అన్నీ నిజాలే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిన కొత్త పలుకులోని అంశాలు, అభిప్రాయాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నవే… ఏడాది గాక మునుపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది జనంలో… సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకతతో ‘ఆ కేసీయారే నయం’ అనే తరహాలో బీఆర్ఎస్ పుంజుకుంటోంది…
బీజేపీకి సరైన సారథి లేడు… కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను కూడా అది అందిపుచ్చుకోలేకపోతోంది… అదే పాత నాయకత్వం… ఊదు కాలదు, పీరు లేవదు… బీఆర్ఎస్‌కు ఇప్పటికిప్పుడు మళ్లీ జనం పుష్కలంగా వోట్లేసి నెత్తిన పెట్టుకునేంత సీన్ రాకపోవచ్చు, కానీ ఓటమి నాటి పరిస్థితులతో పోలిస్తే మెరుగుపడింది…
కేసీయార్ ఫామ్ హౌజు దాటి రానంటున్నా… కేటీయార్, హరీష్‌రావు అన్నీ తామై ఎంతోకొంత పార్టీ మరింత మునిగిపోకుండా కాపాడుతున్నారు… మరోవైపు రేవంత్ రెడ్డికేమో చుట్టూ బంధనాలు… ప్రతి దానికీ హైకమాండ్ షరతులు, పగ్గాలు.,. మంత్రుల శాఖలపై పట్టు లేదు, పట్టలేడు… అసలే దివాలా తీసిన ఖజానా, పైగా ఎన్నికల్లో ఇచ్చిన అలవిమాలిన హామీలు…
Ads
ఈ స్థితిలో లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణ అట… దానికోసం పేదల ఇళ్లపై హైడ్రా బుల్డోజర్ల ఉరుములు… కేటీయార్ జన్వాడ ఫామ్‌హౌజ్ సహా ఒక్కసారి ట్రిపుల్ 111 జీవో పరిధిలో కట్టబడిన వందల నిర్మాణాలు, ఇతర నీటివనరుల ఎఫ్‌టీఎల్ పరిధుల్లో కట్టబడిన ధనికుల ఆవాసాలు, బహుళ అంతస్థులను వదిలేసి, పేదల ఇళ్లను కూల్చివేస్తున్నతీరు సహజంగానే జనంలో వ్యతిరేకత పెంచుతోంది… మొత్తం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడుకుండిపోయింది… ఇప్పట్లో లేవదు… ఈ స్థితిలో కొత్త పెట్టుబడులు రావు… రేవంత్ రెడ్డికి ఆత్మసమీక్ష, అవసరమైన మథనం, దిద్దుబాటు ఎలాగూ చేతకావు…
సొంత పార్టీలోనే నైరాశ్యం… నామినేటెడ్ పదవులు, మంత్రవర్గ విస్తరణ, పార్టీలోని గ్రూపుల మాట అటుంచితే… చివరకు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ముఖ్యుల్లో కూడా ఎందుకో బాగా అసంతృప్తి పెరుగుతోంది… రేవంత్ రెడ్డిలోనూ అసహనం పెరిగిందని అంటున్నారు… హైకమాండ్ పెడుతున్న భారీ టార్గెట్లు ఎలా ఫుల్‌ఫిల్ చేయాలో తెలియక సతమతం అవుతున్నాడా..? పాలన యంత్రాంగం మీద ఈరోజుకూ పట్టుచిక్కలేదు… పైగా కేసీయార్‌ను అక్రమాల కేసుల్లో బుక్ చేసే అన్ని ఆలోచనలూ ఎక్కడికక్కడ ఆగిపోయాయి… మొదట్లో వరుసకట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారు ఇప్పుడు…
ఫార్మాసిటీ గందరగోళం అలాగే ఉంది, మరోవైపు ఫ్యూచర్ సిటీ అట… అబ్రకదబ్ర అనగానే నగరాలు నిర్మితమైపోవు, ప్రత్యక్షం కావు… బీఆర్ఎస్ పదే పదే చేస్తున్న విమర్శల ట్రాపులో పడి రుణమాఫీ విషయంలో తొందరపడ్డారు… అడ్డదిడ్డంగా మాఫీ… దాంతో పల్లెల్లోనూ ఆగ్రహాలు… కరెంటు వ్యవస్థ గాడితప్పింది… సంస్థాగత నిర్మాణం బలంగా లేనందున ఈరోజుకూ బీఆర్ఎస్ కేడర్ ఇంకా సోయిలోకి రావడం లేదు, ఓటమి షాక్ నుంచి బయటకు రాలేదు, అఫ్‌కోర్స్, కేసీయార్ బయటకు రాకపోవడం కూడా ఓ కారణమే… లేకపోతే పల్లెల్లో ఇంకా రేవంత్ వ్యతిరేకత పెరిగి ఉండేది… బీఆర్ఎస్ అసలు ఉనికి ఉంటుందా అనే దురవస్థ నుంచి మళ్లీ ప్రాణం పోసుకుంటున్న స్థితికి ఎవరు కారకులు…?
హైడ్రాలు, వరదలు, జనం కష్టాలు… ఏవీ కేసీయార్‌ను బయటికి రప్పించడం లేదు… తను అంతే… ఓ నియంత… జనం వచ్చి నీరాజనాలు పట్టాలే గానీ తను కదలడు… ఎప్పుడూ జనంలో ఉండే నేత అస్సలు కాదు… ఐనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తనకు మెల్లిమెల్లిగా మళ్లీ బలాన్ని ఇస్తోంది… రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు వంటి వ్యక్తుల జోక్యం ఎక్కువవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి… చివరకు సీఎం భాష సహా ఏదీ సజావుగా లేదు… భాషాసంస్కారం వ్యక్తికి గౌరవం… అది వ్యక్తిత్వ సులక్షణం… నేనూ కేసీయార్ భాషలోనే నడుస్తాను అనుకుంటే కాలమే చెబుతుంది ఇక…
కేటీయార్, హరీష్ ఏమీ లేకుండానే బట్టకాల్చి మీద వేసే బాపతు… ఇక రేవంత్ రెడ్డే అవకాశాలు ఇస్తున్నప్పుడు వదిలిపెడతారా..? ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేయగలుగుతున్నారు… పలు అంశాల మీద ప్రభుత్వం తరఫున కౌంటర్ చేసే గొంతు, వ్యవస్థ లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి… బీజేపీకి ఎంతగా సరైన సారథి, మార్గదర్శనం లేకపోయినా సరే, నగరంలో బీజేపీ పట్ల సానుకూలత ఉంది… మోడీపై సానుకూలత అది… ఇక ఈ హైడ్రాలు, బుల్డోజర్లు ఇలాగే నడిస్తే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గనుక బీజేపీ జెండా ఎగరేస్తే… అక్కడి నుంచి రేవంత్ రెడ్డి కెరీర్ టర్న్ తీసుకునే అవకాశం మాత్రం లీలగా కనిపిస్తూనే ఉంది..!!
Share this Article