.
సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు… నిన్న కేరళలో కూడా అంతే… చివరకు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ మోడీ పేరు చెప్పి వోట్లు అడుగుతుంది, కాంగ్రెస్‌కు అది చేతకావడం లేదు, లింక్ మిస్సవుతోంది, అందులో విఫలమవుతోంది, జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడగాలి అంటాడు…
మేం మొన్నటి ఎన్నికల్లో సోనియా పేరు చెప్పి ఓట్లడిగాం, అందుకే గెలిచాం అని సూత్రీకరించాడు… నిజమేనా..? 2014లో… అంటే సోనియా తెలంగాణ ఇచ్చిన వెంటనే జరిగిన ఎన్నికలు… సోనియా పేరే చెప్పింది కాంగ్రెస్ ఓట్ల ప్రచారంలో… కానీ ఏం జరిగింది..? జనం ఎవ్వరూ పట్టించుకోలేదు… ఫలితంగా ఒక దశలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను నిమజ్జనం చేయడానికి సిద్ధమైన కేసీయార్ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు…
Ads
మొన్నటి ఎన్నికల్లోనూ సోనియా పేరు కాదు కాంగ్రెస్‌ను గెలిపించింది… కేసీయార్ మీద తెలంగాణ జనంలో ప్రబలిన వ్యతిరేకత మాత్రమే కాంగ్రెస్‌ను గెలిపించింది… ఆ వ్యతిరేకతను బీజేపీ సొమ్ము చేసుకోలేక, రాష్ట్రంలో దానికి సరైన నాయకత్వం లేక చతికిలపడింది… ఇప్పుడైనా సరే, ప్రముఖ జాతీయ నాయకుడు, జాతి ఆశాకిరణం రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓట్లడిగి చూడండి… ఢిల్లీ ఫలితమే వస్తుంది…
రేవంత్ రెడ్డి పేరుతో ఓట్లడిగితే ఓటర్లు అగ్రకులాన్ని చూస్తారు, మేం బీసీలం తనకు ఎందుకు ఓట్లేయాలని అడుగుతారు, అదే సోనియా పేరు చెబితే కులాన్ని పెద్దగా పట్టించుకోరు అని మరో డొల్ల సూత్రీకరణ కూడా చేశాడు… తను ఏం చెప్పాలనుకున్నాడో గానీ… ఒక నాయకుడు బలంగా ఎదిగితే, జనాన్ని కన్విన్స్ చేయగలిగే ధోరణిలో వెళ్తే కులాన్ని, మతాన్ని ఓటర్లు చూడరు… సో, జాతీయ నాయకుల పేర్లతో ఓట్లడిగితేనే బెటర్ ఫలితాలనే విశ్లేషణ జస్ట్, అబ్సర్డ్…
అలాగే… దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలి, కేంద్రంపై పోరాడాలి, జనాభాకు సంబంధం లేకుండా 50 శాతం సీట్లు పెంచాలి, కేంద్రంపై పోరాటానికి చొరవ తీసుకొమ్మంటే నేనే తీసుకుంటాను అంటున్నాడు… పదేళ్లు పాలించిన యూపీఏ దీనిపై ఎందుకు మాట్లాడలేదు..? సౌత్ తిరుగుబాటు ఆలోచనలకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతునిస్తుందా..? రాహుల్ గాంధీతో ఈ మాట అనిపిస్తాడా రేవంత్ రెడ్డి..? అవునూ, అసలు ఎంపీ సీట్లు ఎందుకు పెరగాలి..? జనాభా గాకుండా సీట్ల పునర్విభజనకు వేరే శాస్త్రీయ, సరైన ప్రాతిపదికలే దొరకవా..?
పీవీకి కాంగ్రెస్ బాగా గౌరవం ఇచ్చింది, న్యాయం చేసిందంటాడు… కాంగ్రెస్ వరకూ వోకే, సోనియా కాంగ్రెస్ అవమానించింది అనేది నిజం కాదా..? పీవీకి సోనియా చేసిన అవమానాలు, ద్రోహాల గురించి పదే పదే ఇంకా చెప్పుకోవడం, గుర్తుచేసుకోవడం అవసరమా..? సోనియా విధేయతలో పడి తెలంగాణవాడి ఆత్మగౌరవాన్ని కించపరుచుకోవడం కాదా ఇది..?
జమిలి ఎన్నికలు ఒక వ్యక్తి, ఒక పార్టీ అనే మోడీ రహస్య ధోరణిని అంగీకరించబోం, కానీ వన్ స్టేట్, వన్ ఎలక్షన్ బెటర్ అంటాడు రేవంత్ రెడ్డి… అంటే ఒక రాష్ట్రంలో అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగాలట, కానీ దేశంలో అన్ని ఎన్నికలు మాత్రం జరగొద్దట… వన్ నేషన్ వన్ ఎలక్షన్ అప్రజాస్వామికం అయినప్పుడు, వన్ స్టేట్ వన్ ఎలక్షన్ కూడా అంతే కదా మరి..!
హర్యానాలో కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ నష్టం చేశాడు, అది ఢిల్లీలో తనను దెబ్బతీసిందట… అంటే కాంగ్రెస్ పరోక్షంగా కావాలనే ఆప్‌ను దెబ్బతీసిందని అంగీకరిస్తున్నాడా..? అదే చెప్పదలుచుకున్నాడా..?
తమకు రాజకీయ అవసరాల కోణంలో మాత్రమే మోడీ బడ్జెట్ కేటాయింపులు చేయడం, ఆ రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు ఇవ్వడం, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సరైన నిధులు ఇవ్వకపోవడం ఖచ్చితంగా మోడీ ప్రభుత్వ మూర్ఖ విధానమే… దాన్ని మరింత బలంగా చెప్పలేకపోయాడు రేవంత్ రెడ్డి…
ఎస్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బీజేపీ అనుకూలత కోసం ఉద్దేశించబడిన విధానమే… కానీ ఓ జాతీయ పార్టీ అనే కోణంలో అది కాంగ్రెస్‌కు కూడా మేలు కదా… జాతీయ అంశాలు చర్చకు వస్తాయి ఓటర్లలో… సోనియా, రాహుల్ పేర్లు, పద్ధతులు కూడా చర్చకు వస్తాయి… లోకల్ లీడర్ల పేర్లకు బదులు జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడిగితే కాంగ్రెస్‌కు మంచిదనేదే తన వాదన కదా… మరి జాతీయ జమిలి ఎందుకొద్దు..? రాష్ట్ర జమిలి ఎందుకు ముద్దు..? ఇలా చాలా అంశాల్లో సెల్ఫ్ కంట్రడిక్షన్, నిర్హేతుక వాదనలు..!!
Share this Article