్ మీటర్లను కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు (Commercial), ఎక్కువ విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేస్తారు…

  • వినియోగదారులపై భారం లేదు…: ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి తప్ప, ప్రజల నుండి ఎలాంటి ముందస్తు రుసుము వసూలు చేయరు…

రాజకీయంగా విభేదించుకోవడం, సిద్ధాంతాల ఘర్షణ వేరు… కేంద్రం- రాష్ట్రం సంయుక్త సంస్కరణలు, పరస్పర సహకారం, కేంద్ర సాయం, రాష్ట్రం అభివృద్ధి వేరు… కేసీయార్ ఈ రెండింటినీ కలగలిపి గందరగోళం క్రియేట్ చేశాడు… రేవంత్ రెడ్డి ఆ రెండింటి నడుమ గీత గీశాడు… రెండూ వేర్వేరు అనే క్లారిటీతో వెళ్తున్నాడు… అదీ పాలకవిజ్ఞత…!!

(కేంద్రం అంటే అదేదో విదేశీ భూతం కాదు, అదీ మనం ఎన్నుకున్న ప్రభుత్వమే… కేంద్రం సంకల్పించే సంస్కరణ కూడా రాష్ట్రం సహకరించాల్సిన బాధ్యతే… ఇదీ కేసీయార్ వదిలేసిన రియాలిటీ… రేవంత్ రెడ్డి చూపిస్తున్న రెస్పాన్సిబులిటీ)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోక్షమార్గానికి ముందే ‘సైజ్ చెకింగ్ గ్రిల్స్’… అది దాటితేనే మోక్షం!!
  • ఎడాపెడా ఎయిర్‌పోర్టులు ! కొన్నింటికి విమానాల్లేవు- ప్రయాణికుల్లేరు !!
  • హరాకిరీ ! తెలంగాణ కాంగ్రెస్‌లో పెత్తనాల కిరికిరి ! BRS- BJP ఖుషీ !!
  • రకుల్ ప్రీత్ పేరు సరే – ఈ రేణు ధరీవాల్ పేరెప్పుడైనా విన్నారా..?
  • ‘నూకరాజు ! గతం- మూలాలు మరిచిపోని స్వచ్ఛత ! కీపిటప్ !!
  • ఇంతకీ ప్రధాని తన సెలవు చీటి రాస్తే… ఎవరు సాంక్షన్ చేయాలి..?
  • మరీ ఈ దరిద్రుడికి కాషాయం – యావత్ సాధుగణానికే అవమానం !!
  • ఇప్పుడు పిక్చర్ క్లియర్ ! కాళేశ్వరం మూడు బరాజులూ ప్రమాద స్థితిలోనే !!
  • ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక ! చప్పట్లు తిండి పెట్టవు !!
  • మీ పిల్లలు ప్రధానిని బూతులు తిడితే… మీరేం చేస్తారు?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions