.
సరిగ్గా రేవంత్ రెడ్డి కోరుకున్నదీ ఇదే… ఫోన్ ట్యాపింగు మీద జనంలో విస్తృత చర్చ జరగడం, పదే పదే కేసీయార్‌పై దోషిగా ముద్రపడటం… కేసీయార్ టీమ్ మొత్తం ఆ ట్రాపులో పడిపోయింది… దానంతటదే రకెరకాల లీగల్ పాయింట్లతో జనంలో చర్చ బాగా జరగడానికి కారణమవుతోంది…
కేసీయార్ విచారణకు హాజరైతే… అందరిలాగే ‘తెలియదు, గుర్తులేదు, మరిచిపోయాను’ వంటి ఏవో నాలుగు మాటలు చెప్పేసి వస్తే ఆరోజుతో అయిపోయేది… కానీ దాన్ని సంక్లిష్టం చేస్తూ కేసీయార్ టీమ్ మైనస్ చేసుకుంటోంది… రేవంత్ రెడ్డికి తెలుసు, ఈ విచారణలు, దర్యాప్తులతో అయ్యేదేమిటో… కానిదేమిటో… కానీ తన పంథా వేరు కేసీయార్ పట్ల…
Ads
తనను జైలుపాలు చేసిన రేవంత్ రెడ్డికి కేసీయార్ మీద ఆగ్రహం సహజం… కానీ రాజకీయాల్లో ప్రతీకారాలకూ కొన్ని లెక్కలుంటాయి… అందుకని బయటికేమో కేసీయార్‌ను దేవుడే శిక్షిస్తున్నాడు, ఇంకా నేనేం శిక్షించాలి అంటాడు… కానీ ఉపేక్షించడు… వేటాడుతూనే ఉంటాడు… నువ్వు దోషివి దోషివి అని తరుముతూ ఉంటాడు… అదొక స్ట్రాటజీ… ఎస్… శిక్షించడు- ఉపేక్షించడు…

ఫోన్ ట్యాపింగ్ అరాచకం, అక్రమాల మీద విచారణ… చాలామందిని విచారించారు… చివరకు మూలవిరాట్టు విచారణే మిగిలింది… అక్కడ కొన్ని లీగల్ తకరార్లు… పోలీసులు (సిట్) ఏమంటోంది..? మేమే వస్తాం అని నోటీసు ఇచ్చింది… 65 ఏళ్లు దాటిన వారు విచారణకు స్వయంగా రాలేనని చెబితే పోలీసులే వెళ్తారు, వెళ్లాలి…
కానీ కేసీయార్ ఇల్లు ఏది..? ఫామ్ హౌజా..? నందినగర్‌లో ఇల్లా..? నందినగర్‌ను ఆయన ఎన్నికల అఫిడవిట్లలో, ఇతర అధికారిక పత్రాల్లో తన ఇల్లుగా చూపించాడు… కానీ ఫామ్ హౌజుకు రండి, అదీ ఇప్పుడు కాదు, మున్సిపల్ ఎన్నికలతో బిజీగా ఉన్నాను, తరువాత చూద్దాం అంటున్నాడు… దీంతో నథింగ్ డూయింగ్ మీ అధికారిక నివాసం నందినగర్‌లోనే విచారిస్తాం అని సిట్ అంటోంది…
కోర్టుకు పోవాలని కూడా యోచిస్తున్నారట… వెరసి ఇవన్నీ కలిసి ‘కేసీయార్ విచారణను ఎగవేయడానికి నానా తిప్పలూ పడుతున్నాడు… ఏ తప్పూ లేకపోతే ఎందుకిలా చేస్తాడు..?’ అనే ఓ నెగెటివ్ సంకేతాల్ని జనంలోకి వాళ్లంతటవాళ్లే పంపిస్తున్నారు… లీగల్ పాయింట్లను వదిలేస్తే… తనకు ఇదేమీ కొత్త కాదు కదా… కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కాలేదా..? మరి దీనికి ఎందుకింత రచ్చ చేస్తున్నట్టు..? అదే అర్థం కాదు..!!

చట్టానికి, విచారణలకు ఎవరూ అతీతులు కారు… మన రాజకీయాలకు సంబంధించే కొన్ని ఉదాహరణలు చూద్దాం…
- జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేకసార్లు CBI విచారణకు, కోర్టు విచారణకు కూడా హాజరైంది… ఆమెకు శిక్ష పడ్డప్పుడు తమిళనాడుకు ముఖ్యమంత్రి…
- 2021 లో మమతా బెనర్జీ నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఆఫీసుకు విచారణ కోసం వెళ్ళింది…
- గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2010 లో నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరయ్యాడు…
- అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే రెండు మూడు సార్లు ED విచారణను ఎదుర్కొన్నాడు….
- హేమంత సోరెన్ కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణకు హాజరయ్యాడు…
- లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే CBI కేసు ఉచ్చు బిగిసింది…
ఇవన్నీ పదవుల్లో ఉన్న సీఎంలు విచారణల్ని ఎదుర్కున్న కేసులే దాదాపు... కేసీయార్ మాజీ సీఎం...

అన్నింటికన్నా ముఖ్యంగా ఈ దేశ ప్రధానిగా పనిచేసి, దేశాన్ని ఆర్థిక దివాలా నుంచి రక్షించిన అంతటి పీవీ నరసింహారావు కూడా కోర్టు విచారణలకు హాజరయ్యాడు... విచారణలకు హాజరుగాకుండా కేసీయార్ టీమ్ చేసే ప్రయత్నాలు ఒకరకంగా రేవంత్ రెడ్డికే అవకాశం ఇచ్చినట్టు..!
‘చూశారా, విచారణ అనగానే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తప్పు చేయనప్పుడు ఎందుకు భయం..? అని దాడి చేయడానికి ట్రై చేస్తాడు… సో, ఏరకంగా చూసినా… కేసీయార్ కోణంలో చూసినా… తను నందినగర్ ఇంట్లోనైనా విచారణకు వెళ్లడం సరైన నిర్ణయం అనిపించుకుంటుంది..!!

Share this Article