ఇదే తేడా… ఒక బండి సంజయ్‌కూ, ఒక సోము వీర్రాజుకూ మధ్య తేడా ఇదే… బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అని ఓ బాంబు వేసి, ఇక దాన్ని మార్చడు తను, కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయడు, అవును అదే అన్నాను, బరాబర్ అంటాను, ఇప్పుడూ అదే అంటాను, అయితే ఏంటట అంటాడు… కానీ సోము వీర్రాజు…? బీసీ సీఎం అన్నాడు… వైసీపీకి, టీడీపీకి ఆ దమ్ముందా అనడిగాడు… సవాల్ విసిరాడు… అసలు బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందా..? సరే, ఏదో అన్నాడు… మరి దానికి కట్టుబడి ఉండాలి కదా… లేదు, యూటర్న్ తీసుకున్నాడు… ఓ సాదాసీదా సగటు రాజకీయ నాయకుడిలాగా… అబ్బే, నా మాటల్ని వక్రీకరించారు అనే ఓ రొటీన్ డైలాగు విసిరాడు… తను కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడినని మరిచిపోయినట్టున్నాడు…
అధిష్ఠానం నుంచి అక్షింతలు పడ్డాయా..? జనసేన హైకమాండ్‌కు ఫోన్ చేసి గాయిగత్తర చేసిందా..? బీసీ సీఎం అని ప్రకటిస్తే, మరి పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి ఎలా అవుతాడు..? అంటే అప్పుడే పక్కకు నెట్టేస్తున్నారా..? పవన్ కల్యాణ్ అక్కర్లేదా మీకు..? మరి ఈ పొత్తు దేనికి టైపు ఏవో ప్రశ్నలు లేవనెత్తినట్టున్నారు… నిజానికి బీజేపీలో ఫలానావాళ్లు సీఎం అని ముందే ప్రకటించడం అత్యంత అరుదు… (పీఎం కథ వేరు…) జస్ట్, పార్టీ తరఫు ప్రచారమే నడుస్తూ ఉంటుంది… అంతే తప్ప ఫలానా కులం వాళ్లకే కుర్చీ, ఫలానా మనిషికే కిరీటం టైపు ప్రాపగాండాను పార్టీ ఇష్టపడదు… నాగపూర్ సెంట్రల్ హెడ్డాఫీసు కూడా ఒప్పుకోదు… సో, సోము వీర్రాజుకు తన స్టేట్మెంట్ మంట తన నషాళానికే అంటింది… అందుకని యూటర్న్ తప్పలేదు…
Ads
ఐనా… రాజకీయాల్లో కవరింగు అనేది ఓ కళ… తను అనివార్యంగా యూటర్న్ తీసుకోవల్సి వచ్చిందీ అనుకుందాం… అప్పుడు ఏమనాలి..? అవును, నేను చెప్పింది నిజమే… కాపులను బీసీల్లో చేరుస్తాం అంటూ ఓ కొత్త హామీని వదిలితే సరి… ఆటోమేటిక్‌గా పవన్ కల్యాణ్ బీసీల్లోకి వస్తాడు కదా… పంచాయితీ ఖతం… పవన్ కల్యాణ్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదప్పుడు… లేకపోతే వాట్సప్ యూనివర్శిటీకి చెప్పి, అసలు పవన్ కల్యాణ్ కోసమే ఈ కొత్త బీసీ మంత్రాన్ని సోము వీర్రాజు తెరపైకి తీసుకొచ్చాడు అనే ప్రచారాన్ని పుష్ చేస్తే సరిపోయేది… ప్చ్, ఏపీలో దొరికే బీర్ల గురించి కామెంట్లు చేసినంత వీజీ విషయం కాదు సారూ, కాబోయే సీఎం గురించి గొప్పల తిప్పలకు పోవడం…!! కానీ ఒక్క డౌట్ రాజు గారూ… మీ పోలవరానికీ, తెలంగాణ కిషన్‌రెడ్డికీ సంబంధం ఏమిటి, ఆయన కృషి వల్లే ఆ నిర్మాణం జరుగుతూ ఉండటం ఏమిటి..? తను ఏపీ లీడర్ కాదు, తను సాగునీటి మంత్రి కాదు, తను ఏపీ పార్టీ ఇన్‌ఛార్జి కాదు, తను మేఘా ప్రతినిధి కాదు, తను జగన్ దోస్త్ కాదు, మరి ఈ లాజిక్ ఏమిటబ్బా..?!
Share this Article