ఎవరికైనా ఓ పదవి దక్కినా, అదృష్టం పట్టినా, అందలం ఎక్కినా, లాటరీ చిక్కినా, శుభసందర్భం ఏదైనా సరే… శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, స్నేహితులు వెళ్తారు… బొకేలు ఇస్తారు, అలుముకుంటారు, నోట్లో స్వీట్లు పెడతారు, అభినందనలు చెబుతారు… ఆనందాన్ని షేర్ చేసుకుంటారు… అది మంచి సంప్రదాయం… కానీ తెలుగునాట కొన్ని డిఫరెంట్… (నాయకుల కాళ్ల మీద పడి మీడియా సంస్థలు పాకుతూ, నాకుతూ బానిసల్లాగా మారాయి అనే ఒక జనరల్ అబ్జర్వేషన్ ఉంది కదా… అది ఇక్కడ పనిచేయదు… ఇక్కడ నాయకులే మీడియా సంస్థలంటే ‘‘ఎక్కువ భయగౌరవాల్ని’’ ప్రదర్శిస్తూ ఉంటారు… అంతటి అద్వానీలు, అమిత్ షాలు సైతం ఫిలిమ్ సిటీకి వెళ్లి, రామోజీరాముడి దర్శనభాగ్యాన్ని పొంది, దీవెనలు పొందుతారు… అంతెందుకు, మోడీ తొలి ప్రమాణస్వీకారం సమయంలో ‘‘తన సపోర్టర్’’ చంద్రబాబును ఏదో నాలుగో వరుసలో పడేసి, రామోజీరావును ముందు వరుసలో కూర్చోబెట్టి ఆదరించిన తీరు చూశాం కదా… చంద్రబాబు అయితే రామోజీరావు ‘‘ఆస్థాన కార్యకర్త’’లాగే వ్యవహరించేవాడు…
రామోజీరావు అడుగుజాడల్లో నడిచేవాడు రాధాకృష్ణ… దమ్మున్న పత్రిక, చానెల్ కదా… ఎవరైనా సరే తన దగ్గరకు రావాలి… ఏ శుభసందర్భమైనా సరే… వాళ్లే రాధాకృష్ణ దగ్గరకు స్వయంగా వెళ్లాలి, బొకే ఇవ్వాలి, శాలువా కప్పాలి… కంగ్రాట్స్ బ్రో అని గట్టిగా ‘‘అభినందించుకోబడాలి…’’ తమ ఆనందాన్ని అలా షేర్ చేసుకోవాలి… పీసీసీ అధ్యక్షపదవి దక్కాక రేవంత్ ఇలా వెళ్లాడు, అలాగే అభినందించబడ్డాడు… అదృష్టవంతుడు… ఆర్కే ఆశీస్సులు పొందడం మామూలు విషయం కాదు… అక్కడెక్కడో బస్సు యాక్సిడెంటై యాభయ్యో, అరవై మందో చనిపోతే వెళ్లడానికి మనస్కరించని కేసీయార్, ఆంధ్రజ్యోతి ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ అయితే ఆగమేఘాల మీద వెళ్లి రాధాకృష్ణకు అండగా నిలబడ్డాడు… అర్థమైంది కదా… చాలామంది నాయకులు పరామర్శకు లైన్లు కట్టి, జీవితాల్ని చరితార్థం చేసుకున్నారు… ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసీయార్, జగన్, చంద్రబాబు సహా ఎవరైనా సరే… ఆ నలుగురిలో ఎవరో ఒకరి ఆశీస్సుల్ని స్ట్రాంగ్‌గా పొందాలి… పొందుతారు… రామోజీరావు, చినజియ్యరుడు, రాధాకృష్ణ, స్వరూపానందుడు… ఆ దీవెనలకు బలమెక్కువ… మహత్తు మహా ఎక్కువ… మనకు కష్టమొచ్చినా సరే, వెళ్లి, పరామర్శించబడాలేమో…
Ads
అంతెందుకు… ఇదే రేవంతుడికి రేప్పొద్దున అకస్మాత్తుగా అదృష్టం వద్దన్నా తన్నుకొచ్చి, సీఎం చాన్స్ గనుక దక్కితే… ఫస్ట్, రాధాకృష్ణ దగ్గరకు వెళ్లి, దీవెనలు తీసుకుని… నీకెందుకు బ్రో, నేనున్నా కదా, వెళ్లు, ధైర్యంగా ఆ కుర్చీలో కూర్చో, వెనక నేను లేనా ఏం..? అని ‘‘ఆశీర్వదించబడి’’ మరీ ప్రమాణస్వీకారానికి వెళ్తాడేమో… దీనికి తెలుగులో భావగౌరవదారిద్య్రం అనే పదమేదో ఉందని ఇప్పుడే ఓ మిత్రుడు చెప్పాడు… బాబు ప్రమథగణంలో సభ్యులు కదా, అందుకే రాధాకృష్ణకూ, టీవీ5 నాయుడికీ శాలువాలు కప్పి… ‘‘అభినందించుకోబడ్డాడు’’ అంటారు కొందరు… వెళ్లమనండి, మీడియా సాయం కోరడమే రేవంత్ పర్యటనల్లో ఉద్దేశమైతే… వీ6, వెలుగు వివేకుడినీ… నమస్తే తెలంగాణ ఎడిటర్ కృష్ణమూర్తినీ… టీవీ9 రామేశ్వరరావునూ… టీన్యూస్ సంతోష్‌నూ… సాక్షి ఓనర్ భారతీరెడ్డినీ… తదితరులనూ కలిసొస్తే బాగుంటుందేమో…!! (రూపాలు వేరు… మళ్లీ జగన్ ఒకరూపంలో, చంద్రబాబు మరోరూపంలో తెలంగాణ మీదకు వచ్చేస్తున్నారు…)
Share this Article