Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…

November 1, 2025 by M S R

.

గత పుష్కరకాలంగా తెలంగాణ రాజకీయాల్ని నిశితంగా గమనించే పొలిటికల్ అనలిస్టులకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే..? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల స్ట్రాటజీ కొత్తగా ఉంది, గతంలో లోపించిన వ్యూహరచన ఏదో ఇప్పుడు కనిపిస్తోంది…

గతంలో… పదేళ్లపైచిలుకు రాజకీయాల్లో ఉపఎన్నిక వచ్చిందంటే చాలు… కేసీయార్ బుర్ర పదునుగా పనిచేసేది… ఎప్పటికెయ్యది అన్నట్టు స్థానం, సందర్భాన్ని బట్టి కొన్ని ఎన్నికల ఎత్తుగడలు ప్రయోగించేవాడు, ఫలితంగా పోటీకి ముందే కాంగ్రెస్ చేతులెత్తేసేది… కానీ ఇప్పుడు సీన్ రివర్స్…

Ads

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుబిలీ హిల్స్ ఉపఎన్నికకు వ్యూహాత్మకంగా వెళ్తున్న తీరు కాంగ్రెస్ రాజకీయాలు తెలిసినవాళ్లకు కొత్గగా ఉంది… స్ట్రాటజిక్‌గా ఉంది… అది మునుపు లేనిది… ఎస్, రేవంత్ రెడ్డికి ఈ విజయం అవసరం… ఇంటా బయటా తను స్థిరపడాలంటే ఈ ఉపఎన్నిక ఫలితం తనకు అనుకూలంగా రావాలి…

నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే… తన స్ట్రాటజీ అర్థమవుతుంది…

1) ఈ స్థానంలో ముస్లింల వోట్లు కీలకం… మజ్లిస్ అనధికారికమో అధికారికమో కాంగ్రెస్‌కు సపోర్టు… క్లియర్, అదసలు పోటీలో లేకుండా తప్పుకుంది దీనికోసమే… ఐనా చాన్స్ తీసుకోదలుచుకోలేదు రేవంత్ రెడ్డి… తెలివిగా అజారుద్దీన్‌ను తెరపైకి తీసుకొచ్చాడు హఠాత్తుగా… మంత్రిని చేశాడు… అఫ్‌కోర్స్, హైకమాండ్‌నూ ప్లీజ్ చేసే నిర్ణయమే… ఖబరిస్థాన్‌‌కు భూమి కేటాయింపు ఎట్సెట్రా ప్రకటించాడు…

2) ఇక్కడ సెటిలర్ల వోట్లు, అందులోనూ కమ్మ వోట్లు ఎక్కువ… మరణించిన మాగంటి గోపీనాథ్‌ను బలంగా నిలబెట్టినవి ఆ వోట్లే… అందుకే కేసీయార్ గోపీనాథ్ భార్య సునీతకు టికెట్టు ఇచ్చాడు… కమ్మ ప్లస్ సానుభూతి కలిసొస్తుందని ఆశ… దీనికి రేవంత్ రెడ్డి మార్క్ కౌంటర్  ఏమిటంటే..? కమ్మ సంఘాల మీటింగులు పెట్టి సపోర్ట్ సాధించడం… మైత్రివనంలో ఎన్టీయార్ విగ్రహం పెట్టి, తనే ఆవిష్కరిస్తానంటున్నాడు… దీనివల్ల కమ్మ వోట్లు నిలువునా చీలిపోవడం పక్కా… ఇతర సెటిల్డ్ కులాల్లో పెద్దగా కేసీయార్ పట్ల ఆదరణ లేదు…

3) మరి మరణించిన నాయకుడి పట్ల సానుభూతిని బ్రేక్ చేయడం ఎలా..? పీజేఆర్ పేరు తీసుకొచ్చాడు… ఈ స్థానంలో పీజేఆర్ పట్ల పేద, మధ్యతరగతిలో ఆదరణ ఉంది ఇప్పటికీ… నాడు పీజేఆర్ మరణిస్తే, టీడీపీ, బీజేపీ ఏకగ్రీవం చేయడానికి ముందుకొచ్చినా సరే, కేసీయారే పీజేఆర్ కుటుంబానికి ద్రోహం చేస్తూ తన పార్టీ అభ్యర్థిని పెట్టాడని ప్రసంగంలో ప్రస్తావించాడు… ట్రిపుల్ అటాక్, 1) పీజేఆర్ పేరు వాడుకోవడం 2) మాగంటి సానుభూతికి గండి కొట్టడం 3) కేసీయార్ అవకాశవాదాన్ని ఎండగట్టడం…

4) ఇక్కడ సినీ కార్మికుల వోట్లు ఎక్కువ… అందుకే వాళ్లతో మీటింగు పెట్టాడు… 10 కోట్లు ఇస్తానన్నాడు… మీకు అదనపు ఆదాయంలో 20 శాతం వాటా ఇస్తేనే ఇకపై టికెట్ రేట్లను పెంచుతాను అన్నాడు… వాళ్లకు కనెక్ట్ కావడం… బీఆర్ఎస్‌కు ఈ వ్యూహాలు అంతుపట్టడం లేదు… ఎప్పటిలాగే కాంగ్రెస్ నాన్-స్ట్రాటజీ ధోరణితో వెళ్తుంది, ఉపఎన్నికను కొట్టేయవచ్చు అనుకుంది… అందుకే కాంగ్రెస్ పోకడ జీర్ణం కావడం లేదు దానికి…

