.
నో డౌట్… మన ప్రజాప్రతినిధులు, మన నాయకుల మీద ఉన్న కేసులు, ఆస్తిపాస్తుల వివరాలను విశ్లేషిస్తూ, క్రోడీకరిస్తూ… వయస్సు, చదువు తదితర అంశాలను సమీక్షిస్తూ ఏడీఆర్ (Association for Democratic Reforms) తరచూ రిపోర్టులు వెలువరిస్తూ ఉంటుంది… సత్సంకల్పం, సదాచరణ…
ఐతే… ఆ రిపోర్టులను బట్టి మన నేతల్ని పూర్తిగా, సరిగ్గా అంచనా వేయలేం… కాకపోతే ఎవరో ఒకరు ఏదో ఓ ప్రామాణిక అంశాల్ని బట్టి బేరేజు వేస్తూ చెప్పేవాళ్లు ఉండటం మంచిదే… నిన్న ఏడీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రుల కేసులు, ఆస్తులు, అప్పులు, చదువు, వయస్సు ఎట్సెట్రా అంశాల్ని క్రోడీకరించింది… కేసులు, ఆస్తుల వివరాలను ఆయా నేతలు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లనే ఆధారంగా చేసుకుంది…
Ads
ప్రతి మీడియా ఆ రిపోర్టులను తమ ఆలోచనలకు అనుకూలంగా వాడుకుంటూ ప్రత్యేక కథనాలను చేసుకున్నాయి… వాటి రాజకీయ ధోరణులు, అవసరాలు, అవకాశాలను బట్టి..! ఉదాహరణకు… నమస్తే తెలంగాణ క్రిమినల్ కేసుల్లో రేవంత్ నంబర్ వన్ అని హెడింగ్ పెట్టి ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేసింది…
మన ముఖ్యమంత్రి పెద్ద క్రిమినల్ తెలుసా అనే భావనను సొసైటీలోకి బలంగా ఇంజక్ట్ చేయడం ఆ ప్రయత్నం… నిజమే, 89 కేసులున్నయ్… అందులో 72 సీరియస్ కేసులు… కిడ్నాప్, హత్యాయత్నం వంటివీ ఉన్నాయి… తను నిష్కళంకుడేమీ కాదు, స్వాతిముత్యం కూడా కాదు సరే…
కానీ… ముఖ్యమంత్రులనే ఈ సమీక్షకు తీసుకున్నారు కాబట్టి మిగతా తెలంగాణ నేతల మీద కేసులు ఈ జాబితాలోకి రాలేదు, రావు… రాష్ట్రాలవారీగా నేతలు, మాజీ ప్రజాప్రతినిధులనూ తీసుకుని బేరీజు వేస్తే ఇంకో దృశ్యం కనిపించేది… ఎందుకంటే, కేసీయార్, బండి సంజయ్, కేటీయార్, హరీష్, కవిత తదితరులతో పోలిక స్పష్టంగా ఉండేది…
పైగా ఈ కేసుల్లో రేవంత్ దోషిగా నిరూపించబడ్డాడా..? లేదు… శిక్ష విధింపు తీర్పు గనుక వచ్చి ఉంటే ఎమ్మెల్యే పోస్టు, దరిమిలా సీఎం పోస్టు ఎగిరిపోయేవి… పైగా ఈ కేసులు ఎప్పుడు పెట్టబడ్డాయి..? ఏ ఉద్దేశంతో పెట్టబడ్డాయి అనేదీ ముఖ్యమే… 89 కేసుల్లో దాదాపు 75- 80 వరకూ కేసీయార్ హయాంలోనే పెట్టబడినట్టు ఆ వివరాల్లో కనిపిస్తోంది…
ఒక సెక్షన్ మీడియా నిష్కళంకుడిగా పదే పదే చిత్రించే చంద్రబాబు మీద కూడా కేసులున్నాయి… అంటే తనను కూడా క్రిమినల్ లీడర్ అనాలా…? ఇప్పుడు సీఎం కాదు గానీ జగన్ మీద ఉన్న కేసులు పదే పదే వార్తల్లోకి వచ్చి అందరికీ తెలిసినవే కదా… స్టాలిన్ ది ఈ క్రిమినల్ కేసుల్లో రెండో ప్లేసు…
ఆస్తుల విషయానికి వస్తే చంద్రబాబు 931 కోట్లతో నంబర్ వన్… సరే, రెండెకరాల ఆసామీ ఈ స్థాయికి ఎలా వచ్చాడని సాక్షి రాసుకోవచ్చుగాక… కానీ అసలు ఆస్తుల పరిమాణం ఎన్ని వేల కోట్లో తెలియాలంటే ఆ కుటుంబం మొత్తం ఆస్తులు, వాటి మార్కెట్ విలువలు లెక్కలోకి రావాలి… (లీడర్ అండ్ స్పౌజ్ మాత్రమే కాదు)… బినామీ ఆస్తుల విలువ సరేసరి, ఐటీ లెక్కల్లోకి, స్టాక్ మార్కెట్ లెక్కల్లోకి వచ్చేవి మాత్రమే తీసుకుంటే అసలు సంపద పరిగణనలోకి రాదు…
ఉదాహరణకు… మమత బెనర్జీ ఆస్తుల విలువ 15 లక్షలేనట… అఫ్‌కోర్స్, ఆమె నిరాడంబరంగానే కనిపిస్తుంది కానీ ఆమె సంపద తెలియాలంటే మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య ఆస్తుల వివరాలు కూడా కలపాలి… స్టాలిన్ కుటుంబం ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు… కానీ ఈ లెక్కల్లో జస్ట్ ఏడెనిమిది కోట్లు, సమానంగా అప్పులు కనిపిస్తాయి ఈ జాబితాల్లో…
ఒమర్ అబ్దుల్లా 55 లక్షలే… నమ్మబుల్ కాదు… దశాబ్దాలపాటు కాశ్మీర్‌ను సొంత దేశంగా పాలించిన కుటుంబం అది… ఆస్తుల్లో సెకండ్ పెమా ఖండూ 330 కోట్లు ఆస్తి ఉంటే… 180 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి… మరి నికర ఆస్తి విలువ..? ఏడెనిమిది మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ కోటీకోటిన్నర లోపే… సో, ఏడీఆర్ నివేదికలు సమగ్ర దృశ్య చిత్రాలేమీ కావు..! అవి అధికారికంగా చూపబడినవే తప్ప అసలు నిజాలు కావు..!!
Share this Article