.
Mohammed Rafee…. చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి… అనూహ్యంగా ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా
జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి… సర్‌ప్రయిజ్…
రేవంత్ రెడ్డి మాట అసలు కాంగ్రెస్‌లో చెల్లుబాటు కావడం లేదని కాంగ్రెస్ ప్రత్యర్థులు పదే పదే ప్రచారం చేస్తున్నారు కదా... కానీ తను ఏకంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపాదించాడు, వోకే చేయించుకున్నాడు... అదీ విశేషం...
Ads
గెలుపో ఓటమో జానేదేవ్… ఉపరాష్ట్రపతి పోస్టును ఎన్డీయేకు ఏకపక్షంగా అప్పగించేందుకు ఇండియా కూటమి సిద్ధంగా లేదనేది ఈ ఎంపికతో స్పష్టమైంది… పోరు రసవత్తరం కాబోతోంది…
NDA కూటమి అభ్యర్థి తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎన్నిక లాంఛనమే అనుకున్న సమయంలో ఇండియా కూటమి ఎత్తుగడల్లో భాగంగా తెలంగాణ అభ్యర్థిని రంగంలోకి దించింది! డీఎంకే రాజ్యసభ్య సభ్యుడు తిరుచ్చి రవిని ఎంపిక చేయాలని ఇండి కూటమి ఆలోచిస్తున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి… కానీ చివరకు అనూహ్యంగా పొలిటికల్ అఫిలియేషన్లు ఏమీ లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి ప్రవేశించారు.
బి. సుదర్శన్ రెడ్డి 2007 నుంచి 2011 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. గోవా లోకాయుక్త తొలి చైర్మన్ గా సేవలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బీట్రేషన్ మధ్యవర్తిత్వ కేంద్రం శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, ఆకుల మైలారం గ్రామం ఆయన స్వస్థలం! ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో న్యాయవాదిగా ప్రారంభించి 1988లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 1993లో హైకోర్టు అదనపు న్యాయమూర్తి అయ్యారు. తరువాత గౌహతి న్యాయమూర్తిగా అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కొనసాగి పదవీ విరమణ పొందారు.
రాజ్యాంగ సమస్యలపై ఆయన ఇచ్చిన తీర్పులు ఎన్నో సంచలనం అయ్యాయి! నల్ల ధనం కేసులను తూర్పారబట్టారు! మానవ హక్కుల కోసం తన స్వరం వినిపిస్తూ వచ్చారు. మావోయిస్టులను పట్టుకునేందుకు ఛత్తిస్ ఘడ్ ప్రభుత్వం ట్రైబల్స్ తో సల్వాజుడుం ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. హైదరాబాద్ కేంద్రంగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు!
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు అనివార్యమైంది! రెండు కూటములు దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులనే ఖరారు చేశాయి! బిజెపికి మానవ హక్కుల నేత మధ్య జరుగుతున్న ఎన్నికలు అని రాహుల్ గాంధీ ప్రకటించారు! సుదర్శన్ రెడ్డి గెలుస్తారని కాదు కానీ, మొత్తానికి ఒక పోటీ వాతావరణం తీసుకొచ్చారు!
గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది! వైసీపీ ఇప్పుడు ఎటు నిలబడుతుందో తేలుతుంది! బిజెపి వైపు మొగ్గు చూపుతుందా? తెలుగు తేజం సుదర్శన్ రెడ్డి వైపు నిలబడుతుందా అనేది తెలుస్తుంది! – డా. మహ్మద్ రఫీ
Share this Article