.
కేసీయార్‌తోపాటు ఐదుగురు ముఖ్యమంత్రులకు పట్టని ఓ మానవతాసాయం అది… ఏ ప్రభుత్వమూ వాళ్లను పట్టించుకోలేదు… కానీ రేవంత్ రెడ్డి వాళ్లకు భిన్నంగా మానవీయతను కనబరిచిన అరుదైన ఉదాహరణ స్టోరీ ఇది… ఎందుకోగానీ ఏ మీడియా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు, ఎప్పటిలాగే ప్రభుత్వానికీ సరైన ప్రచారం చేసుకోవాలనే సోయి కూడా లేదు…
ఒక్కసారి 2008 లోకి వెళ్దాం… జూన్ 29… అప్పట్లో ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికి, ప్రభావం విపరీతం… ఒడిశాలో, మల్కనగిరి జిల్లా పరిధిలో కూంబింగ్ జరిపి గ్రేహౌండ్స్ బలగాలు ఓ మోటారు బోటులో తిరిగి ఏపీకి వస్తున్నాయి…
Ads
బలిమెల రిజర్వాయర్‌లోని ఇరుకైన మార్గంలో బోట్ ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న కొండలపై మాటు వేసిన మావోయిస్టులు (నక్సలైట్లు) బోట్‌పై భయంకరమైన దాడి చేశారు… లైట్ మెషిన్ గన్స్, ఆటోమేటిక్ వెపన్స్, గ్రెనేడ్లను ఉపయోగించారు… గ్రెనేడ్ల దాడితో బోట్ మునిగిపోయింది…
ఈ దాడిలో మొత్తం 38 మంది మరణించారు… వీరిలో 32 మంది గ్రేహౌండ్స్ కమాండోలు, ఐదుగురు పోలీసులు, పడవ నడిపే ఒక పౌరుడు… ఇది గ్రేహౌండ్స్ చరిత్రలో అత్యధిక ప్రాణనష్టం జరిగిన సింగిల్ దాడి…
ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… ఇది ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (AOB) ప్రాంతంలో మావోయిస్టుల బలాన్ని, వారి వ్యూహాన్ని వెల్లడి చేసింది… ఈ దాడికి ప్రతీకారంగానే ఆ తర్వాత నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేశారు…
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన జవాన్ల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు… అప్పట్లో అదే ఎక్కువ… తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మృత పరిహారాలను బాగా పెంచాయి… అంతేగాకుండా ఆ కుటుంబాల్లో సభ్యులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పాడు…
అసలు చిక్కు వాళ్లకు ప్రకటించిన ఇళ్ల స్థలాలు… ప్రభుత్వం హామీ ఇచ్చినా, దాని అమలు జాడలేదు… వైఎస్ మరణించాడు… తరువాత రోశయ్య, ఆ తరువాత కిరణ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు… ఇద్దరూ పట్టించుకోలేదు…
రాష్ట్రం విడిపోయింది… పదేళ్లు కేసీయార్ పాలన… తనెలాగూ పట్టించుకోడు కదా… కొండగట్టు బస్సు ప్రమాదంలో 50 పైచిలుకు మరణాలు సంభవిస్తేనే పరామర్శ లేదు, పట్టించుకున్నదీ లేదు, ఇక ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హామీలను నెరవేరుస్తాడా..?
అటు ఏపీలో జగన్, చంద్రబాబు పాలించారు… వాళ్లకూ పట్టలేదు… అంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఏమాత్రం పట్టించుకోని ఓ మానవతా సాయం… పైగా నక్సల్స్ వ్యతిరేక పోరులో నేలకొరిగిన అమరుల కుటుంబాలు అవి…
18 ఏళ్లు గడిచాయి… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బలిమెల దాడిలో అమరులైన పోలీసు కుటుంబాల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాడు… అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day – సందర్భంగా ఆ ప్రకటన చేశాడు…
ఆయన చేసిన ప్రకటన సారాంశం… ‘‘బలిమెల రిజర్వాయర్ దాడిలో అమరులైన 33 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు, ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను హైదరాబాద్‌లోని గాజులరామారంలో కేటాయిస్తున్నాం…’’ ఇదీ ఆయన చేసిన ప్రకటన బాపతు వీడియో లింక్… https://www.facebook.com/reel/1308704367126023
Share this Article