ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… రేవంత్ కథను సినిమా తీస్తే సూపర్ హిట్ అట… అదే హెడ్డింగ్… జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దశరథరెడ్డి ఏదో అభినందన బాపతు మీటింగులో చెప్పాడట అలా… ‘రేవంత్ ఈ సంస్థలో చదవాలని మూడుసార్లు ఎంట్రన్స్ రాశాడు, ఓసారి 8వ ర్యాంకు వచ్చినా సీటు రాలేదు, రాకపోవడమే మంచిగైంది’ అని ఏదేదో చెబుతూ పోయాడాయన…
ఒక కళాకారుడు సీఎం కావడం అద్భుతమని మరొకాయన అన్నాడట… రేవంత్‌లో కళాకారుడు ఎవరబ్బా అనుకుంటుంటే తను మొదట్లో పెయింటర్ కదాని గుర్తొచ్చింది… ఓహ్, అలా ఓన్ చేసుకుంటున్నారా..? సరే సరే… అప్పుడెప్పుడో సంఘ్‌లో ఉన్నప్పుడు జాగృతికి రిపోర్టర్… ఇంకేం..? మా కులమే అని జర్నలిస్టులు ఓన్ చేసుకుంటున్నారు… గుడ్… మావాడే అని తెలుగుదేశం శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి… సో, కమ్మలు కూడా మాకు కావల్సినోడే అంటున్నారు… రెడ్లు సరేసరి… గతంలో మావాడే అని సంఘ్ చెప్పుకోవచ్చు… అన్నట్టు, కొన్నాళ్లు టీఆర్ఎస్‌లో కూడా చేసినట్టు గుర్తు… సో, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ అందరికీ కావల్సినోడే… మరి సీఎం కుర్చీ మీద కూర్చున్నాక అందరికీ ‘‘మావాడు’’ అయిపోతాడు కదా…
ఐతే రేవంత్ కథను సినిమా తీస్తే సూపర్ హిట్ గ్యారంటీ అంటూ సదరు కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చాడో తెలియదు, రేవంతూ వెంటనే ఆ పని కాస్త చూసుకో అని హింట్ ఇస్తున్నాడా..? ఐనా నేను రేవంత్ బయోపిక్ తీస్తాను అని ది గ్రేట్ యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఆల్‌రెడీ ప్రకటించాడు కదా… తనే హీరోగా చేస్తాడా లేదా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు…
Ads
వోకే… ఓ పెయింటర్‌గా, ఓ జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన ఓ మధ్యతరగతి ఇంటి మనిషి… ఎదిగీ ఎదిగీ సీఎం కుర్చీలో పాగా వేయడం మామూలు విషయమేమీ కాదు, పెద్ద సక్సెస్ స్టోరీ… సినిమా కథకు అవసరమైన మసాలా ఉన్న కథే… తన జీవితంలో లవ్ స్టోరీ ఉంది, పెద్దలను ఎదిరించి, ఆనక ఒప్పించి పెళ్లి చేసుకున్న ట్రాక్ ఉంది… కేసు పాలై జైలుకెళ్లిన ఎపిసోడ్లున్నయ్… జైలులో నిద్ర లేని రాత్రిళ్లలో పదును పెట్టుకున్న పగ ఉంది… ఓ సినిమా కథకు అవసరమైన ట్విస్టులు కూడా అన్నీ ఉన్నయ్…
ఎటొచ్చీ ఈ సినిమా ఎవరు తీయాలి..? కొంపదీసి అదే రామగోపాలవర్మ ‘‘నేను తీస్తా’’ అని వస్తాడేమోనని సగటు రేవంత్ అభిమానికి భయం… బాబ్బాబు, అంత పని మాత్రం చేయకు, ఆ వర్మకు మాత్రం అప్పగించకు, కాకపోతే మీ మంత్రివర్గ సభ్యురాలు కొండా సురేఖను అడగండి, వర్మ బాపతు పైత్యం ఏమిటో చెబుతుంది అంటూ రేవంత్‌కు సూచనలు చేస్తున్నారు… నిజమే, బయోపిక్స్ వీలైనంతగా చెడగొట్టడంలో వర్మను మించిన వాళ్లు లేరు ప్రస్తుతానికి…
ఫాఫం, కొండా మురళి బయోపిక్ తీస్తే చూసినవాళ్లు లేరు… ఫాఫం, జగన్‌కు ఎవరు సజెస్ట్ చేశారో ఏమో గానీ… తన రాజకీయ ప్రస్థానం మీద, చంద్రబాబు విలన్‌గా ఏకంగా రెండు పార్టుల బయోపిక్ తీయించుకుంటున్నాడు… ఇప్పుడు రేవంత్ బయోపిక్ గనుక పొరపాటున వర్మ చేతుల్లో పడితే ‘‘వెలమ దొర గడీపై పాలమూరు రెడ్డి జెండా అని టైటిల్ పెడతాడేమో… నిజం చెప్పాలంటే… బయోపిక్కులు, ఆటోబయోగ్రఫీలు కాదు, ఒక నాయకుడి యశస్సు వెలిగేది తను చేసే పనులతో, తీసుకునే నిర్ణయాలతో… సాధించే విజయాలతో..!! అంతటి ఎన్టీయార్ మీద రెండు పార్టులు తీస్తే, అదీ సొంత కొడుకే తీస్తే… ఎవరూ చూడలేదు…!!
Share this Article