5) ఇక్కడ బీసీ వోట్లు ఎక్కువ… మాగంటి సునీత అగ్రవర్ణం… కమ్మ… బీజేపీ అభ్యర్థి మరో అగ్రవర్ణం… రెడ్డి… కాంగ్రెస్ అభ్యర్థి బీసీ… యాదవ్… ఇక్కడ యాదవ నేతలదే ఆధిపత్యం… పోయి పోయి మాజీ మంత్రి శ్రీనివాస యాదవ్ కుటుంబసభ్యుడినే కాంగ్రెస్ తన అభ్యర్థిగా పెట్టింది, పక్కా లోకల్ తను… ఆంధ్రా మూలాలున్నవాడు కాదు… అదొక అడ్వాంటేజ్… శ్రీనివాసయాదవ్ బాపతు వోట్లు కూడా క్రాస్ అయ్యే చాన్స్ పుష్కలం…

6) బీఆర్ఎస్, బీజేపీ రహస్య దోస్తీ అంటూ… తప్పదు కాబట్టి బీజేపీ మీద సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నాడు గానీ రేవంత్ రెడ్డి ఇక్కడ బీజేపీని అసలు పోటీదారుగానే భావించడం లేదు… అఫ్‌కోర్స్, బీజేపీలోనే బాగా నిర్లిప్తత కనిపిస్తోంది…

7) అవునూ, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచార బరిలోకి దిగాడు… మరి మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ ప్రచారానికి వస్తాడా..? తనిప్పుడు యాక్టివ్ ప్రజాజీవితంలోనే లేడు… స్టార్ క్యాంపెయినరే కానీ కదలడు… రెండేళ్లుగా చూస్తున్నదే కదా… అదీ బీఆర్ఎస్‌కు మైనసే… తండ్రి మరణంతో హరీష్ రావు ప్రచారంలో అనివార్యంగా తగ్గాల్సి వచ్చింది… కేటీయార్ ఒక్కడే దిక్కు…

8) నవీన్ యాదవ్‌ను రౌడీ అని ప్రచారం చేసే బీఆర్ఎస్ తనే పోక్సో కేసు సహా బోలెడు క్రిమినల్ రికార్డున్న ఓ మైనారిటీ నాయకుడిని నెత్తిన పెట్టుకుంది… దాంతో బీఆర్ఎస్‌కు మరింత మైనస్… తనతో మైనారిటీ వోట్లు వచ్చే ఆశ పెద్దగా ఫలించకపోవచ్చు…

9) బీఆర్ఎస్‌కు వోటేస్తే, ఆ పార్టీ గెలిస్తే… అది పుంజుకుంటే… కాంగ్రెస్ ఇస్తున్న ఫ్రీ కరెంటు, సన్నబియ్యం, ఫ్రీ బస్సు వంటివన్నీ కోల్పోవాల్సి వస్తుందని స్ట్రెయిటుగా జనానికి చెప్పడం మరో ఎత్తుగడ… సీఎం ప్రసంగంలో అదీ చోటుచేసుకుంది అందుకే…

10) బీఆర్ఎస్ అభ్యర్థి మహిళ కదా… మహిళల వోట్లు అటు పడకుండా… కేసీయార్ కవితను సస్పెండ్ చేయడం, ఆడబిడ్డను బయటికి పంపించి వేధిస్తున్నారని ప్రస్తావిస్తున్నాడు రేవంత్ రెడ్డి… అంతేకాదు, తన హయాంలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వని వైనాన్ని చెబుతూ, తాను సురేఖ, సీతక్కలను కేబినెట్‌లో తీసుకుని సముచిత స్థానం ఇచ్చానని గుర్తుచేస్తున్నాడు… సొంత బిడ్డే కేసీయార్ కుటుంబసభ్యులను దొంగలు అంటోంది అని పదే పదే చెప్పడం కూడా ఓ ఎత్తుగడే…

ఇవన్నీ సరే… ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందా..? ఇది నగరం, పోలింగ్ ఎప్పుడూ తక్కువ… నగరజీవి అంత త్వరగా అంతుచిక్కడు… ఇది క్రికెట్‌లో వన్డే, టీ20 మ్యాచ్ టైపు… కానీ కాంగ్రెస్ వెళ్తున్న స్ట్రాటజిక్ బాట మాత్రం కొత్తగా ఉంది… పకడ్బందీగా ఉంది… అది చెప్పదగిన విశేషం..!!

చివరగా… పాకిస్థాన్ మనల్ని ము- మీద తన్నింది, ఐనా భారత్ స్పందించలేదు అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్య మాత్రం మరీ నాసిరకం, అభ్యంతరకరం… సీఎం బలహీనతల్లో ఒకటి, నాలుకపై అదుపు లేకపోవడం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions