.
సాక్షాత్తూ కేంద్రమే కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లలో కొట్టుకుపోయింది అని చెబుతోంది కదా… పఢావు పడిన ఆ మూడు బరాజులను వినియోగంలోకి తీసుకురావడం ఓ పే-ద్ద చిక్కుముడిలా మారుతోంది తెలంగాణ ప్రభుత్వానికి… ఏమో, రేవంత్ రెడ్డి ఓ కొరడా పట్టుకుని ఏదైనా స్థిరనిర్ణయం తీసుకుంటే గానీ, ఈ చిక్కుముడి వీడేట్లు లేదు…
కేసీయార్ ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వానికి ఎటూ అడుగువేయలేని దుస్థితి నెలకొంది… ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలు, నాసిరకం, అడ్డదిడ్డం డిజైన్లు.., చివరకు ఆ నిర్మాణ సంస్థలు సైతం మొరాయిస్తున్నాయి…
Ads
- మెట్రో విస్తరణకు మోకాలడ్డిన ఎల్అండ్‌టీని ఎలాగైతే రేవంత్ రెడ్డి ధైర్యంగా వదిలించుకున్నాడో, సేమ్, అదే సంస్థపై కాళేశ్వరం రిపేర్లకు సంబంధించి కొరడా పట్టుకోవాల్సిన సిట్యుయేషన్ ఏర్పడుతోంది… అనివార్యంగా రేవంత్ రెడ్డిని ఆ నిర్ణయాల వైపు ఎల్‌అండ్‌టీయే నెట్టేస్తోంది…
2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బరాజు ఏడో బ్లాక్ కుంగిపోయిన నాటి నుండి మొదలైన సమస్యలు, నేటికీ ఓ కొలిక్కి రావడం లేదు… పునరుద్ధరణ పనుల కంటే, అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకునే ‘జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్’ ప్రక్రియే ఇప్పుడు ప్రభుత్వానికి, ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది… అంటే చికిత్స కాదు, రోగనిర్దారణకే చాలా కాలం పట్టేట్టుంది…
బోర్ హోల్స్ తవ్వకం: ఒక నత్తనడక ప్రయాణం … నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సూచనల మేరకు మూడు బరాజుల వద్ద దాదాపు 500 బోర్ హోల్స్ తవ్వాల్సి ఉంది… అయితే, ఈ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది…
-
సమయ పీడనం…: ఒక్కో బోర్ హోల్ తవ్వడానికి కనీసం 5 రోజుల సమయం పడుతోంది… 25 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉండటంతో, మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడానికే ఏడాదిన్నర పట్టేలా ఉంది…
-
రాఫ్ట్ దెబ్బతినే ప్రమాదం..: రీయిన్‌ఫోర్స్డ్ రాఫ్ట్ (పునాది పలక) దెబ్బతినకుండా బోర్ హోల్స్ వేయడం కత్తిమీద సాములా మారింది… ఏ మాత్రం తొందరపడినా ఉన్న పునాది మరింత బలహీనపడే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు…
ACSA వర్సెస్ NDSA: విరుద్ధమైన సూచనలు.. పెరిగిన గందరగోళం … ఇటీవల జలసౌధలో జరిగిన సమీక్షా సమావేశంలో ACSA (Advisory Committee on Sinking of Annaram and Medigadda) చైర్మన్ అనిల్ జైన్ చేసిన సూచనలు అధికారులను విస్మయానికి గురిచేశాయి…
-
అనిల్ జైన్ సూచన…: “అన్ని చోట్లా బోర్ హోల్స్ వేస్తూ కాలయాపన చేసే బదులు, కుంగిన 7వ బ్లాక్ వద్ద మాత్రమే తవ్వకాలు జరిపి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా” అని ఆయన ప్రతిపాదించాడు… ఇది సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ‘టార్గెటెడ్ అప్రోచ్’ అని ఆయన భావిస్తున్నాడు…
-
NDSA నివేదిక…: దీనికి భిన్నంగా, NDSA తన తుది నివేదికలో మూడు బరాజుల్లోని అన్ని గేట్ల వద్ద క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది…
-
అధికారుల ఆందోళన…: కమిటీ చైర్మన్ ఒకలా, నేషనల్ అథారిటీ మరోలా చెబుతుండటంతో అధికారులు అయోమయంలో పడ్డారు… ఒక బ్లాక్ డేటాతో మొత్తం బరాజు రిపేర్ డిజైన్లు చేయడం అసాధ్యమని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు….
- కేవలం ఒక్క బ్లాక్ వద్ద తవ్విన డేటాతో మిగిలిన 84 గేట్ల వద్ద పరిస్థితిని అంచనా వేయడం శాస్త్రీయంగా తప్పవుతుంది… ఒకవేళ భవిష్యత్తులో వేరే బ్లాక్ వద్ద సమస్య వస్తే, “అప్పుడు ఎందుకు టెస్ట్ చేయలేదు?” అనే ప్రశ్న వస్తుంది… కాబట్టి అధికారుల కన్ఫ్యూజన్ వందకు వంద శాతం సమంజసం…
వేల కోట్ల ఖర్చు.. మొండికేస్తున్న నిర్మాణ సంస్థలు … రిపేర్ల ఖర్చు ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారింది… మూడు బరాజుల పునరుద్ధరణకు దాదాపు రూ. 1,000 నుండి రూ. 1,200 కోట్లు ఖర్చవుతాయని అంచనా… ఇందులో ఒక్క మేడిగడ్డకే రూ. 700 కోట్లు అవసరం…
-
ఏజెన్సీల మొండితనం…: డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ (DLP) లోనే నష్టం జరిగింది కాబట్టి నిర్మాణ సంస్థలే రిపేర్లు చేయాలని ప్రభుత్వం కోరుతోంది… ప్రతి నెలా లేఖలు రాస్తున్నా, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు కొత్త అగ్రిమెంట్ కోరుతూ మొండికేస్తున్నాయి…
-
కఠిన చర్యల హెచ్చరిక…: రిపేర్లు చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు… అందుకే ఇక సీఎం ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సిట్యుయేషన్ ఇప్పుడు… పోనీ, ఎల్అండ్‌టీని బ్లాక్ లిస్టు చేస్తే, క్రిమినల్ కేసు నమోదు చేస్తు… సంస్థ క్రెడిబులిటీ ఘోరంగా దెబ్బతింటుంది కాబట్టి దిగివచ్చే అవకాశం ఉంటుందేమో..!!
వచ్చే వర్షాకాలం లోపు కనీసం తాత్కాలిక రక్షణ చర్యలైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది… కానీ, నిపుణుల కమిటీల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక జాప్యం, నిర్మాణ సంస్థల సహాయ నిరాకరణ వెరసి… కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ ఎండమావిలాగే కనిపిస్తోంది… ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి…
Share this Article