.
జీవో 49… దీన్ని ఉపసంహరించుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి… ఎందుకంటే..? ఇది ఒక ప్రాంత ప్రజల, మరీ ప్రత్యేకించి వనవాసుల అభీష్టాన్ని బేషరతుగా గౌరవించడం… ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనల పట్ల సానుభూతి ప్రదర్శన… ఒక భరోసా…
ప్రభుత్వాలకు ప్రజల పట్ల ఓ కన్సర్న్ ఉండాలి… ప్రజల్ని కన్విన్స్ చేయకుండా, వాళ్లను ఇన్వాల్స్ చేయకుండా ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా అది ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహాల్ని పెంచి, సొసైటీలో అలజడిని కారణమవుతుందన్న నిజాన్ని గుర్తించి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం…
Ads
స్థూలంగా సమాజం నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది… అసలు ఏమిటి వార్త..? కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రతిపాదించిన కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ బాపతు ప్రభుత్వ ఉత్తర్వులను (జీవో 49) రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుంది… ఇదీ వార్త… మరి అసలు ఏమిటీ జీవో సారాంశం… ఏమిటీ ఆ రిజర్వ్..?
అసలు ఏమిటి ఈ కారిడార్?
ఈ ప్రతిపాదిత కన్జర్వేషన్ రిజర్వ్ 1493 చదరపు కిలోమీటర్లు (149289 హెక్టార్లు… లక్షన్నర హెక్టార్లు…) విస్తరించి ఉంది… ఇది ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్‌లలోని కేరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్, కౌటాల, బెజ్జూర్, కాగజ్‌నగర్, రెబ్బన, దహెగావ్, తిర్యాని మండలాల్లోని 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను కలుపుతుంది… వీటిలో గార్లపేట్, అడ, మానికగఢ్ తూర్పు, మానికగఢ్ పశ్చిమ, దనోరా, గూడెం, బెజ్జూర్, కదంబ, గిరాలి వంటి అటవీ ప్రాంతాలు ఉన్నాయి…
ఇది తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యం మహారాష్ట్రలోని తాడోబా, కన్హర్‌గావ్, టిపేశ్వర్, చాపరాల వన్యప్రాణి అభయారణ్యాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌తో కలిపే కీలకమైన వన్యప్రాణి కారిడార్…
నిజానికి అతి పెద్ద పులుల సంరక్షణ జోన్‌గా చెబుతున్నా సరే… ఈ ప్రాంతంలో పులులే కాదు, చిరుతలు, అడవి కుక్క, ఎలుగుబంటి, తోడేలు, హైనా, తేనె బ్యాడ్జర్, అడవి పిల్లి వంటిజంతుజాతులకు నిలయం. అలాగే గౌర్, సాంబార్, నీల్‌గాయ్, చిరుత, నాలుగు కొమ్ముల జింక, ముంట్జాక్, ఇండియన్ గజెల్ వంటి అనేక రకాల జంతువులకు కూడా ఆశ్రయం…
240కి పైగా పక్షి జాతులు ఇక్కడ నివసిస్తున్నాయి, వాటిలో మలబార్ పైడ్ హార్న్‌బిల్స్, పొడవైన ముక్కు గల రాబందులు కూడా ఉన్నాయి… వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 36(A) ప్రకారం ఈ కన్జర్వేషన్ కాారిడార్ ఏర్పాటు చేయొచ్చు… కానీ..?
కేసీయార్ హయాంలోనే బీజం
అభయారణ్యాలకు సంబంధించి, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి, అటవీ సంపదల రక్షణకు సంబంధించి… వనవాసులను ఇన్వాల్వ్ చేస్తేనే ఆ ప్రభుత్వ ఆలోచనకు సరైన ఆచరణ అవుతుంది, ఫలితాలను ఇస్తుంది… కానీ 2016లో కేసీయార్ ప్రభుత్వం చేసిన ఈ కన్జర్వేషన్ ఆ ప్రాంత ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని, ఆందోళనను రేకెత్తించింది… (కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టును కేటీయార్ పేరుతో పిలిచేది కేసీయార్ మీడియా)…
దాన్ని కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు… వరుస భేటీలు, నిర్ణయాలు అదే దిశలో సాగిపోయాయి… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అటవీ శాఖ అధికారులు అదే దిశలో ప్రొసీడింగ్స్ అమలు చేస్తూ, ఈ జీవో రిలీజ్ చేశారు… దాంతో ఆదివాసీ, గిరిజన సమూహాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం ప్రబలింది…
దాదాపు 300కు పైగా ఆవాసాలు ఎఫెక్టవుతాయి… అటవీ అధికారుల పెత్తనాలు, దాష్టీకాలు వాళ్లకు తెలుసు… క్రమేపీ ఇక తమ ఆవాసాల నుంచి, తమను తమ అటవీ తల్లి ఒడి నుంచి దూరం చేస్తారనీ, బయటికి పంపించేస్తారనీ వాళ్ల ఆందోళన… బంద్‌లు, ప్రదర్శనలు పెరిగాయి… జనంలో అసహనం ప్రబలుతోంది…
మంత్రి సీతక్క కొంత చొరవ తీసుకుని, తోటి మంత్రులు సురేఖ, జూపల్లిలతో కలిసి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది… రేవంత్ రెడ్డి వెంటనే సదరు జీవో అమలును నిలిపివేయాలని అటవీశాఖను ఆదేశించాడు… ఇది అడవి బిడ్డల విజయమే… వాళ్ల అభీష్టాన్ని, ఆందోళనను ప్రభుత్వం గుర్తించడం కూడా..!!
చివరగా… ప్రస్తుతం ఏ ఆంక్షలు, నిషేధాలు లేకపోయినా సరే… అక్కడ పులులు తిరుగుతున్నాయి, ఒక్క పులీ వేటాడబడలేదు, అరుదైన వన్యప్రాణుల వేట కూడా నమోదు కావడం లేదు కదా… స్థానిక సమూహాల సహకారంతో ఆ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అమలు చేస్తే సరిపోదా..? పూర్తిగా నిర్మానుష్యం చేయాలా..?!
Share this Article